Home / Inspiring Stories / ఒక్కడు మొదలెట్టాడు…వేలాది మంది నడుం కట్టారు… ఇది ముంబై బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ కథ.

ఒక్కడు మొదలెట్టాడు…వేలాది మంది నడుం కట్టారు… ఇది ముంబై బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ కథ.

Author:

ఒక్క మనిషి తలుచుకుంటే ఎంతటి ఆసాధ్యాన్నైనా సాధించ వచ్చని ముంబై కి చెందిన లాయర్ అఫ్రోజ్ షా  నిరూపించారు. వాకిట్లో నిలబడి ఒక్క అడుగు కూడా వేయకుండా వారణాసి చాలా దూరం అనుకుంటే జీవితం లో అక్కడికి చేరలేము. ప్రపంచంలోనే పొడుగైన సముద్ర తీర బీచుల్లో ముంబై వరసోవా బీచ్ ఒకటి. గత కొన్ని దశాబ్దాలుగా ఆ బీచ్ లో చెత్త వేస్తూ దాన్ని డంప్ యార్డులా మార్చేసారు. దాదాపు 5 అడుగుల ఎత్తు ప్లాస్టిక్, చెత్తలతో నిండి ప్రపంచంలోనే అతి చెత్త బీచ్ లలో ఆ బీచ్ మొదటి ప్లేస్ లో నిలిచింది. అసలు ఆ బీచ్ చుట్టుపక్కలకు వెళ్ళాలంటేనే నవ రంధ్రాలు మూసుకుని వెళ్ళాల్సిన దుస్థితిలో ఉండేది ఆ ప్రాంతం. మిగతా దేశాలు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ అన్ని బీచ్ లను శుభ్రం గా ఉంచుకుంటుంటే మన ప్రభుత్వాలు మాత్రం ఆ బీచ్ ని డంప్ యార్డులా మార్చాయి.

clean-up operation a polluted Mumbai beach

2015లో ఆ ప్రాంతానికి వెళ్ళిన ముంబై హై కోర్టు లాయర్ అఫ్రోజ్ షా వరసోవా బీచ్ పరిస్థితి చూసి చలించిపోయారు. ఏలాగైనా బీచ్ ని శుభ్రం చేయాలని డిసైడ్ అయ్యి ఇతరుల కోసం ఎదురుచూడకుండా ఒక్కడే రోజూ వెళ్లి అక్కడి చెత్తను తొలగించే పని మొదలుపెట్టాడు. తరువాత ఆయన శ్రమనీ, సత్కార్యాన్ని గమనించిన ఇంటి పక్క వారు ఒకరిద్దరు జాయిన్ అయ్యారు.. కొద్ది రోజుల్లోనే ఒక్కొక్కరుగా ముంబై వాసులు అతనితో జత కట్టారు.. కొద్ది వారాలు, నెలల్లో వేలాది మంది ఒక మానవ హారంగా తయారయ్యారు. స్కూల్ విద్యార్థులు, టీచర్లు, లాయర్లు, వ్యాపారులు, సినిమా స్టార్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు ఇలా ఒకరేమిటి ప్రజలంతా నడుం బిగించారు..తట్ట, పార, పలుగు తేడా లేకుండా తలా ఓ చేయి వేసి.. 85 వారాల్లో మొత్తం 5 వేల టన్నుల చెత్తను ఊడ్చి పారేసారు.. అసలు ఇదేనా మన వరసోవ బీచ్ అనేలా రూపు రేఖలు మార్చేసారు. ఒకప్పుడు చెత్తా చెదారంతో మురుగు కంపు కొట్టిన బీచ్ బంగారు వర్ణం లో మెరిసిపోతున్న ఇసుక, సముద్ర జలాలతో ప్రశాంత వాతావరణం లోకి మారిపోయింది.

ఇంతటి బృహత్ పర్యావరణ సంరక్షణ కార్యక్రమాన్ని ఒక ఉద్యమం లాగ చేపట్టినందుకు గానూ యునైటెడ్ నేషన్స్ సంస్థ గత ఏడాది షాని ఛాంపియన్ అఫ్ ద ఎర్త్ అవార్డుతో  సత్కరించింది. ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం, ఈ జన్మభూమి కార్యక్రమాన్ని, ప్రపంచంలోనే అతి పెద్ద శుధ్ధి కార్యక్రమం గా అభివర్ణించింది. క్లీన్ చేయడమే కాదు దాన్ని కాపాడుకోవడమూ మన చేతుల్లోనే ఉంది..అది తమ బాధ్యతగా ఫిక్సయ్యారు అందుకే.. ఆ బీచ్ లో కొబ్బరి చెట్లు నాటారు. అంతే కాదు బీచ్ చుట్టూ పక్కల ఉన్న మరుగు దొడ్లను కూడా శుద్ధి చేసారు. మన చుట్టూ ఉండే పర్యావరణం కాపాడుకోవడం అంటే మన అంతరాత్మని మనం శుద్ధి చేస్కోని కాపాడుకోవడమే అని షా అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు దేశం లో ఉన్న మిగతా బీచుల్లో కూడా చేసి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలని కూడా సూచించారు. మరి మన హుస్సేన్ సాగర్ ని శుద్ధి చేయడానికి కూడా ఇలాంటి షా ఒకరు నడుం బిగించాలేమో ?

(Visited 458 times, 1 visits today)