తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఆయన స్వగ్రామమైన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆయనకు చెందిన సంస్థల కార్యాలయాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పోట్లదుర్తిలోని సీఎం రమేశ్ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు చేరుకున్నారు.
ఆ సమయంలో రమేశ్ సోదరుడు సీఎం సురేశ్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అధికారులు ఆయన్ని బయటకు పంపించివేసి ఇంటి తలుపులు మూసివేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు అన్ని గదుల్లోనూ తనిఖీలు చేపడుతూ పలు దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్ నివాసంతో పాటు ఆయనకు చెందిన రుత్విక్ అనే సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.