Home / Inspiring Stories / ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలా..? మాకు ఫోన్ చేయండి..! మా సేవలన్నీ ఉచితమే..!

ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలా..? మాకు ఫోన్ చేయండి..! మా సేవలన్నీ ఉచితమే..!

Author:

గుండె ఆపరేషన్‌ తప్పనిసరి చేయాలని వైద్యుడు చెపినపుడు.. మన మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఎంత అవుతుందనే కదా..! ఆ తరవాతే బీమా సౌకర్యం, ఎన్నిరోజుల్లో ఇంటికొస్తాం వంటివి అడిగి తెలుసుకుంటాం. తర్వాత, మరో ఇద్దరు ముగ్గురు వైద్యుల్ని సంప్రదించాకే ఓ నిర్ణయానికి వస్తాం. వీటన్నింటికీ సమాయంతో పాటుగా డబ్బూ.. వృథా అవుతుంది. ఇలాంటి పరిస్థితిని గుర్తించిన ‘రావూరి నివేదిత’ భర్తతో కలిసి ‘కేర్‌ మోటో’ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఉచితంగా రోగుల సందేహాల్ని తీర్చడం, అత్యుత్తమమైన వైద్య సేవల వివరాలు అందించడం, అవసరమైన శస్త్రచికిత్సల్ని వీలైనంత తక్కువ ఖర్చులో అందించడమే వీరి లక్ష్యం. అసలు ‘కేర్‌ మోటో’ అంటే ఏంటి..? దీని ఉద్దేశం ఏంటి..? అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ప్రశ్నకు సమాధానం వారి మాటల్లోనే…

caremotto

నా పేరు రావూరి నివేదిత నేను చిన్న పిల్లల వైద్య నిపుణురాలిని అయితే.. మా వారు గ్యాస్ట్రో సర్జన్‌. మాది ఖమ్మం జిల్లాలోని చిన గోపతి అనే పల్లెటూరు. ఇద్దరం కొన్నాళ్లు చెన్నైలో పనిచేసి మూడేళ్ల క్రితమే హైదరాబాద్‌ వచ్చాం. వైద్యులుగా రోగుల కష్టాలూ, ఆర్థికంగా వారు ఎదుర్కొనే ఇబ్బందుల్ని కళ్లారా చూశాం.. ఆ తరవాతే ‘కేర్‌ మోటో’ సేవల్ని ప్రారంభించాం. ఇక్కడా వేర్వేరు ఆస్పత్రుల్లో పనిచేస్తునే ‘కేర్‌మోటో’ను స్థాపించాం.

3 వేలకు పైగా మందితో మాట్లాడాం:

రోగుల సమస్యల్ని వారి మాటల్లోనే తెలుసుకుంటే మరింత సమాచారం తెలుస్తుందనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చే వారితో మాట్లాడేవాళ్లం. అలా వందల్లో కాదు.. దాదాపు మూడువేల మందితో మాట్లాడి వాళ్ల సమస్యల్ని తెలుసుకున్నాం. అలాగే బీమా సౌకర్యం ఏ అసుపత్రిలో ఉందో తెలియక చాలామంది చికిత్సలు చేయించుకోవటం లేదని తెలిసింది. పెద్ద ప్రజలు ఆరోగ్యశ్రీ ఎలాంటి సమస్యలకి వర్తిస్తుంది, దేనికి వర్తించదు అనేది తెలుసుకునేందుకు ప్రాధాన్యమిస్తారు. అయితే చాలామంది చికిత్సలను వాయిదా వేసి సమస్యను ఇంకా పెంచకోవడమూ మేము గమనించాం. ఇలాంటివాటన్నింటిపై ఓ అంచనాకు వచ్చాకే గతేడాది మా సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ముందుగా ‘మీకు ఏవైనా శస్త్రచికిత్సలకు సంబంధించిన సమాచారం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి’ అంటూ ఓ ఫోను నెంబరు ఇచ్చి యాభై వేల కరపత్రాలను ముద్రించి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాటిని పంచటం జరిగింది. ఆ రోజు మాకు చాలా ఫోన్లు వచ్చాయి. కొందరు ‘మాకు నిర్ణీత ధరలో చికిత్స చేసే ఆసుపత్రి ఉంటే చెప్పండి’ అని అడిగారు. మరికొందరు ఫలానా చికిత్స ఏ ఆసుపత్రిలో బాగా చేస్తారు అనీ, సౌకర్యాలు ఎక్కడ బాగుంటాయి, బీమా సేవలూ.. ఇలా ఎన్నో సందేహాలు అడిగి తెలుసుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకి మా నెంబరు ఇచ్చి ఫోన్లు చేయించినవారూ కూడా చాలా మందే ఉన్నారు.

హెల్ప్‌లైను నెంబరు ఏర్పాటు:
ఇవన్నీ చూశాక మా సేవలు సామాన్య ప్రజలకు తప్పకుండా ఉపయోగపడతాయని అనిపించింది. అందుకే రోగుల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైను నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చాము. ఉదయం 10 నుంచీ సాయంత్రం 5 గంటల వరకూ వైద్యరంగంలో పదేళ్ల అనుభవం ఉన్న మా నిపుణులు అందుబాటులో ఉంటారు. చేయించుకోవాల్సిన చికిత్సలూ, ఆసుపత్రులూ, సదుపాయాలకు సంబంధించి ఏ సందేహం ఉన్నా మా నిపుణులు తీరుస్తారు. అలాంటివాళ్లను ఏర్పాటు చేయడంతోపాటూ మేం చేసిన మరో పని.. నిర్ణీత ధరలో చికిత్స చేసేలా ఆసుపత్రులతో మాట్లాడటం. అంటే.. ఒక శస్త్రచికిత్సకు ఎంత డబ్బు అవుతుందని వైద్యులు చెబుతారో.. అంతే తీసుకునేలా ఆస్పత్రులతో మాట్లాడాం. ఇదంతా ఒక్కరోజులో జరగలేదు. ఇందుకోసం మేం హైదరాబాద్‌లోని దాదాపు ఆరొందల యాభై ఆసుపత్రుల్ని పరిశీలించాం. అక్కడ సదుపాయాలూ, శుభ్రతా, సేవలూ, చికిత్సానంతరం వారందించే సాంత్వన మార్గాలు.. ఇలా ఒకటి కాదు చాలా వివరాలు తెలుసుకున్నాం. అన్నివిధాలుగా సంతృప్తి చెందాక నూట ముప్ఫై ఆసుపత్రులను గుర్తించాం. వారితో మాట్లాడి రోగ నిర్ధరణ అనంతరం వాళ్ల దగ్గరకు రోగుల్ని పంపుతామంటూ పొత్తు కుదుర్చుకున్నాం. మమ్మల్ని విజయవాడ, కాకినాడ, తణుకు, వైజాగ్‌, కర్నూలు, అనంతపురం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ల నుంచి ఎక్కువగా సంప్రదిస్తుంటారు.

మా సేవలన్నీ ఉచితమే.. 

కొందరు మాకు ఫోన్‌ చేసి ‘మీ ద్వారానే మాకు చికిత్స చేయించండి’ అని అడుగుతుంటారు. అలాంటివారికీ సాయం చేస్తాం. మా నిపుణులు ఫోనులోనే వారి ఆరోగ్యం, అలవాట్లూ, ఏ సమస్యకు మందులు వాడుతున్నారు.. చేయించుకోవాలనుకుంటున్న చికిత్స.. ఇలాంటివన్నీ తెలుసుకుంటారు. ఆ వివరాలను మా దగ్గరున్న ఆస్పత్రుల్లో ఒకదానికి అందజేస్తాం. వాళ్లతో మాట్లాడి చికిత్స తేదీనీ, సమయాన్నీ నిర్ణయిస్తాం. ఆ రోగులు ఆసుపత్రికి రావడానికి మందు ఎలా సిద్ధం కావాలో ఫోనులోనే సూచిస్తాం. ఆసుపత్రికి వెళ్లడానికి ముందు మా వద్దకు వచ్చి కేవలం ఓ అడ్మిట్‌ కార్డు తీసుకెళితే చాలు. దాన్ని మేం సూచించిన ఆసుపత్రిలో చూపిస్తే వెంటనే గది కేటాయిస్తారు. చికిత్సలో ఎక్కడ ఆలస్యం జరగదు. వైద్యులు ఒకసారి వాళ్ల రిపోర్టులు చూసి నేరుగా శస్త్రచికిత్స చేస్తారు. రోగులను ఇంటికి వెళ్లే వరకూ ‘కేర్‌ మోటో’ వ్యక్తిగానే పరిగణిస్తారు. మేం అందించే ఫోను సమాచారం, చికిత్స ఏర్పాట్లూ అన్నీ ఉచితమే. గతేడాది మూడొందల యాభై మందికిపైగా మా సేవలు ఉపయోగించుకున్నారు. ఈ మధ్య కొందరు కౌన్సెలింగ్‌ చేయించమనీ, రిపోర్టులు నిపుణులకు చూపించాలనీ మమ్మల్ని ప్రత్యక్షంగా సంప్రదిస్తున్నారు. మా ప్యానల్‌లో ఉన్న డాక్టర్లతోపాటు.. మా సన్నిహితుల్ని పిలిపించి రోగులతో మాట్లాడిస్తున్నాం. వారాంతాల్లో కేర్‌మోటో క్లినిక్ ల ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చాం. భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకూ మా సేవలు విస్తరింపజేయాలన్నదే మా ఆలోచన. మా సేవలు కోరుకునే వారు మమ్మల్ని సంప్రదించాల్సిన నంబరు 040- 46465656. మరింత సమాచారం కోసం మా వెబ్ సైట్ వీక్షించగలరు. www.caremotto.com

 

(Visited 3,286 times, 1 visits today)