Home / Inspiring Stories / జన హృదిని గెలిచిన లోకనాయకుడు…ఆయన లేని భారత చరిత్ర అసంపూర్ణం!

జన హృదిని గెలిచిన లోకనాయకుడు…ఆయన లేని భారత చరిత్ర అసంపూర్ణం!

Author:

అదొక ఉవ్వెత్తున ఎగిసిపడే కడలి తరంగం….ఆ తరంగం మనిషి రూపం దాల్చితే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్…ఈ రోజు ఆయన జన్మదినం…శిఖర సమాన వ్యక్తిత్వానికి నిలువెత్తు దర్పణం…..భారత జాతి పౌరుషానికి సరిసమానమైన సంతకం ….1902 అక్టోబర్ 11 నజయప్రకాశ్ నారాయణ్ బలియా  జిల్లాకు, బీహార్ లోని సారన్ జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల విద్య, కళాశాల విద్యాభ్యాసమంతా ఆయనకు పాట్నా లోనే నడిచిపోయింది. ఆ తర్వాత, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్ళి 1929 లో భారత దేశం తిరిగివచ్చారు జయప్రకాష్. అమెరికా లో ఉన్న సమయంలో కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే ఎం.ఎన్.రాయ్ రచనల ప్రభావానికి లోనయ్యాడు.1920 లో  ఆయన కస్తూర్ బా గాంధీ అనుచరురాలు అయిన ప్రభావతీ దేవిని వివాహం చేసుకున్నారు. అమెరికానుండి వచ్చిన వెంటనే జవహర్ లాల్ నెహ్రూ  ఆహ్వానం మేరకు భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడుగా మారాడు.

1932 లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించాడు. విడుదలైన తరువాత కాంగ్రెసు లో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి కి జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యారు.

1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ కాంగ్రెసు నేతలంతా అరెస్టయిన సమయంలో జయప్రకాశ్ నారాయణ్ రామ్ మనోహర్ లోహియా, బాసవన్ సింగ్ వంటివారితో కలసి ఉద్యమాన్ని ముందుండి నడిపాడు.

స్వాతంత్ర్యానంతరం ఆయన, బాసవన్ సింగ్ మొదలైన వారితో కలసి కాంగ్రెసు నుండి బయటకు వచ్చి తమ సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. తర్వాత అదే సోషలిస్టు పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీ గా మారి బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించింది.

1954 లో జయప్రకాష్ నారాయణ్ రాజకీయాల నుంచి  విరమించుకున్నట్టు ప్రకటించి, తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబా భావె  సర్వోదయ ఉద్యమానికి,  దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశారు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిబాగ్‌ లో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకునారు. 1960 వ దశకం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి బీహార్ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించడం మొదలెట్టారు. 1974 లో బీహారు లో జయప్రకాష్ నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం, ఆ తర్వాత బీహార్ ఉద్యమం గా ప్రసిద్ధి పొందిన ఒక ప్రజా ఉద్యమంగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ఈ ఉద్యమ సమయంలోనే విద్యార్ధి నేతలుగా బాహ్య ప్రపంచానికి పరిచమయ్యారు. ఆ ఉద్యమ సమయం లోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవానికి జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ని దోషిగా పేర్కొంటూ అలహాబాద్ హై కోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేశారు. మిలిటరీకి,  పోలీసు యంత్రాంగానికి కూడా చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇందిరాగాంధీ 1975 జూన్ 25 అర్థరాత్రి నుంచే దేశంలో అత్యవసర పరిస్థితి ని విధించింది. జె.పి. ని, ఇంకా  ఇతర ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ లోనే యంగ్ టర్క్ లుగా పిలుచుకునే అసమ్మతి నేతలను కూడా అరెస్ట్ చేసింది. జయప్రకాష్ నారాయణ్ ను చండీగఢ్ లో డిటెన్యూ గా ఉంచారు. బీహార్ వరదల సమయంలో ..ఆ రాష్ట్రంలో పునరావాస కార్యక్రమాన్ని పర్యవేక్షించటానికి పెరోల్ పై విడుదల కోరినా కూడా ప్రభుత్వం తిరస్కరించినది. ఆఖరికి ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేశారు.

చివరికి ఇందిరా గాంధీ 1977 జనవరి 18 న ఎమర్జెన్సీ ని తొలగించి ఎన్నికలను ప్రకటించారు. ఆమెను ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా , జయప్రకాష్ నాయకత్వం లో జనతా పార్టీ ఏర్పడింది. ఆ ఎన్నికలలో కాంగ్రెసు ను ఓడించి, ఇందిర ను గద్దె దింపి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించింది.

భారతదేశం లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 1979 అక్టోబర్ 8 నా తుది శ్వాస విడిచారు1998 లో భారత ప్రభుత్వం ఆయనకు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది . కాంగ్రెసేతర పార్టీలను, లౌకిక శక్తులను కూడగట్టడం లో జయప్రకాష్ నారాయణ్ చేసిన సేవలను ఇప్పటికీ చరిత్రలో ప్రముఖంగా ప్రస్తావిస్తారు.

 

(Visited 302 times, 1 visits today)