Home / Political / హింసాత్మకమవుతోన్న కుల ఉద్యమాలు.

హింసాత్మకమవుతోన్న కుల ఉద్యమాలు.

Author:

jat-quota-row-haryana-afp

కులాలూ, రిజర్వేషన్లూ దేశ రాజకీయాలనే కుదిపేయ గల అంశాల్లో మొదటి వరుసలో ఉండే విషయాలివి. మొన్నటికీ మొన్న కాపు కులస్తులని బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ తో జరిగిన నిరసన ఎలా హింసాత్మకంగా మారిందో మనమింకా మర్చిపోలేదు…. ఏకంగా ఒక నడుస్తున్న రైలును ఆపి మరీ ప్రయణీకులను బలవంతంగా దించేసి తగలబెట్టటం ఇంకా ప్రజలు మర్చిపోకముందే రోహ్ తక్ లో అధిక సంఖ్యలో ఉండే జాట్‌ సామాజిక వర్గానికి ఓబీసీ కోటా రిజర్వేషన్‌ కోసం చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారి, పోలీసు కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇప్పటికే 12 మంది మరణించగా 150 మంది గాయపడ్డారు. ఆ తర్వాత కూడా ఆందోళనకారులు విధ్వంసం, దహనకాండకు పాల్పడటంతో 9 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం 3,300 మంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రెండు జిల్లాల్లో కర్ఫ్యూ ప్రకటించి, కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే శనివారం పాఠశాలల మూసివేతకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌, ఎస్సెమ్మెస్‌ సేవలను నిలిపివేసింది. అంతకు ముందు రోహతక్‌, ఝజ్జర్‌, హన్సి జిల్లాలు సహా అనేక చోట్ల ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. ఈ క్రమంలోనే రోహ్‌తక్‌ బైపాస్‌  పైన చేపట్టిన ఆందోళన హింసాత్మకమైంది.

పోలీసులనే నిర్బంధించిన ఆందోళన కారులు, రాష్ట్ర ఆర్థిక మంత్రి అభిమన్యు నివాసంతో పాటు ఒక పాఠశాల, రెండు టోల్‌ ప్లాజాలు, పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు సహా పోలీసు, ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు. విచక్షణర హితంగా విరుచుకుపడిన గుంపు నుంచి ఆత్మరక్షణ కోసం బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాల్పులు జరిపారని డీజీపీ యశ్‌పాల్‌ సింగ్‌ రాజధాని చండీగఢ్‌లో విలేకరులకు చెప్పారు. ఈ సంఘటనలో ఒకరు మరణించగా తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అయితే మరో ఇద్దరు కూడా మరణించారంటూ వస్తూన్నా మీడియా కథనాల్లో వాస్తవం లేదన్నారు. మరో 22 మంది బుల్లెట్‌ గాయాలతో నలుగురు సాధారణ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. క్షతగాత్రులలో ఐదుగురు భద్రత సిబ్బంది కూడా ఉన్నారన్నారు. ఇక ఇక జాట్‌ల డిమాండ్లపై చర్చించేందుకు హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమస్యకు పరిష్కారంపై ఆయన హామీ ఇచ్చినా వారు ససేమిరా అంటూ ఆందోళనను తీవ్రం చేయడం గమనార్హం. రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, మనోహర్‌ పరీకర్‌, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌ తదితరులు రాత్రి పొద్దుపోయాక సమీక్షించారు. జాట్‌ల ఆందోళన ఫలితంగా కొన్ని ముఖ్యమైన రైళ్లను అధికారులు రద్దుచేశారు. జాట్‌ల ఉద్యమం ఒక నాయకుడు లేని అరాచకులు నడుపుతున్న పోరాటంగా తయారైందని బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్‌ జైన్‌ వ్యాఖ్యానించారు. ఇక జాట్‌లు, జాటేతరుల పేరిట బీజేపీ కుల రాజకీయాలు చేస్తున్నదని ఆ ఉచ్చులో చిక్కు కోకుండా ఆందోళన విరమించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జాట్‌ నేతలకు విజ్ఞప్తి చేశారు.

(Visited 173 times, 1 visits today)