Home / Reviews / మనమంతా రివ్యూ & రేటింగ్.

మనమంతా రివ్యూ & రేటింగ్.

Author:

మనమంతా రివ్యూ & రేటింగ్.

కొన్ని కొన్ని సినిమాలు కొందరు మాత్రమే తీయగలరు. కొందరు మాస్, యాక్షన్ సినిమాలు తీస్తారు, కొందరు ఫీల్ గుడ్ సినిమాలు తీస్తారు కొందరు సందేశాత్మమైన సినిమాలు తీస్తారు. కానీ చంద్రశేఖర్ ఏలేటి కొద్దీ మంది దర్శకులు మాత్రమే మంచి సినిమాలు తియ్యగలరు. మంచి సినిమా అంటే మనసుకు నచ్చే సినిమాలు. మరి అలాంటి దర్శకుడు ఇప్పుడు మోహాన్ లాల్, గౌతమి వంటి సీనియర్ యాక్టర్స్ తో మనమంతా అంటూ మన ముందుకు వచ్చాడు.

కథ :

సాయి రామ్(మోహన్ లాల్) ఒక మధ్య తరగతికి చెందిన వ్యక్తి. ఒక సూపర్ మార్కెట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. ఎలాగైనా అసిస్టెంట్ మేనేజర్ నుండి మేనేజర్ గా పదవి పొంది తన కష్టాలన్నీ తీర్చుకోవాలి అనుకునే సగటు మనిషి. తన బాస్ రిటైర్ అవుతుండడంతో ఎలాగైనా మేనేజర్ అవ్వాలని ఆశిస్తుంటాడు.

ఇక గాయత్రి( గౌతమి) డిగ్రీ చదివిన బయటకు చెబితే ఎక్కడ కట్నం ఎక్కువ అడుగుతారో అనే భయంతో ఎక్కువగా చదువలేదు అని చెప్పి పెళ్లి చేసుకొని ఒక మధ్యతరగతి ఇల్లాలిగా పిల్లలను మరియు భర్తకు అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది.

అభి మంచి తెలివైన కంప్యూటర్ ఇంజనీర్. తన చదువుతో సమాజంలో తనకు మంచి గౌరవం, మర్యాద లభిస్తుంది అనుకుంటూ ఉన్నతమయిన ఆశలతో జీవితం సాగిస్తుంటాడు. కానీ ఒక అమ్మాయి ప్రేమ వల్ల అతని జీవితమే మారిపోతుంది.

మహితా ఒక మంచి మనసు ఉన్న అమ్మాయి. తాను రోజు స్కూల్ కు వెళ్తూ ఆడుతూపాడుతూ ఎప్పుడూ నిజాలు మాట్లాడుతూ అందరితో ఆనందంగా ఉండే అమ్మాయి. ఎలా సాఫీగా జరిగే వీరి జీవితాలు కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అసలు ఈ నలుగురి కథలు ఏమవుతాయి ? వీరి నలుగురికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అన్నదే మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

నాలుగు కథలను ఎంచుకున్న దర్శకుడు ఒక్కొక్క కథను తెర మీద చూపించడంలో సక్సస్ సాధించాడు. అలాగే చివరిలో అందరిని కలిపే సందర్భం చాలా గొప్పగా చూపించాడు. ముఖ్యంగా మహితా మరియు వీర్ ల మధ్య ఉన్న సన్నివేశాలను తెర మీద చాల అద్భుతంగా చూపడం జరిగింది. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన గాయత్రి మరియు మహాలక్ష్మి పాత్రలు అచ్చం నిజజీవితంలో ఎలా ఉంటాయో అలానే చూపించాడు, మన జీవితాల్ని మనమే తరిచి చూసుకుంటున్న భావన కలిగేలా సినిమాని తెరకెక్కించాడు చంద్రశేఖర్‌ యేలేటి. ఆయనదైన స్క్రీన్‌ప్లే మేజిక్‌ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే ప్రేక్షకులతో చప్పట్లు కొట్టేలా చేస్తుంది.

తొలి సగభాగం కథంతా నాలుగు పాత్రల్ని.. వాటి తాలూకు ఆశలు.. ఆకాంక్షల్ని పరిచయం చేస్తూ సాగుతుంది.. మలి సగంలోనే అసలు కథ మొదలవుతుంది.ఈ నాలుగు పాత్రలు వారి వారి జీవితాలలో జరిగిన సంఘటనలతో వారికి కావలసిన దాని కోసం ఏం చేశారు అన్నదే మిగిలిన కథ.

నటీనటుల పనితీరు:

మోహన్‌లాల్‌ మధ్యతరగతి వ్యక్తిగా సాయిరామ్‌ పాత్రలో ఒదిగిపోయారు. కుటుంబమే లోకంగా బతికే గాయత్రిగా గౌతమి నటన సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. మహితగా రైనారావు అభినయం సినిమాకి ప్రధాన బలం. ఆ పాత్రతోనే వేల భావాల్ని పలికించారు దర్శకుడు. గొల్లపూడి మారుతీరావు.. వూర్వశి.. హర్షవర్ధన్‌.. అనీషా ఆంబ్రోస్‌.. చేతన్‌ వారి వారి పాత్రలకి తగ్గట్టుగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ చిత్రానకి నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. పాటలు వినడానికి అంత బాగా లేకున్నా, కేవలం నేపథ్య సంగీతమే భావోద్వేగాలను పలికించడంలో సక్సెస్ అయింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నిడివి రెండు గంటలా 20 నిమిషాలే అయినా… సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగిపోతుంది. అలాగే సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఇక సాయి కొర్రపాటి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించాడు.

ప్లస్ పాయింట్స్:

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • నటీనటులు
  • సెకండ్ ఆఫ్

మైనస్ పాయింట్స్:

  • స్లో నేరేషన్
  • ఫస్టాఫ్

 అలజడి రేటింగ్: 3.25/5

పంచ్ లైన్ : ‘మనమంతా’ కలసి చూడవలసిన సినిమా.

(Visited 1,158 times, 1 visits today)