Home / Inspiring Stories / ప్రపంచ కప్ గెలిచినా ఇంత చిన్న చూపేందుకు..?

ప్రపంచ కప్ గెలిచినా ఇంత చిన్న చూపేందుకు..?

Author:

మన దేశంలో ఎక్కడో పుట్టిన క్రికెట్ కి ఉన్నంత ఆదరణ కానీ ప్రోత్సాహం కానీ ఇతర ఆటలకు లేకపోవడం ఆలోచించదగ్గ విషయం. ఇక మన దేశంలో పుట్టి ఖండంతరాల ఖ్యాతి గడించి అన్ని దేశాలకు వ్యాప్తి చెందిన ఆట కబడ్డీ. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ ఆటలో మన దేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇక కొన్ని రోజుల క్రితం అయితే ఈ ఆటను మర్చిపోయే సమయంలో కొన్ని కార్పోరేట్ కంపెనీలు ముందుకు వచ్చి ప్రో కబడ్డీ తో ఆటకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. దీనితో ఆటగాళ్లకు కూడా కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం వచ్చింది.

కొద్దీ రోజుల క్రితం భారత కబడ్డీ జట్టు ప్రపంచ కప్ గెలిస్తే దేశమంతా సంబరాలు చేసుకుంది. మరి జట్టు గెలుపుకు కారణం అయినా ఆటగాళ్ళకు ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. ఎంతో కష్టపడి ఎన్నో రోజులు ఇంటికి దూరంగా ఉండి వారి చెమట చుక్కలతో కప్పును గెలిస్తే వారిని పట్టించుకునే నాధుడే లేకపోవడం చాలా బాధాకరం. మొన్న జరిగిన ఒలంపిక్స్ లలో విజయాలు సాధించిన వారికి కోట్లలో నగదు పురస్కారాలు, కార్లు, బంగ్లాలను ఇచ్చి వారికి రోజుకో ప్రాంతంలో సన్మానాలు జరిపారు. ఇక క్రీడాకారుల రాష్ట్రాల నుండి కూడా వారు ఆశించిన దాని కంటే ఎక్కువే బహుమతులు అందుకున్నారు.

kabaddi-world-cup-india

భారత క్రికెట్ జట్టు టీ20, వరల్డ్ కప్పులు గెలిచినప్పుడు ఒక్కొక్క ఆటగానికి కోట్లల్లో బహుమతులు ఇచ్చారు. ఇక కొన్ని కార్పోరేట్ కంపెనీలు అయితే ఒక్కొక్క ఆటగాడికి ఖరీదైన కార్లు బహుమతులుగా ఇచ్చాయి.అన్నిఆటల కంటే శారీరకంగా ఎక్కువగా కష్టపడే ఆట కబడ్డీ. మరి అలాంటి ఆటగాళ్లకు ముష్టి పది లక్షలు ఇచ్చి మీ జట్టంతా పంచుకొండి అని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ 10 లక్షలు జట్టు సభ్యులు అందరూ పంచుకుంటే ఒక్కొక్కరికి 67 వేల రూపాయలు వచ్చాయి.

ఈ విషయం గురించి భారత కబడ్డీ జట్టు గెలవడంతో కీలక పాత్ర వహించిన అజయ్ ఠాకూర్ మాట్లాడుతూ…. మేము గెలిచింది ఎదో మామూలు చిన్న టోర్నీ కాదు ప్రపంచ కప్పు. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ ఆటగాడికైనా సన్మానాలు, సత్కారాలు జరిగితే వారు రానున్న టోర్నీలో ఇంకా చాలా బాగా ఆడుతారు. కానీ మాకు ఆలాంటి ఏమి మా దరిదాపులలో లేవు. చివరికి మా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. మాకు తగిన ప్రోత్సాహం ఇవ్వకపోవడం మాకు ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు. బలవంతగా ఎలాంటి బహుమతులు వద్దు సాధన కోసం టర్ఫ్ ఏర్పాటు చేస్తే చాలు మామూలు మైదానాలలో సాధన చేస్తుంటే గాయాలు ఎక్కువగా అవుతున్నాయి అని తన ఆవేదన వ్యక్తం చేసాడు.

rahul-chowdary

120 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధిస్తే గాని వారిని మన ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం లేకున్నా దీపా కర్మాకర్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది, ఆమెకి ముందుగానే సరైన ప్రోత్సహం అందిస్తే మన ఖాతాలో మరో ఒలింపిక్ పతకం వచ్చేది, కబడ్డీలో మన క్రీడాకారులని మించిన వారు ప్రపంచంలోనే లేరు అలాంటి అత్యుత్తమ ఆటగాళ్ళకి సరైన ప్రోత్సాహం అందిస్తేనే భవిష్యత్ లో ఎక్కువమంది క్రీడలపై ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రతిభకి గుర్తింపుగా తగిన ప్రోత్సాహం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ఎక్కువమంది క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

(Visited 697 times, 1 visits today)