Home / Inspiring Stories / మథర్ లోని దేవతని మేమెప్పుడో చూసాం.

మథర్ లోని దేవతని మేమెప్పుడో చూసాం.

Author:

Mother Teresa

“ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న”అన్న నినాదం తోనే విశ్వమాతగా పేరు గాంచిన మథర్ థెరీసా ఇప్పుడు నిజంగానే “దేవత” అయ్యారట. తమ మరణం తర్వాత కూడా కొన్ని అద్బుతాలను చేసే వారిని వాటికన్ సిటీ “సేయింట్” గా ప్రకటిస్తుంది. ఐతే సేయింట్ అవాలంటే కనీసం రెండు అద్బుతాలు జరగాలి అప్పుడే వారు దేవత స్థానాన్ని పొందుతారు. ఇదే తరహాలో కడుపులో కణితితో బాధపడుతున్న ఓ బెంగాలి గిరిజన మహిళను థెరిసా స్వస్థపరచడాన్ని మథర్ చేసిన మొదటి అద్భుతంగా 1998లో గుర్తించారు. థెరీసాకు చేసిన ప్రార్థనల వల్లే తనకు కణితి పూర్థిగా నయమైపోయిందని ఆమె చెప్పినప్పుడు రెండవ అద్బుతం కోసం చూసిన వాటికన్ సిటీ ఇప్పుడు ప్రాణాంతక మెదడు వ్యాధితో బాధపడుతున్న బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తిని మదర్‌థెరిసా తన దివ్యశక్తితో నయం చేయడాన్ని ఆమె చేసిన రెండో అద్భుతంగా గుర్థించి మథర్ థెరీసా ను సేయింట్ గా గుర్థించినట్టు వాటికన్ సిటీ తెలిపింది. మథర్ ఎక్కడో విదేశాల్లో పుట్టి, సేవా మార్గంలో పయనించి, భారతదేశంలోని కోల్‌కతాలో స్థిరపడి, అనారోగ్యంతో బాధపడ్తున్నవారిని చేరదీసి, సేవలు చేసిన ‘తల్లి’ థెరీసా రాయడానికి వీల్లేనంత దయనీయ స్థితిలో రోగంతో బాధపడ్తున్నవారిని అక్కునచేర్చుకున్న ‘దేవత’ మదర్‌ థెరీసా. పట్టుకుంటే ఆ రోగం తమకెక్కడ అంటుకుంటుందోనని కుటుంబ సభ్యులు రోడ్డున పడేసిన అభాగ్యులు, మదర్‌ థెరీసా పుణ్యమా అని కోలుకున్నారు. ఇక బతికే అవకాశం లేదని తెలిసీ, చివరి రోజుల్లో మథర్ థెరీసా సపర్యలతో బాధల్ని మర్చిపోయారు కొందరు అభాగ్యులు.

అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. 1910లో మాసిదోనియాలో అల్బేనియా తల్లిదండ్రులకు జన్మించిన థెరిసా తన 18వ ఏట ఐర్లాండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి భారత్ వచ్చి ఎక్కువ కాలం ఇక్కడే జీవించారు.ఆమె చనిపోయే నాటికి మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ 4,000 సన్యాసినులు, 300 మంది అనుబంధ సోదర సభ్యులు , మరియు 100,000 పైగా సాధారణ కార్యకర్తలను కలిగి, 123 దేశాలలో 610 శాఖలను కలిగి ఉంది. వీటిలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారి సంరక్షణ గృహాలు మరియు హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు వ్యాధి మరియు క్షయ రోగులకు ఆవాసాలు,ఆహారకేంద్రాలు, అనాధ శరణాలయాలు, మరియు పాఠశాలలు ఉన్నాయి.ఆమెకు 1951లో భారత పౌరసత్వం లభించింది.

1997లో తన 87వ ఏట కన్ను మూసిన థెరిసాను 2003లోనే అప్పటి పోప్ జాన్ పాల్ బియాటిఫై చేశారు. రోమన్ క్యాథలిక్ లలో సెయింట్‌గా ప్రకటించడానికి ముందు సదరు వ్యక్తిని బియాటిఫై చేస్తారు.అంటే పవిత్రమూర్తిగా గుర్తించటం. మదర్ థెరిసాను సెయింట్‌గా ప్రకటించనున్నారన్న నిర్ణయం వెలువడిన వెంటనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మిషనరీస్ ఆఫ్ చారిటీకి అభినందనలు తెలిపారు. వాటికన్‌కు చెందిన క్యాథలిక్ వార్తాపత్రిక అవ్వెనైర్ కథనం ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన రోమ్ నగరంలో జరుగనున్న అధికారిక కార్యక్రమంలో మదర్ థెరిసాను సెయింట్‌గా గుర్తిస్తారు.. 1979లో నోబెల్ అందుకున్న మదర్ థెరిసా.1962 లో పద్మశ్రీ బహూకరించడం ద్వారా అందరికంటే ముందుగా భారతప్రభుత్వం మథర్ సేవలను గుర్తించింది.అక్కడి నుంచీ వరుసగా ఆమె భారత దేశ అత్యున్నత పురస్కారాలైన “అంతర్జాతీయ అవగాహనకు గాను జవహర్లాల్ నెహ్రూ అవార్డు”ను 1972 లోను, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన “భారతరత్న”ను 1980 లోను అందుకున్నారు.

ఖండాలు దాటి వచ్చి ఇక్కడ ఉన్న ఎందరో అభాగ్యుల పాలిట ప్రత్యక్ష దేవత ఎప్పుడో అయ్యారు.ఇప్పుడు కొత్తగా మళ్ళీ మథర్ ని దేవతగా గుర్తించటమేమిటీ అని ఆశ్చర్య పోయారట. మిషనరీస్ ఆఫ్ చారిటీ లో ఉన్న కొందరు ఆశ్రితులు. నిజమే కదా ఎదుటి మనిషిలోని బాదని తుడిచినప్పుడే ఆమె దైవత్వాన్ని పొందారు ఇవాళ కొత్తగా ప్రకటించేదేముంది…

(Visited 497 times, 1 visits today)