Home / Entertainment / రాజా చెయ్యి వేస్తే రివ్యూ & రేటింగ్.

రాజా చెయ్యి వేస్తే రివ్యూ & రేటింగ్.

Author:

raja Cheyyi Vesthe Movie perfect review and rating

విలక్షణ సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం తెలుగులో ఏ హీరో కూడా లేనంత బిజీగా ఉన్న నారా రోహిత్, రెండు నెలల కాలంలోనే మూడు సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తెచ్చేశారు. ఈ సినిమాల్లో ఒకటైన ‘రాజా చెయ్యి వేస్తే’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి తారకరత్న విలన్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్‌తోనే మంచి అంచనాలు రేకెత్తించింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం.

కథ:

రాజారాం (నారా రోహిత్) డైరెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఉన్న కుర్రాడు. అతను ఛైత్ర (ఇషా తల్వార్) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను ప్రేమిస్తాడు. ఆమె కూడా తన ప్రేమను ఒప్పుకుంటుంది. తన గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీగా గడిపేస్తూ.. తన లక్ష్యం దిశగా అడుగులేస్తున్న రాజారాంకు పేరుమోసిన క్రిమినల్ అయిన మాణిక్ (తారకరత్న)ను చంపాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకు కారణమేటి? మాణిక్ లాంటి పెద్ద క్రిమినల్ ను సామాన్యుడైన రాజారాం ఎలా ఎదుర్కొన్నాడు..? చివరికి అతణ్ని చంపాడా లేదా అన్నది మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

అడ్డొచ్చిన ప్రతి ఒక్కరినీ తెలివిగా హత్యలు చేసి తప్పించుకొనే ఓ ప్రతినాయకుడిని మట్టుబెట్టే ఓ కథానాయకుడి కథే ఇది. ఒక సాదాసీదా కథకి స్క్రీన్‌ప్లే పేరుతో బోలెడన్ని హంగులు జోడించారు. దీంతో అడుగడుగునా మలుపులు, తర్వాత ఇంకేదో జరిగిపోతోందన్న బిల్డప్‌తో సన్నివేశాలు సాగిపోతుంటాయి. కానీ తెరపై కనిపించినంత హంగామాకి తగ్గ భావన మాత్రం సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలో కలగదు. తొలి సగభాగం కథానాయకుడి స్నేహితులు, అతడి ప్రేమ వ్యవహారం చుట్టూనే సాగిపోతాయి. ఇదంతా కాలక్షేపం వ్యవహారంలా అనిపిస్తుంది. మలి సగభాగంలోనే అసలు కథ మొదలవుతుంది. దర్శకుడైతే బోలెడన్ని మలుపులతో సన్నివేశాల్ని రాసుకొన్నాడు కానీ… వాటిని అంతే థ్రిల్‌గా తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. బ్రెయిన్‌ని గన్‌లా వాడితే ఆలోచనలు బుల్లెట్‌లా దూసుకెళ్తాయని నమ్మేవాడే ఇందులో కథానాయకుడు. కానీ ఆ మాటలకి తగ్గట్టుగా మాత్రం ఆ పాత్రని తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు. కథానాయకుడి నిర్ణయాల్లోనూ, ఆలోచనల్లోనూ ఎక్కడా ఇంటెలిజెన్స్‌ కనిపించదు. అలాగే తప్పు చేయమని నాన్న చెప్పలేదు, తప్పు చేయొద్దని అమ్మ చెప్పలేదు… నాకు తోచిందే చేసుకొంటూ వెళ్తుంటే జనం దాన్నే తప్పు అంటారు అని ఫీలయ్యేవాడు ఇందులో విలన్‌. కానీ అంత సంఘర్షణ తారకరత్న పోషించిన విలన్‌ పాత్రలో కనిపించదు. దీంతో ఆ పాత్ర ఓ సాదాసీదా విలన్‌గా మారిపోయింది. ఇలా తెరపై కనిపించే ప్రతీ పాత్ర కూడా పట్టుతప్పింది. కథ, నేపథ్యం, నటీనటులు ఇలా అన్ని దినుసులూ బాగానే పడినా వంటకం మాత్రం కుదర్లేదు.

నటీనటుల ప్రతిభ:

నారా రోహిత్: నారా రోహిత్ …తన పాత్రకు తగినట్లు చేసాడు కానీ ..కాస్త ఒళ్లు తగ్గించుకుంటే బాగుండేది అని అనిపించకమానదు,చివరి అరగంటలో అతడి అభినయం ఆకట్టుకుంటుంది.

ఇషా తల్వార్: హీరోయిన్ ఇషా తల్వార్ క్యూట్ గా అనిపిస్తుంది. నటనలో మాత్రం నిరాశ పరిచింది. కీలకమైన సన్నివేశాల్లో ఆమె తేలిపోయింది.

తారకరత్న: విలన్ గా తారకరత్న స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. లుక్ కూడా ఆకట్టుకుంది. మాణిక్ పాత్ర అతడికి కచ్చితంగా మేకోవరే అని చెప్పాలి. అతడి నటన ఓకే. మున్ముందు ఇలాంటి పాత్రలు మరిన్ని పడితే తారకరత్న తన ప్రత్యేకత చాటుకునే అవకాశముంది.

సాంకేతిక వర్గం పనితీరు:

సాంకేతిక అంశాల పరంగా చూస్తే ముందు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ గురించి చెప్పుకోవాలి. రొటీన్ కథలతోనే స్క్రీన్‌ప్లే మ్యాజిక్ చేస్తే ప్రేక్షకుడిని కూర్చోబెట్టొచ్చనే అంశాన్ని దర్శకుడు బలంగా నమ్మినట్లు కనిపిస్తుంది. అయితే ఆ స్క్రీన్‌ప్లే విషయంలో తాను చెప్పాలనుకున్న పాయింట్‌కు బలమైన ఎమోషన్‌ను జోడించకపోగా, అనవసరమైన ట్రాక్స్ జతచేసి రచయితగా కేవలం ఫర్వాలేదనిపించుకున్నాడు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడిగా అక్కడక్కడా ప్రదీప్ ప్రతిభను చూడొచ్చు. విలన్ పాత్ర రూపొందించిన విధానం, హీరో, విలన్‍ల ఇంట్రడక్షన్.. ఇలా కొన్ని సందర్భాల్లో దర్శకుడి ప్రతిభ బాగుంది.

సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ముఖ్యంగా లైటింగ్ పరంగా తీసుకున్న జాగ్రత్తలతో సినిమాటోగ్రఫీలో అక్కడక్కడా ప్రయోగాలు చూడొచ్చు. సాయి కార్తీక్ అందించిన ఆడియోలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఇక ఎడిటింగ్‌ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అస్సలు బాగాలేవు. వారాహి చలన చిత్రం ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • నారా రోహిత్‌, తారకరత్నల నటన
  • కామెడీ
  • కొన్ని ట్విస్ట్ లు
  • డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • ఎడిటింగ్
  • సెకండ్ హాఫ్

అలజడి రేటింగ్ : 2.5/5

పంచ్ లైన్: తారకరత్న కోసం ఒక చెయ్యి వేయొచ్చు.

(Visited 2,635 times, 1 visits today)