Home / Inspiring Stories / బుర్రిపాలెంలో “శ్రీమంతుడు”.

బుర్రిపాలెంలో “శ్రీమంతుడు”.

Author:

Mahesh Babu Burripalem

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, తన సొంత గ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకున్న విషయం విదితమే. ‘శ్రీమంతుడు’ సినిమాలోలా గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను దత్తత తీసుకున్న మహేష్‌బాబు, ఆ గ్రామాభివృద్ధిలో తనవంతుగా పాలుపంచుకుంటున్నాడు. ఇప్పటికే మహేష్‌ సతీమణి నమ్రత బుర్రిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాల్ని సమీక్షిస్తూ వస్తున్నారు.

తాజాగా, మహేష్‌ స్వయంగా బుర్రిపాలెంలో పర్యటించి, గ్రామంలో పరిస్థితుల్ని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని గ్రామస్తులకు ‘శ్రీమంతుడు’ భరోసా ఇచ్చాడు. మహేష్‌ వెంట అతని బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా బుర్రిపాలెం పర్యటనలో కనిపించారు. మహేష్‌, గల్లా జయదేవ్‌ ఫ్లెక్సీలతో టీడీపీ శ్రేణులు బుర్రిపాలెం గ్రామంతోపాటు, సమీప గ్రామాల్లోనూ సందడి చేశారు.

ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ “బుర్రిపాలెంకు రావడం చాలా అనందంగా ఉందని,బుర్రిపాలెంకి మళ్లీ…మళ్లీ వస్తానని అన్నారు. ఈ ఊరికి నాన్మమ్మ, తండ్రి (సూపర్‌స్టార్‌ కృష్ణ), బాబాయ్‌ (ఆదిశేషగిరిరావు) చాలా చేశారని, వారితోపాటు నేనుకూడా ఎంతో కొంత చేస్తే బాగుంటుందనే ఆలోచనవచ్చిందని, శ్రీమంతుడు సినిమా చేసేటప్పుడు, బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటే బాగుంటుందని జయదేవ్‌ (బావ) సూచించారని, శ్రీమంతుడు సినిమా విడుదల అయిన తర్వాత చేద్దామని చెప్పానని…అలాగే జయదేవ్‌ తన సొంత ఊరికి ఏంచేశారో చూశానని…వాటిని చూసి స్ఫూర్తిపొందానని చెప్పారు. తనను ఇంతగా అభిమానిస్తున్న బుర్రిపాలెం గ్రామస్తులకు రుణపడి ఉంటానని” మహేష్‌ అన్నారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు చేతుల మీదుగా కొంతమందికి ఇళ్లపట్టాలు, డ్వాక్రా సంఘాలకు రూ. కోటి పంపిణీ, గ్రామస్తులకు ఆరోగ్య కార్డులు అందజేశారు.

టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. కొందరు, ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్ని సమీక్షిస్తోంటే, ఇంకొందరు పబ్లిసిటీతో సరిపెట్టారు.

(Visited 626 times, 1 visits today)