Home / Inspiring Stories / తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రత్యేకత ఏంటో తెలుసా..?!

తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రత్యేకత ఏంటో తెలుసా..?!

Author:

మేడారం తెలంగాణా రాష్ట్రంలో తాడ్వాయి మండలంలోని ఒక కుగ్రామం మామూలు రోజుల్లో మీరు వెళ్ళటానికి సరైన బస్సు సౌకర్యం కూడా ఉండని అడవి ప్రదేశం, కానీ రెండేళ్ళకొకసారి ఆ అడవి ఉత్తెజితమౌతుంది ఎక్కడ లేని ఉత్సాహంతో తుళ్ళిపడుతుంది. ఒక వీరనారీ సమర భీబత్సపు రణన్నినాదాన్ని పాటలుగా కట్టి పాడుతుంది… అడవి అమ్మకోసం ఎదురుచూస్తుంది… సమ్మక్క అడుగుల చప్పుడు కోసం వెదురు వనాలలోని పిట్టలన్నీ చెవులు రిక్కిస్తాయి… వచ్చే భక్తులకు భయం కలిగించటం ఇష్టం లేక అడవి జంతువులన్నీ కాస్త దూరంగా వెళ్ళిపోతాయి… అడవి ఆనందాన్ని కట్టుకుంటుంది… “సమ్మక్క పున్నమి” రోజు కోసం మరింత వెలుగు కోసం జంపన్న వాగు లో వెన్నెల స్నానం చేస్తాడు చంద్రుడు… రెండేళ్ళ కొకసారి వచ్చే ఈ గిరిజన కుంబమేళా కోసం దారులన్నీ మేడారం వైపుకే పరుగులు తీస్తాయి.. కొబ్బరికాయలూ,బెల్లం బుట్టాలూ (బెల్లం అచ్చులు) కుప్పలు కుప్పలుగా మేడారం చేరుకుంటాయి…లెక్కలేని సంఖ్య లో కోళ్ళూ,గొర్రెలూ సమ్మక్క తల్లికి నైవేధ్యంగా సమర్పించ బడతాయి… నిలువెత్తు బంగారం (బెల్లం),తలవెంట్రుకలూ ఇచ్చి జంపన్న వాగులో మునిగి “సల్లగ జూడు సమ్మక్కతల్లీ” అని మొక్కుకున్న భక్తులు తమ భారం సమ్మక్క మీద వేసి కొత్త భరోసాతో ఇళ్ళకి మళ్ళుతారు..

Medaram 2

రెండేళ్ళలో ఒకసారి వచ్చే సమ్మక్క మళ్ళీ అడవిలోకి అదృశ్యమౌతుంది…. కొన్ని వందల సంవత్సరాల క్రితమే అత్యంత శక్తివంతుడైన కాకతీయ సామ్రాజ్యాధి నేతనే గడ గడలాడించి సామ్రాజ్యవాదపు అధికారాన్ని ప్రశ్నించీ ధిక్కరించీ తన జనం కోసం,తన ప్రాంతం కోసమూ విప్లవించీ,విజృంబించిన ఒక వీర నారి… తెలంగాణా ధిక్కారానికి ఒక స్పూర్థి సమ్మక్క….. నిజాం వ్యతిరేక పోరాట సమయంలోనూ, సాయుధ రైతాంగ పోరాటంలోనూ, ప్రత్యేక రాష్ట్ర పోరాట విషయంలోనూ మన నరనరాల్లో జీర్ణించుకున్న ధిక్కారధోరని ఇప్పటిది కాదు, వందల ఏళ్ళ క్రితమే ఏనుగులూ,గుర్రాలూ,వేల సైన్యమూ ఉన్న కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన అడవి బిడ్డలకత..కాదు కాదు కథ కాదు చరిత్ర సమ్మక్క చరిత్ర,పగిడిద్ద రాజు చరిత్ర.. ఇది తెలంగాణా చరిత్య్ర… ఈ సమ్మక్క, సారలమ్మలు ఎవరు? వారెందుకు పోరాడారు? ఎవరెవరు ప్రాణాలర్పించారు? అని ప్రశ్నించుకున్నప్పుడు అప్పటి చరిత్రను కొంత తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది.

Sammakka Sarakka Gadde

అఖండ కాకతీయ సామ్రాజ్యాన్ని అరవై సంవత్సరాలకు పైబడీ సమర్థంగా పాలించి అనేక పోరాటాల్లో విజయాల్ని పొందిన మహా రాణీ రుద్రమదేవికి కూడా లభించని దైవత్వం సమ్మక్క, సారలమ్మలకు దక్కడం అంటే మామూలు విషయం కాదు. ససైన్యంగా దండెత్తడం వేరూ, కరవు కాటకాలతో బక్కచిక్కిన గిరిజనులని కలుపుకొని వారి పక్షాన పోరాడటం వేరు.. అదే ఆ ధిక్కరమే సమంక్కా సారలమ్మలను దైవాలను చేసింది… ఇన్ని వందల సంవత్సరాలలో. నిరూపించ బడ్డ సత్యం ఒకటే…. అధికార బలంతో చరిత్ర పుస్తకాలకెక్క వచ్చేమో గానీ… ప్రజల పక్షాన నిలచి పోరాడిన వీరులను దైవాలుగా భావించి ఆరాధించ బడటం అనేది అసంబవం.. పాలకులు ఎంత శక్తివంతులైనా, రాజ్యం ఎంత పటిష్టమైనదైనా, జయించడం అసాధ్యం అని తెలిసినా అస్తిత్వ పోరాటాన్ని ఆశ్రయించడమే కర్తవ్యంగా భావించిన సందర్భం నేటికీ జాతర రూపంలో కొనసాగివస్తున్నది.

సమ్మక్క చరిత్ర ఇదీ అని ఖచ్చితంగా చెప్పే ఆధారాలైతే ఏమీ లేవు కానీ అప్పటి కాలం నుంచీ పెద్దలు తమ పిల్లలకూ,వారు వారి పిల్లలకూ చెబుతూ వచ్చిన కొన్ని విషయాలే అందుబాటులో ఉన్నాయి. గెలిచిన వాడి చరిత్ర కాదు కదు కదా అందుకే ఈ అడవి బిడ్డలను చరిత్ర పుస్తకాలు చిన్న చూపు చూసాయి. ఇప్పటికి తెలిసిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా జగిత్యాల పొలవాస ను పాలించే గిరిజన దొర మేడరాజుకు అడవిలో దొరికిన ఏకైక కూతురు సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి తల దాచుకుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగానే ఉన్నాడు, అయితే మూడేళ్ళుగా కరవు రావటంతో కప్పం (టాక్స్) కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం., మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో మేడరాజే కుట్రలు పన్నుతున్నాడని ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు మేడారం పై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క,నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. అయితే వేలసంఖ్యలో ఉన్న కాకతీయుల సేనల దాటికి బక్కచిక్కిన అడవి యోధులు తట్టుకోలేకపోయారు… వీరి మధ్య జరిగిన భీకరపోరులో పగిడిద్దరాజు(సమ్మక్క భర్త), సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. జంపన్న సంపెంగ వాగులో దూకి చనిపోయాడు. సమ్మక్క వీరోచిత పోరాట ధాటికి తట్టుకోలేని శత్రువులు వెనుక నుంచి బల్లెంతో పొడిచారు. శత్రువును హతమారుస్తూ మేడారానికి తూర్పు దిశగా చిలకలగుట్ట వైపు సాగుతూ సమ్మక్క అదశ్యమైంది. ఆమె జాడ తెలియలేదు. వారి కుటుంబం అంతా యుద్ధంలో నేలకొరిగారు. అందుకే ఎలాంటి కల్మషం లేని గిరిజనులు తమ కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తుంచుకున్నారు. ఒక తరం, రెండు తరాలు కాదు… తరతరాలుగా తమ ఆరాధ్య దైవాలుగా కొలుస్తున్నారు. మనుషులే దైవాలు.. అని చెప్పిన మాట ఈ వీరవనితల విషయంలో నిజమని నిర్థారిస్తోంది చరిత్ర. ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా జరిగే మహత్తర జాతర గిరిజన జాతర మేడారం జాతరయే ఇంత పెద్ద గిరిజన జాతర బహుశా ఎక్కడా జరిగి వుండకపోవచ్చు.

Medaram 1

వరంగల్లు నుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఒక కీకారణ్యంలో వెలసిన కుగ్రామం మేడారానికి ప్రతి యేటా సుమారు 80 లక్షలకు పైగా గిరిజనులు, గిరిజనేతరులు వచ్చి నాటి ఆ తల్లుల త్యాగబుద్ధిని, ఆ గిరిజనుల పోరాట స్ఫూర్తిని స్మరించి తరిస్తారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా లక్షలాది భక్త సమూహం దర్శించడమేగాక తమ తమ సంతానానికి సమ్మక్క, సారలమ్మ, జంపన్న మొదలైన వీరుల పేర్లు పెట్టకొని తాము పవిత్రులమైనట్టు భావిస్తుంటారు. ఈ జాతరలో విగ్రహారాధన ఉండదు. ఎలాంటి బ్రాహ్మణాధిపత్య భావజాలమూ లేని జాతర ఇది. బ్రాహ్మణుల పూజలుండవు. వేద మంత్రోచ్ఛారణ వుండదు. కేవలం ప్రకృతి ఆరాధన, పసుపు కుంకుమలు తప్ప మరే ఇతర అచారాలు ఉండవు. గిరిజన సంప్రదాయ పద్ధతిలోనే ప్రతి రెండేండ్లకోసారి జాతర జరుపుతుంటారు. వరంగల్లు నుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఒక కీకారణ్యంలో వెలసిన కుగ్రామం మేడారానికి ప్రతి యేటా సుమారు 80 లక్షలకు పైగా గిరిజనులు, గిరిజనేతరులు వచ్చి నాటి ఆ తల్లుల త్యాగబుద్ధిని, ఆ గిరిజనుల పోరాట స్ఫూర్తిని స్మరించి తరిస్తారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా లక్షలాది భక్త సమూహం దర్శించడమేగాక తమ తమ సంతానానికి సమ్మక్క, సారలమ్మ, జంపన్న మొదలైన వీరుల పేర్లు పెట్టకొని తాము పవిత్రులమైనట్టు భావిస్తుంటారు.

Medaram Route map

మేడారం జాతరకు కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేసింది, 24 గంటలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది.

మేడారం జాతర గురుంచి మరిన్ని వివరాలకి వెబ్ సైట్ లో చూడండి – www.medaramjathara.com

Medaram Jatara Help Line Numbers:

Help Line Number 1 : 08715-223257

Help Line Number 2 : 108717-281247

Help Line Number 3 : 08717-281247

(Visited 1,965 times, 1 visits today)