Home / Inspiring Stories / తెలంగాణా లో రిలయన్స్ యూనివర్సిటీ !?

తెలంగాణా లో రిలయన్స్ యూనివర్సిటీ !?

Author:

reliance

తెలంగాణలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు తేవడంపై సమాలోచన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన విమర్షలనూ,ఆమొదాలనూ సమంగానే పొందుతోంది ఐతే ఈ ప్రైవేటు వర్సిటీల అవసరం ఉన్నదా అన్నది ఇంకా తేలలేదు. ప్రైవేటు వర్సిటీలకు అనుమతివ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా చూడాలన్న సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కార్పోరేట్ దిగ్గజాలైన రిలయన్స్, మహీంద్రా, బిర్లా వంటి బడా సంస్థలు తమ తమ యూనివర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించింది. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. వీటితోపాటు రాష్ట్రంలో క్యాంపస్‌లు ఉన్న గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ, ఇక్ఫాయ్ యూనివర్సిటీ వంటివి రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు సీబీఐటీ, విజ్ఞాన్ వంటి పేరున్న విద్యా సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలపై కార్పొరేట్ దిగ్గజాలు మక్కువ చూపుతున్నారు.

ఐతే ఇదివరలో ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రైవేటు యూని వర్సిటీల ఏర్పాటు అంశం చర్చకు వచ్చినప్పుడు ఒక నిపుణుల కమిటీ ఈ అంశం పై వివిద కోణాల్లో అధ్యయనం చేసి ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు ఎలా ఉండాలో నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. అందులోని ప్రధాన అంశాలు.. ఉన్నత విద్యా ప్రమాణాల్ని పరిరక్షించేందుకు ఈ విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా.. అంతర్జాతీయ ప్రమాణాలస్థాయికి తగినట్లు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరగాలి. ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థల స్థాయి పెంచడం కాకుండా.. కొత్తగా మాత్రమే ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరిగితే మంచి ఫలితాలు ఉంటాయి. టైమ్స్‌ హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, సైమండ్స్‌ వరల్డ్‌ యూనివర్శిటీ, అకడమిక్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ వరల్డ్‌ యూనివర్శిటీ తరహా సంస్థలు.. నిర్దేశించిన ప్రమాణలు పాటించిన విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగులు ప్రకటిస్తుంటాయి. ఈ సంస్థలు ప్రకటించే ర్యాంకింగులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్నచిన్న విద్యా సంస్థలు ఈ ర్యాంకింగ్‌ పోటీలో ముందుండలేవు. ఆయా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పరిశోధనాత్మక వ్యాసాలను కొందరు తమ వ్యాసాల్లో ప్రస్తావించేలా ఉండాలి. అధ్యాపకుల పరిశోధనలతో విశ్వవిద్యాలయాలకు ఆదాయం ఉండాలి. ఈ సంస్థల్లో చదివిన విద్యార్థులు ఆయా రంగాల్లో నిష్ణాతులై ఉండాలి. స్కూల్‌ ఆఫ్‌.. నేచురల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌ సైన్సెస్‌, మేథమేటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌, లిబరల్‌ ఆర్ట్స్‌, ఫర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, సోషల్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌, మెడిసిన్‌ కోర్సులు ఈ విశ్వవిద్యాలయాల్లో ఉండాలి.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌లో విజయవంతంగా నడుస్తోన్న ఐదేళ్ల సమీకృత డిగ్రీ కోర్సును నిర్వహించాలని నిపుణుల కమిటీ పేర్కొంది. రాత పరీక్షల ద్వారా ప్రవేశాలు జరపాలని సూచించింది. నిర్వహణ ఎలా ఉండాలో కూడా ఉదహరించింది.ఈ కమిటీ నివేదికను ఉన్నత స్థాయిలో సమీక్షించిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. మార్పులు, చేర్పులతో దీనికి చట్టరూపం తెచ్చే అవకాశం ఉంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో స్థాపించే వాటిని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలుగా పేర్కొంటున్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా 165 వరకు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే నడుస్తున్న ఈ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల పనితీరు అంతంతగా మాత్రంగానే ఉంది.

అనుమతినిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ సంస్థ ఈ దిశగా అడుగులు వేసింది. దీంతో గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే సమావేశాల చివరి రోజున ఆ కసరత్తు పూర్తి కావడంతో బిల్లును ప్రవేశ పెట్టేందుకు వీలు కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రకటించడంతో… అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు మార్గం సుగమం అయింది.

(Visited 143 times, 1 visits today)