మనసున మల్లెల మాలలూగెనే… కన్నుల వెన్నెల డోలలూగెనే… ఎంత హాయి ఈ రేయి నిండెనో…
ఔను..! మల్లీశ్వరి గుర్తొస్తే మల్లెల పరిమళం తో మనసు నిండిపోతుంది. “ఏడతానున్నాడొ బావా..?” అనే ఫ్రశ్నకి ఆ మేఘమాలతో కలిసి సమాధానం వెతకాలనిపిస్తుంది… “మళ్ళీశ్వరి” గా భానుమతి ని మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. అందాల మరదలుగా,అమాయకపు మొహంలో లీనమవ్వాలనిపిస్తుంది.. ఇక ఆ రాత్రంతా ఒకే పాట వినిపిస్తుంది “మనసున మల్లెల మాలలూగెనే.. కన్నుల వెన్నెల డోలలూగెనే.. ఎంత హాయి ఈ రేయి నిండెనో.. ఎన్ని నాళ్ళకీ..బ్రతుకు పండెనో….
భానుమతి.., భానుమతంటే అందం, భానుమతంటే కొంటెతనం, నిండైన మొహంలో ఎంత ప్రశాంతత..! అనే అనుకున్నారంతా 1939 లో వర విక్రయం నాటినుంచీ మల్లీశ్వరి లాంటి సినిమా వరకూ అలానే అనుకున్నారంతా. కానీ పల్నాటి యుద్దం లో నాగమ్మ ని చూసి అలా కుర్చీలకతుక్కుపోయారు.. అసలు భానుమతికి కోపం వస్తుందా? తెర మీద కనిపించిందీ భానుమతేనా!? కాదేమో.. ఆమే నాగమ్మే అయి ఉంటుంది…! ఔను..!! భానుమతి నాగమ్మలా మారి పోయుంటుంది.
“మీ సినిమాలో నాకూతురు నటిస్తుంది కానీ కథానాయకుడు కూడా ఆమెని ముట్టుకోకూడదు” శాస్త్రీయ సంగీత ప్రియుడు మరియూ కళావిశారదుడు ఒంగోలు వాస్తవ్యులూ భానుమతికి తండ్రి గారూ అన్నిటికీ మించి ఆమె గురువూ ఐన భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య గారి మాటలివి. ఇప్పుడసలు ఊహించగలమా “హీరోయిన్ ని హీరో తాకకుండానే సినిమా పూర్తైపోయింది 13 ఏళ్ళ భానుమతి 1939 లో “వరవిక్రయం తో సినిమా హీరోయిన్ అయింది. అదే సినిమాలో “పలుకవేమి నా దైవమా” అంటూ గాయని కూడా అయింది..
మిస్సమ్మ సినిమా ఎంటీఆర్ హీరో మరో ముఖ్య పాత్రలో అక్కినేని కూడా ఉన్నారు ఒక పాత్రకి జమున దొరికింది మరి ఇక మిస్సమ్మ ఎవరు!? మిస్సమ్మ అంటే మాటలు కాదు కి చిరుకోపం ప్రదర్శించాలి,చిలిపితనం ఉండాలి,మళ్ళీ హుందాగా కనిపించాలి,అన్నిటికన్నా ముఖ్యంగా అద్బుతమైన నటన ఉండాలి. ఒక రోజంతా ఆలోచించిన దర్శకుడు చక్ర పాణి గారికి తట్టిన సమాధానం ఒకటే “భానుమతి”.. ఔను భానుమతి మాత్రమే చేయగలదు. కానీ…! వరలక్ష్మీ పూజ కోసం కొద్దిగా లేటుగా వస్తానంది, చక్రపానిగారికిది నచ్చలేదు ఫలితం.. మిస్సమ్మ మిస్సయ్యింది కానీ సావిత్రిని ఒక్క దెబ్బతో స్టార్ ని చేసేసింది. సావిత్రి కన్నా ఎక్కువ భానుమతి సంతోషించింది..
పెద్ద హీరోలను కూడా వాడూ వీడూ అంటుందీ, అసలెవరికీ గౌరవం ఇవ్వదు,అనుకునే వారు (భానుమతి చెవిన పడకుండా చాటుగా) పురుషాధిక్యాన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు.తన అలా అని తన హుందా తనాన్నీ పోగొట్టుకోలేదు. గర్విష్టి అనిపించుకున్నా పెళ్ళివిషయం లో మాత్రం భానుమతి పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చింది.. ఇంట్లో తండ్రి గారు ఒప్పుకోకుంటే ఇంట్లో ఉపావాసాలూ, దేవీ పటం ముందుకూర్చొని నిరసన లూ చేసి మరీ 1943, ఆగష్టు 8 న తమిళ , తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావు తో ప్రేమ వివాహానికి ఒప్పించింది. భానుమతి ఇక భానుమతీ రామ కృష్ణ అయింది.. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.
భానుమతి,అర్థ శతాబ్దం పైగా సినిమాని వదళ్ళేదు ఎక్కడా ఎవరికీ తలొంచలేదు.. రచయిత్రి గా ఆవిడ రాసిన అత్తగారి కథలు చదివి,మళ్ళీ చదివి,మళ్ళీ మళ్ళీ చదివి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు తెలుగు పాఠకులు. భానుమతి ఆత్మకథ “నాలో నేను” తనని తాను ఆ పుస్తకంలొ దాచుకున్నారావిడ…
అప్పటి పల్నాటి యుద్దం నుంచీ,పెద్దరికం సినిమా వరకూ అంత అందమైన తెలివైన లేడీ విలన్ మరొకరు లేరు.. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఎవరూ లేరనుకోండి. అరవైల్లోకొచ్చిన భానుమతి భామ్మగా “మంగమ్మ గారి మనవడూ” “బామ్మ మాట బంగారు బాట” అంటూ హీరో కన్నా లీడ్ రోల్ చేసి,సినిమా పేరు తన పాత్రే అయివుండేలా చేసుకో గలిగిన చరీష్మా ఉన్న నటి భానుమతి కాక ఇంకెవ్వరూ కనిపిస్తారు..
1956 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ పురస్కారం ,మూడు సార్లు జాతీయ అవార్డులు (“అన్నై నే” తమిళ సినిమాకు, తెలుగులో అంతస్తులు , పల్నాటి యుద్ధం సినిమాలకు)
అన్నాదురై “నడిప్పుకు ఇళక్కనం” (నటనకు వ్యాకరణం),1966లో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను “పద్మశ్రీ”, ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు,1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు “కళా ప్రపూర్ణ”., 1984 తమిళనాదు ఐయ్యల్ నాటక మన్రము, కలైమామణి బిరుదు,1984లో తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు,1986లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు,1986 లో ఉత్తమ దర్శకురాలిగా ఇలా ఎన్నో అవార్డులకి భానుమతినిచ్చి ఆ అవార్డులని గౌరవించుకున్నారు ప్రజలూ,ప్రభుత్వాలూ… భానుమతి గారి ఫొటోతో వచ్చిన పోస్టల్ స్టాంప్ ఎంతో మంది ఉత్తరాలకతికించకుండా దచ్కున్నారు…
నటి, గాయిని, దర్శకురాలు, రచయిత్రి,పాటలు, సంగీతం, స్టుడియో నిర్వహణా ఇలా ఒకటీ రెండూ కాదు భానుమతంటే ఏమనుకున్నారు మరీ…? “మల్టీ ఫేస్డ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా” ఎవరన్నారో గానీ.. భానుమతిని అలా కాక ఇంకెలా అనగలరు మరి…
2005 డిసెంబర్ 24అనుకుంటా మా చిన్నక్క కొడుకు పరిగెత్తుకొచ్చి”మామా…! భానుమతి గారు చనిపోయరట అన్నాడు..” నాకు భాదనిపించలేదు వాడి అమాయకత్వానికి నవ్వొచ్చింది. భానుమతెక్కడికి పోతుంది…? చూడు టీవీలో మళ్ళీశ్వరి సినిమా.. షెల్ఫ్ లో భానుమతి పుస్తకాలు… ఇక భానుమతేలా చనిపోతుందీ..!? నా కళ్ళలో నీళ్ళు తుడిచి వాడూ పక్కనే సినిమా చూస్తూ కూచున్నాడు…
ఇవాళ భానుమతి పుట్టిన రోజు.. అదేంటో గానీ పొద్దున్నుంచీ భానుమతి గుర్తొచ్చిన దగ్గర్నుంచీ ఒకటే పాట “మనసున మల్లెల మాలలూగెనే… కన్నుల వెన్నెల డోల లూగేనే.. ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బతుకు పండెనో.