Home / Inspiring Stories / అతని తల్లి మరణం అతన్ని మార్చేసింది

అతని తల్లి మరణం అతన్ని మార్చేసింది

Author:

Karimul the ambulance man

సహాయపడటానికి ఉండాలిసింది డబ్బు మాత్రమేనా..? కాదేమో..! కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఒక్కరోజు భోజనం ఖర్చుకోసం 5000 ఖర్చుపెట్టే మనుషులని కలిగి ఉన్న ఇదే దేశంలో రోజుకు 5 రూపాయలతో ఆకలి తీర్చుకునే మనుషులనీ చూడగలుగుతున్నాం. మన దేశం మనకు గంటకు లక్ష సంపాదించే వారినీ ఒకపక్కా, రోజుకు 30రూపాయలు సంపాదించే వారిని మరో పక్కా నిలబెట్టింది. గొప్ప దేశం లో నివసించే పౌరులుగా మనం గర్వించాలో ఒక్క రూపాయినీ అపురూపంగా చూసే మనుషులని చూసి భాదపడాలో తెలియని స్థితిలో ఉన్నాం మనం.. కొన్నిసార్లు ఔను..! నాదేశం గర్వపడేందుకూ కొందరు మనుషులనిచ్చింది అనుకునేలా ఉంటారు కొందరు…

పశ్చిమ బెంగాల్ లోని జల్పగురి ప్రాంతం టీ ఎస్టేట్ లు ఎక్కువగా ఉండే హిల్ ఏరియా. ప్రకృతి సౌందర్యానికీ చక్కటి ప్రదేశం. ఐతే ఇక్కడ సుందర ప్రకృతి దృశ్యాలే కాదు అక్కడే ఒక టీ ఎస్టేట్ లో పని చేసే కరిముల్ కనిపిస్తాడు. జలపగురి ప్రకృతి కంటే అందమైన మనసున్న వాడు ఈ కరిముల్. అక్కడే ఒక టీ ఎస్టేట్ లో నాలుగు వేల జీతానికి పని చేసే ఒక సామాన్య వ్యక్తి గురించి ఇంత చెప్పుకోవటం ఎందుకూ అంటే..?

karimul bike ambulance

కరిముల్ తన జీతం నాలుగు వేల రూపాయలు అందుకోగానే ఒక వెయ్యి రూపాయలని తన బైక్ వాయిదా కింద బ్యాంక్ లో జమ చేస్తాడు. ఇంకో రెండు వేలు తన ఖర్చులకు వాడుకుంటాడు. మరి ఇంకో వెయ్యి!? ఆ 1000 రూపాయలూ తన అంబులెన్స్ కోసం వాడుతాడు. వెయ్యి రూపాయలతో అంబులెన్స్ ఏమిటీ అంటార? తన టూ వీలర్ నే అంబులెన్స్ గా వాడతాడు ఆ బైక్ పెట్రోల్, ప్రధమ చికిత్స కోసం అవసరమయ్యే మందులూ అన్నీ ఆ వెయ్యితో కొంటాడు. నిజానికి అతనికి బైక్ అవసరం లేదు, కేవలం అంబులెన్స్ గా మార్చేందుకే దాన్ని వాయిదాల్లో కొన్నాడు. అర్థ రాత్రీ, అపరాత్రీ అని లేదు ఎవరికి అవసరమొచ్చి ఏసమయం లో కాల్ చేసినా అక్కడికి చేరుకుంటాడు.”కరిముల్ అంబులెన్స్ అంటే అక్కడ ఉన్న జనానికే కాదు లోకల్ డాక్టర్లకీ, పోలీసులకీ తెలుసు. అందరూ అభిమానం గా చూస్తారు.

తన తల్లి కేవలం సరైన సమయానికి ఆసుపత్రికి చేరక పోవటం వల్లే చనిపోవటం తో తను వీలైనంత మందికి సహాయ పడాలి అనుకున్నాడట. అప్పటినుమంచీ ఇదేపని. తన 4000 జీతం లో సగం ఈ టూవీలర్ అంబులెన్స్ కోసమే ఖర్చు చేస్తున్నాడు. తన జీవితాశయం ఇదే అన్నంతగా ఆ బైక్ మీద కొందరి ప్రాణాలను కాపాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి. ఎవరికైనా సహాయ పడాలి అంటే ఖచ్చితంగా డబ్బున్న వారే అయిఉండాలా?? కాదేమో ఇంకేదో మనం మర్చిపోతూన్న మాట అది “మానవత్వం” అది ఉంటే చాలేమో.

(Visited 300 times, 1 visits today)