Home / Inspiring Stories / ఓ మహాత్మా..! ఓ మహర్షీ…!!

ఓ మహాత్మా..! ఓ మహర్షీ…!!

Author:

ఎందుకోగానీ అక్టోబర్ రెండొస్తూంటే రెండ్రోజుల ముందు నువ్వు గుర్తొస్తావ్ మాకు జాతిపిత గా కొందరికైతే డ్రై డే కారణం గా కూడా.. ఔను…! మనసుకి కష్టమే అనిపించినా ఇదే నిజం బాపూ..! ఇప్పుడు గాంధీ జయంతి అంటే మాకొక డ్రై డే. దేశమంతా ఎండి పోయిన ఒక మహా సముద్రం లా తడారిపోయిన గొంతులా  అనిపిస్తుంది. ఎందుకొచ్చావ్..!? ఈ జాతి కోసం ఏం అందించి వెళ్లావ్? ఓమహాత్మా..! ఓ మహర్షీ..!!

ఓ మహాత్మా..! ఓ మహర్షీ. Gandhi Jayanthi

నడిరాత్రి ఆడపిల్ల స్వేచ్చగా తిరిగిన రోజే ఈ దేశానికి స్వతంత్రమన్నావ్” నిర్భయత్వం ఇంకా  బస్టాప్ దగ్గర్నుంచీ కార్పోరేట్ ఆఫీస్ అద్దాల గదుల దాకా అనుమానంగా ఎక్కడ తనకి రక్షణ దొరుకుతుందో అర్థం కాక భయంగా చుట్టూనే ఉంది.నువ్వెక్కడ అని చూస్తే ఒక చరిత్ర పుస్తకం లో 10 మార్కుల ప్రశ్నకి సమాధానమై కూచున్నావ్.మహాత్మా..! ఇపుడు మామధ్య నువ్వు లేవు అంతకన్నా విషాదమేమిటంటే నీ ఆశయాలు కూడా లేవు.  ఏది చీకటి…ఏది వెలుతురు..!? ఏది జీవితమేది మృత్యువు..!? అర్థం కాకే అర్థం తెలియకే నువ్వు సగం చీల్చి తెచ్చిన అఖండ భారతం ఇంకా కొన్ని మతాలుగా ఖండాలుగానే మిగిలిపోయింది. మాలో ఒకడు హిందువు, ఒకడు ముస్లిం ఇకొకడు ఇంకేదొ కానీ ఇంకా మేము భారతీయులం కాలేదనుకుంటూ భారంగా నడుస్తూనే ఉన్నాం అమెరికా భానిసత్వం కోసం.

ఏది పుణ్యం ఏది పాపం..? ఏది నరకం ఏది నాకం..? ఒక మతం కోసం మరణించటమా అదే మతం కోసం మరొకర్ని చంపటమా.. చచ్చే వాడికి భరోసా ఇవ్వటమా? ఏఅది మహాత్మా ఏది..? అన్నం పెట్టే రైతు నువ్వు చెప్పిన ఏ దేశపు పట్టుగొమ్మ చెట్టుకొమ్మలకు శవమై శరీరమై వేళ్ళాడుతూంటే ఎక్స్ గ్రేషియా అందించి పాత పాపాలని కొత్త పుణ్యాలతో కడిగేసుకుంటూ… ఎదురు చూస్తున్నాం రాబోయే అచ్చేదిన్ కోసం కాదు బాపూ. ఆఫీస్ కెల్లటానికి రావాల్సిన 102 సిటీ బస్సు కోసం.. నువ్వు చెప్పిన సిద్దాంతం నిన్నే ప్రశ్నించిన సంధర్భం నీ పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ లా నీ ముందు నిలుచున్నట్టు మేమూ ఏన్నో సిద్దాంత గ్రంధాల చుట్టూ ప్రధక్షిణలు చేస్తూ వున్నాం….. ఏది సత్యం?  ఏదసత్యం….? ఏదనిత్యం? ఏది నిత్యం..!? అప్పటినుంచీ ఇప్పటిదాకా….., నీ ప్రస్తానం నుంచీ కల్బుర్గీ మరణం దాకా ఇంకా మాకర్థం కాలేదు ఏది సత్యం ఏదసత్యం….? దేశపు కీర్థి సత్యమా నైమిశారణ్య కాశీ విధ్యా పీఠ ఘనకీర్తి సత్యమా……!? వీధికో ఇంజినీరింగ్ పట్టభద్రుడు అరిగిన చెప్పులతో తిరిగే ఈ దేశ దౌర్భాగ్యమసత్యమా…. బాపూ!నీ మాటలసత్యమా సత్యమా? యూనివర్సిటీ గోడలపై నినాదాలుగా తమ పేర్లను రాసుకుంటున్న విధ్యార్థుల నిస్సహాయావేశాల మరణాలసత్యమా…..? నువ్వూహించిన నీ దేశం చచ్చి పోయింది బాపూ…..! నిన్ననే నిర్భయ పేరు పెట్టుకున్న భారత మాత ధారుణంగా చచ్చిపోతే నిబ్బరంగా సమాధి చేసొచ్చి “యత్ర నార్యంతు పూజ్యతే” అనుకుంటూ మహిళా బిల్లు కాగితాలతో ముక్కులూ మూతులూ తుడుచుకుంటున్నాం… మహాత్మా, ఏమయ్యా మహర్షీ..! మేం నీ దేశం లోనే ఉన్న విదేశీయులం…  ఏది ఏకం ఏదనేకం? ఏది కారణమేది కార్యం….? ఓ మహాత్మా…!ఓమహర్షీ..!! ఎన్నిబాషలెన్ని మతాలెన్ని సంస్కృతులు ఒకే ఒక దేశం? ఏక దేశ సూత్రం లో ఇంకా శత్రువులం…ఏది ఏకం ఏదనేకం ఓక దేశంగా మేము ఏకం కానీ మేం భాషలుగా, మతాలుగా, ప్రాంతాలుగా లౌకిక దేశం లో జీవించే హక్కుని చెత్తకుండీల్లో వెతుక్కునే వీధి బాలలం మేం. మాలో మేమే..! మాకు మేమే..! పరస్పరం  శత్రువులం. తిరుగు బాటుకు కారణ మేదీ, పేలుతున్న తుపాకీ చేసే కార్యమేదీ? తెలిసీ తెలియని సమాధానాలు వెతుక్కుంటూ తిరుగుతున్నాం. మరి నువ్వు చూపించిన ఆ గొప్పదేశపు దారెక్కడా?

ఓ మహాత్మా..! ఓ మహర్షీ...!!  gandhi jayanthi

హ్మ్…! చాలా మాట్లాడాను. ఏదో ఆవేశం బాపూ ఏమనుకోకు, ఏదో ఈ దేశం గురించీ నీ గురించీ ఆలోచించే తీరిక ఉండి కాదు గానీ. ఏదో అలా నువ్వు చెప్పిన “కుల రహిత సమాజం” లాంటి ఊహా జనిత ఉన్మత్త ప్రేలాపణ అంతే బాపూ..! బస్సు కాస్త లేటయ్యీ.. చౌరాస్తాలో పేద్ద నేత పక్కన నిన్నటి దాకా దుమ్ము కొట్టుకు పోయి ఉండే నీ విగ్రహం కడిగి తుడిచీ దండలు పట్టుకొనీ పేపరోళ్ళ కోసం చూసే జనాన్ని చూసీ ఇలా ఏదేదో మాట్లాడేసాను… అదేం పట్టించుకోకు… నువ్వూ నేనూ దేశానికేం చేసాం అని ప్రశ్నించుకుంటూ కూచుంటే నాకవతల ఆఫీస్ కి లేటౌతుంది అసలే రైతు ఆత్మ హత్యల గురించీ..,ఆహార భద్రతల గురించీ, జీవించే హక్కు గురించీ రోడ్డెక్కు తారు పనిలేని జనం. ట్రాఫిక్ జాం అయిందంటే కష్టం.. ఆ..! మర్చి పోయా..!! హేపీ బర్త్ డే బాపూ..!

ఏది తెలుపూ ఏది నలుపూ
ఏది గానం ఏది మౌనం
ఏది నాది ఏది నీది                                                                                                                                                                                 ఏది నీతీ ఏది నేతి
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి ఖేదం రేపు రాగం
ఒకే కాంతీ ఒకే శాంతీ..ఓ మహర్షీ..!ఓ మహాత్మా…!!

(Visited 497 times, 1 visits today)