Home / Videos / సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ……

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ……

కుక్కపిల్లా,  సబ్బు బిళ్ళా, అరటితొక్కా, బల్లచెక్కా ఏదీ కవిత్వంలో వస్తువుగా అనర్హం కాదన్నారు శ్రీశ్రీ. ఉదాత్తమైన వస్తువు మాత్రమే కవితా వస్తువుగా ఉండాలని మన ఆలంకారికుల నమ్మకం. కానీ సమాజంలో తేలికగా చూడబడే సిగరెట్టు లాంటి  వస్తువు  మీద “న భూతో నభివిష్యతి”
అన్నట్టు  అమోఘమైన పాట రాసారు కొసరాజుగారు. సరదా పాటల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన పాటల్లో ఇది మరీ ఉత్తమమైన కోవకు చెందుతుంది

సిగార్ అంటే ఎండిన పొగాకును చుట్టగా చుట్టినది అని అర్థం. ఆ చుట్టని నైస్ గా చిన్నగా చుడితే అదే సిగరెట్. మన తెలుగు మర్యాద ప్రకారం సిగరెట్టుగా చేసుకుని వాడుకుంటున్నాం.

సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ 

 పట్టుబట్టి ఓ దమ్ములాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు

అంటూ ఓ భర్తగారు గుఫ్పు గుఫ్ఫుమని పొగను పీలుస్తూ వదులుతూ స్వర్గం లో తేలుతున్నట్టుగా మురిసిపోతుంటాడు.  భర్త దగ్గరకు వచ్చిన భార్య  సిగరెట్టు పొగలు చుట్టుముట్టగా ఉక్కిరి బిక్కిరవుతుంది.  ఆ సందర్భంలో సిగరెట్టు మంచి చెడులను ఎవరికి వారు సమర్థించుకుంటూ విమర్శించుకుంటూ సంభాషించుకునే  పాట ఇది.  తనకి భర్తలో నచ్చని ఈ ధూమపానసేవనం నుంచి ఎలాగయినా మరల్చాలని భార్య ప్రయత్నించడం,  ఎన్నో వాగ్బాణాలను విసరడం, భర్త వాటిని తెలివిగా తిరగ్గొట్టడం ఈ క్రమంలో కొసరాజుగారి చమక్కులు ప్రేక్షకులకి, శ్రోతల మనసులకి చురుక్కమనిపంచడం, మనసుల్లో హాసపు మెరుపులు చమక్కుమనడం షరా మామూలే.

భారతీయుల్లో ఉన్న పెద్ద అవలక్షణం –  విదేశీ వస్తువుల పట్ల మోజు. మన దేశంలో పొగాకు కు ఈ విధమైన వినియోగాన్ని పరిచయం చేసినవారు బ్రిటిషర్లు.  బ్రిటిష్ దొరలు ఓ పైప్ నోట్లో వేసుకుని పొగను పీలుస్తూ  వదులుతూ అధికారం ప్రదర్శిస్తూ దర్జాగా ఆర్డర్లు వేస్తుంటే  ఆ దొరల స్టైల్ కి దాసోహమన్నారు చాలా మంది. అందుకే అలా విలాసంగా, కులాసంగా కనిపించడానికి వారిని అనుకరిస్తూ ఈ సిగరెట్ తో  పొగతాగడంలోని ఆనందాన్ని ఊరికే రుచి చూడడానికి ప్రారంభించి చివరకు దానికి దాసోహం  అన్నారు.  “ దొరల్ దాగు బల్ సిగరెట్టూ“అంటూ ఆ భర్త సీమ దొరలను మెచ్చుకోవడం లో ఈ ఫాషన్ అనుకరణని చూపించారు కొసరాజు. తన కంపు తనకే ఇంపు కానీ ఇతరులకు కాదు కదా. భార్యకి ఆ సిగరెట్ వాసన కంపుగా కనిపిస్తుందందుకే.

 కంపుగొట్టు ఈ సిగరెట్టు కాల్చకోయి నా పై ఒట్టు” అంటూ సెంటిమెంట్ తో అతన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నం ప్రారంభిస్తుంది.  మనిషి మీద ఒట్టు వేసి, ఆ పై మాట తప్పితే ఒట్టువేయబడిన మనిషికి ప్రాణం మీదకి వస్తుందని మన నమ్మకం. అందుకే తన మీద ఒట్టు వేస్తే భర్త  ఆ పాడు సిగరెట్టు కాల్చే అలవాటు మానుకుంటాడేమోనని ఆమె ఆశ. కానీ ఆ భర్త ఒట్టు వేయడానికి ఒప్పుకుంటేనా.“కడుపు నిండునా కాలు నిండునా వదిలి పెట్టవోయ్ నీ పట్టు”  అంటూ బతిమాలడం మొదలు పెట్టింది. కడుపునిండుతుందా, కాలు నిండుతుందా  అంటూ ఏదైనా ప్రయోజనం లేని పనికి వాడే జాతీయాన్ని ఈ భార్య పాత్రతో అనిపించడం  ఎంతో చక్కని ప్రయోగం.

 సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేసాడు “ అంటూ సిగరెట్టు గొప్పదానాన్ని వివరించబోతాడు. ఆంజనేయుడు తన తోకకు నిప్పంటించుకుని లంకను దహనం చేసాడు.  ఆ పురాణ గాథని వక్రీకరించి భార్యకి సిగరెట్టు మంటతోనే ఆంజనేయుడు లంకాదహనం చేసాడని, అది అతి పవిత్రమైనదని  చెప్పి ఆమెను ఒప్పించాలనుకున్నాడు. కానీ భార్య అతను  అనుకున్నంత అమాయకురాలు కాదు. అందుకే – “ఎవడో కోతలు కోసాడు” అంటూ ఆ కల్లబొల్లి మాటలు నమ్మడం మీ తెలివితక్కువ అన్నట్టుగా ఖండించేసింది.

ఇక సిగరెట్ కాల్చడాన్ని ఓ సరదా వ్యాపకంగా చేసేవారు కొందరయితే దాన్ని ఓ మహా కళారాధనగా చేసేవారు మరికొంతమంది. ఈ సిగరెట్ పొగను బయటికి వదలడంలో రింగులు రింగులు తిరిగేలా మబ్బుల్లా కనిపించేలా చేయడం ఓ కళగా అభ్యసిస్తారు కొందరు. అలాంటి వారి గురించే  ఈ మాట.

ఈ  పొగతోటి గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చు “ అని ఓ గొప్ప కళాసృష్టి చేయబోతున్నట్టు భార్యకి చూపించబోతాడు. కానీ భార్య దాన్ని తేలిగ్గా కొట్టిపారేసింది. అలాంటి పనులు చేయబోయి, చేతకాక “ మీసాలు కాల్చుకోవచ్చు” అంటూ జరగబోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. నిప్పును నోట్లో పెట్టుకుని ఆటలు ఆడితే నోటిమీద మీసాలు కాలే ప్రమాదం ఎంతేనా ఉంది మరి.

కన్నెపిల్లలుగా ఉన్నప్పటినుంచే ఆడవాళ్ళు మంచి భర్తకోసం, అతని ఆరోగ్యం కోసం, క్షేమంకోసం లక్షా తొంభై నోములు నోస్తారు. వ్రతాలు చేస్తారు. అలాంటిది తన కళ్ళముందే ఆ భర్త ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సిగరెట్లను ఊదొత్తుల్లా వెలిగిస్తుంటే భార్య మనసు ఎంత దుఃఖపడుతుందీ. అందుకే అంటుంది ఆ బార్య-

 ఊపిరితిత్తుల కాన్సర్ కిదియే కారణమన్నారు డాక్టర్లూ”అంటూ అతని  ఆరోగ్యం గురించి హెచ్చరికలు చేస్తుంది.

కానీ ప్రజలందరూ నిత్యం కొలిచే తెర వేల్పులు  మన హీరోలు.  ఈ కంపెనీ సిగరెట్లు కాల్చండి అంటూ పెద్ద పెద్ద హోర్డింగుల మీద నిలబడి చిద్విలాసంగా సిగరెట్లు కాల్చే ఫోటోలు ఎన్నో చూసాడు సదరు భర్త గారు. అందుకే ఆ డాక్టర్ల కన్నా తాను అభిమానించే తన యాక్టర్ల మాటనే నమ్ముతాడు. అంత గొప్ప యాక్టర్ సిగరెట్ కాలుస్తూ తనని కూడా కాల్చమని సలహా ఇస్తుంటే వద్దనడంలో ఏమీ సహేతుకం కనిపించదు అతనికి. ఆ రోజుల్లో యస్వీ రంగారావుగారు బర్కిలీ సిగరెట్లకి బ్రాండ్ ఎంబాసిడర్ అట. ఆయనకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ మనందరికీ తెలిసినదే. ప్రజలు తమ అభిమాననటుల మాటలనే ఎక్కువగా నమ్ముతారని కంపెనీలకి తెలుసుకనుకే టాప్ నటులందరితోను తమ వస్తువులకి ప్రకటనలు గుప్పిస్తారు.  ఎన్నార్ వంటి నటుల పోజు చూసి సిగరెట్లు అలవాటు చేసుకున్నవారు వేలాదిగా ఉన్నారు ఆంధ్రదేశంలో.“కాదన్నారులే పెద్ద యాక్టర్లు “అంటూ భార్య మాటలకి రైమింగ్ గా జవాబు చెప్తాడు.

సిగరెట్ పొగ గుండెలనిండా కమ్ముకుని బాగా “ పసరులా చేరి, కఫం పేరుకుని  ఊపిరితిత్తులను పనిచేయకుండా  చేసి క్రమంగా ఉసురు తీస్తుందని“ఎంతో బాధగా చెప్తుంది భార్య. అవన్నీ” తెలివితక్కువ దద్దమ్మలు మాత్రమే వినే మాటలని ” తనకి తెలివి ఉందని ఆమె మాటని కొట్టిపారేస్తాడు.

సిగరెట్ కాల్చేవారికి దాని పొగ సుగంధ పరిమళాలు వెదజల్లవచ్చు. కానీ ఆ పొగను పీల్చేవారి దురవస్థ వారికేం పడుతుంది. మిత్రులు తెలిసిన వారు,  సిగరెట్ తాగుతుంటే పక్కనున్నవారు  ముక్కు మూసుకుంటే మర్యాదగా ఉండదేమోనని మొహమాట పడేవారుంటారు.  ఆ కంపు భరించలేక  ఆ మాట చెప్పలేక  ముక్కులు ఎగరేస్తారు.కానీ ఈ విషయాన్ని తనకు కావలసినట్టు అర్థం చేసుకుంటారు ధూమపానిస్టులు. అందుకే

“ పక్కనున్నవారు దీని సువాసనకు ముక్కులు ఎగరేస్తారు నీవెరుగవు దీని హుషారు

అంటూ ఆమెకి పరమళాన్ని గుర్తించే శక్తిలేకపోవడమేమిటో నని ఆశ్చర్యం ప్రకటిస్తాడు. ఈ కంపు భరించలేకనే ధియేటర్లలో ధూమపానాన్ని నిషేధించారని అతన్ని వారించబోతుంది భార్య. ధియేటర్లలో ఈ ధూమపాన నిషేదం ప్రకటించినదగ్గర్నించే సినిమాలకు డబ్బులు వసూళ్ళు తగ్గిపోయాయని ఆ అస్త్రాన్ని తిప్పికొడతాడు భర్త. ఇది తిరుగులేని అస్త్రం మరి. సినిమాలు బాగా ఆడకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ధూమపానం పైన నిషేధమే దానికి కారణమని చెప్పడం కొసరాజు గారి చమక్కు.

ఇదిగో సరిగ్గా అలాంటి కాన్సెప్ట్ తీసుకునే….ఒక హిందీ పాటతో యు ట్యూబ్ లో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. దిన్ హొ యా రాత్ హో …అంటూ సాగే ఈ పాటలో సిగరెట్ కాన్సర్ ని, నికోటిన్ ని ఎలా గంట గంట కూ గుర్తుకు తెస్తుందో కూడా ఓ ఇద్దరు ఫ్రెండ్స్ సరదా సంభాషణలు, తదనంతర పాట ని చూస్తే …మనకి సిగరెట్ మీద ప్రపంచంలో ఎంత డిస్కషన్ నడుస్తోందో అర్ధం అయిపోతుంది. సిగరెట్ మంచి, చెడుల గురించి డీటైల్డ్ గా ఆ వీడియో లో చూడండి. మీరూ ఎంజాయ్ చేస్తారు.

(Visited 214 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]