Home / Political / పఠాన్ కోట్ దాడి భారత దేశ నాటకమంటున్న పాక్.

పఠాన్ కోట్ దాడి భారత దేశ నాటకమంటున్న పాక్.

Author:

pakistan-pathankot-investigators-pti

ఈ ఏడాది జనవరి 2న ఆరుగురు తీవ్రవాదులు పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం మీద దాడి చేసిన విషయం ప్రపంచం అంతా చూసింది. నాలుగు రోజుల పాటు జరిగిన పోరులో, ఎట్టకేలకు దాడిలో పాల్గొన్న ఆరుగురు తీవ్రవాదులనూ చంపగలిగింది సైన్యం. కానీ ఈ పోరాటంలో ఏడుగురు సైనికులను పోగొట్టుకుంది. ఎక్కువ కష్టపడకుండానే, ఈ దాడికి కారకులు ఎవరో తెలిసిపోయింది. తీవ్రవాదులంతా పాకిస్తాన్‌ నుంచే వచ్చారనీ, వారందరినీ జైష్‌-ఏ-మహమ్మద్ అనే సంస్థ పంపించిందనీ తేలిపోయింది. అందుకు సంబంధించిన ఫోన్‌ రికార్డుల దగ్గర్నుంచీ, డీఎన్‌ఏ నమూనాల వరకూ మన ప్రభుత్వం పాకిస్తాన్‌కు అందించింది. ఇంత చేసిన తరువాత కూడా పాకిస్తాన్‌ ఏదన్నా చర్య తీసుకుంటుందన్న నమ్మకం ఎలాగూ లేదు. కనీసం జైష్‌-ఏ-మహమ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజార్‌ని కట్టడి చేస్తుందన్న చిన్న ఆశ భారత ప్రభుత్వానిది. అది ఎలాగూ జరగలేదు సరికదా, అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఒత్తడిని తట్టుకునేందుకు, పాకిస్తాన్ ‘విచారణ సంఘం’ అనే నాటకాన్ని మొదలుపెట్టింది. భారత్ చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేల్చి, సంబంధితుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ ఓ ఐదుగురు మహామహులను ఎంపిక చేసి ఈ నెల 27న భారతదేశానికి పంపింది.

విచారణ సంఘం మన దేశంలోకి అడుగుపెడుతూనే తన నాటకాలను మొదలుపెట్టింది. ఇటు మీడియాను ఎలాగూ తప్పించుకుని తిరిగింది. అటు భారతీయ పరిశోధనా సంస్థ తో కూడా అంటీ ముట్టనట్లు ప్రవర్తించింది. విన్న ప్రతి మాటకీ తల ఊపింది. చూసిన ప్రతి విషయాన్నీ రాసుకుంది. కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన తరువాత తన వ్యూహాన్ని అమలుచేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్‌ మీడియా చెబుతున్న మాట వాస్తవమే అయితే, పఠాన్‌కోట్‌ దాడులకు సంబంధించి జిట్ రూపొందించిన నివేదిక అంత దారుణం మరొకటి ఉండదు. ఈ నివేదిక ప్రకారం…

– పఠాన్‌కోట్‌ మీద దాడులు జరగబోతున్నాయన్న విషయం భారతదేశానికి ముందుగానే తెలుసు.

– తెలిసి కూడా పాకిస్తాన్‌ పరువు తీయటం కోసం పన్నాగం పన్నింది

– అందుకు అనుగుణంగానే పఠాన్‌కోట్‌లో భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి, ఉగ్రవాదుల కోసం వేచి చూసింది.

– ఉగ్రవాదులు స్థావరంలోకి అడుగుపెట్టగానే వారిని కాల్చిపారేసింది.

– దాడి విషయంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు, నాలుగు రోజుల పాటు పోరు జరిగినట్లు నాటకం ఆడింది.

– పైగా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌ తీవ్రవాదులు అనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.

– ఇదంతా కూడా భారతీయ ప్రభుత్వం, సైన్యం కలిసి ఆడిన నాటకం.

– విచారణలో భారతీయ పరిశోధనా సంస్థ, తమకు ఎలాంటి సాయమూ చేయలేదు.

ఇవీ జిట్‌ నివేదికలోని అంశాలుగా పాకిస్తాన్ మీడియా పేర్కొంటోంది. పైగా తీవ్రవాదులు గోడలు ఎక్కేందుకు తాళ్లు కనిపించలేదనీ, స్థావరానికి పెద్దగా నష్టం వాటిల్లలేదని…. కోడిగుడ్డు మీద ఈకలు పీకేందుకు ప్రయత్నించింది జిట్‌. అన్నింటికీ మించి దారుణం ఏమిటంటే, ఈ విషయాలన్నీ తెలిసిన ఓ అధికారిని భారతీయ సైన్యం చంపిపారేసిందని ఆరోపించడం..

జిట్‌ రాకను ఆది నుంచీ కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఒక పరిశోధన బృందం భారతదేశానికి రావడం ఇంతకు ముందు ఎన్నడూ జరగనే లేదు. ఈ బృందం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనీ, పైగా మన దేశాన్ని బద్నాం చేసేందుకే అది ప్రయత్నిస్తుందనీ అందరూ భయపడుతూనే ఉన్నారు. మరోపక్క మసూద్ అజార్‌ను బహిష్కరించేందుకు ఐరాస వేదిక మీద భారత్‌ చేసిన ప్రయత్నమూ చెల్లకుండా పోయింది. మన దేశాన్ని అపహాస్యం చేస్తూ, చైనా అజార్‌ను వెనకేసుకు వచ్చింది. జరుగుతున్న పరిణామాల మీద మోదీ ప్రభుత్వం ఏదన్నా కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారు. ఉత్త నిరసనలు, మాటల విరుపులకు ఇక కాలం చెల్లిపోయింది. ఉగ్రవాదులకు, వారికి శిక్షణను అందిస్తున్న సంస్థలకు, ఆ సంస్థలకు పాలు పోసి పెంచుతున్న ప్రభుత్వాలకు గట్టి జవాబునివ్వాల్సిన తరుణం వచ్చింది. మరి ఈ విశయం లో మోదీ అదుగు ఎలా ఉండబోతోందో చూడాలి….

(Visited 74 times, 1 visits today)