Home / Inspiring Stories / ముస్లింల ఇంట్లో మోగిన వేదమంత్రాలూ, పెళ్ళి బాజాలూ..!

ముస్లింల ఇంట్లో మోగిన వేదమంత్రాలూ, పెళ్ళి బాజాలూ..!

Author:

మతం అనేది పుట్టుకతో వచ్చేది కాదు కేవలం మన సొంత నమ్మకాలూ, విశ్వాసాల మీద ఆధారపడి ఉండేదే. పుట్టుకతో మనం హిందువు అయినా, ముస్లిం అయినా మన మనస్సు ఏ విధానాన్నైతే నమ్ముతుందో, ఏ ఆచారమైతే మనం పాటిస్తామో అదే మన మతంగా మారుతుంది. ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులూ,అక్కడి బౌగోళిక పరిస్థితులపై మాత్రమే అన్ని మతాల ఆచారాలూ ఏర్పడ్డాయి. మారే కాలంతో బాటు గా ప్రతీ మతమూ తనకంటూ కొన్ని మార్పులతో ఒక కొత్త విధానాన్ని ఏర్పరుచుకుంటూ ముందుకు సాగింది. మనిషి తన చుట్టూ ఉండే సమాజంతో మమేకం కావటానికి పండగలూ సాంప్రదాయాలూ ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఒక మతంలో పుట్టిన మనిషి తనకు నచ్చిన మతాన్ని ఎంచుకోని అవలంబించే పద్దతి మొదలైంది. మన దేశం వంటి లౌకిక దేశాలలో ఇది మరింత గా ప్రాచుర్యం పొందింది. మతాన్ని బట్టి మనిషికి ఇచ్చే గౌరవం నిర్ణయించబడే సమాజంలో ఆ గోడలని బద్దలు కొట్టాడొక ముస్లిం సోదరుడు.

Muslim Marriage in Hindu Tradition

హిందూ మత సంప్రదాయాల పై మక్కువ కలిగిన ఓ ముస్లిం సోదరుడు తన కుమార్తె వివాహాన్ని హైందవ సంప్రదాయంలో జరిపించాడు. అతడి ఇంట్లో ‘మాంగల్యం తంతునానేన..’ అంటూ వేదమంత్రాలు ప్రతిధ్వనించాయి. పెళ్లి కుమారుడి తరఫు వారిని, బంధువులనూ ఒప్పించి ఈ పెళ్లి జరిపించడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, రంపయర్రంపాలేనికి చెందిన వ్యాపారి, వైఎస్సార్‌సీపీ నేత షేక్ మగ్ధూమ్ (రఫీ)కి చిన్ననాటి నుంచి హిందూ సంప్రదాయాలంటే ఇష్టం ఉండేది. వేదమంత్రాలపై అపార నమ్మకం. ఈ విశ్వాసమే తన కుమార్తె రేష్మీ, వరుడు అబ్దుల్ రహీమ్‌ల వివాహం హిందూ సంప్రదాయంలో నిర్వహించేలా చేసింది.

Muslim Marriage in Hindu Tradition

పెళ్లి సందర్భంగా శుక్రవారం ఉదయం రఫీ ఇంట వేద పండితులు ప్రతి మంత్రానికీ అర్థాన్ని వివరిస్తూ వివాహం జరిపించారు. శుభలేఖనూ హిందూ సంప్రదాయం ప్రకారం జానక్యాః కమలామలాంజలి పుటేయూః పద్మరాగారుతాః..’ అనే శ్లోకం, హిందూ దేవతామూర్తుల బొమ్మలతో ముద్రించినట్లు వారు తెలిపారు. పెళ్లి అనంతరం వధూవరుల తలంబ్రాల ముచ్చట బంధుమిత్రులకు కన్నుల పండుగలా అనిపించింది. కాగా తన గ్రామానికి చెందిన పదిమంది హిందూ అవివాహిత యువతులకు రూ.10 వేల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన బాండ్లను పెళ్లి పందిరిలో రఫీ.. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించారు. హిందూ సంప్రదాయం, వేద మంత్రాలపై తనకు చిన్ననాటి నుంచి నమ్మకం ఉందని, అందుకే పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిపించానని రఫీ ఆనందంగా చెప్పారు.

Muslim Marriage in Hindu Tradition

(Visited 2,614 times, 1 visits today)