నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో ప్రభుత్వ తరఫు న్యాయవాది చేసిన నివేదనను హైకోర్టు నమోదు చేసింది. విగ్రహ ఏర్పాటును నిలుపుదల చేయాలని కోరుతూ సామాజికవేత్త చిన్నం వెంకటరమణారావు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి ముందు విచారణకు వచ్చింది. సంబంధిత అధికారుల అనుమతి లేనిదే మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం నెలకొల్పరాదని టూటౌన్ పోలీసులు హతుడి తండ్రికి ఇచ్చిన నోటీసులో ఆదేశించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. హోంశాఖ తరఫున న్యాయవాది చేసిన ఈ నివేదనను నమోదు చేసిన జస్టిస్ శేషసాయి విచారణను అక్టోబరు 23కు వాయిదా వేశారు. ప్రణయ్ భార్య అమృత వర్షిణి కోరిక మేరకు అతడి విగ్రహాన్ని మిర్యాలగూడలోని సాగర్ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
చిన్న వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్ విగ్రహ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్‌పై హైకోర్టు జస్టిస్ ఏవీ. శేషసాయి పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రణయ్ విగ్రహ ఏర్పాటులో కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, టూటౌన్ సీఐ, మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. కాగా టూటౌన్ సీఐ ప్రణయ్ తండ్రికి నోటీస్‌లు ఇవ్వాలని సూచించింది.