Home / Entertainment / సరైనోడు రివ్యూ & రేటింగ్.

సరైనోడు రివ్యూ & రేటింగ్.

Author:

Sarainodu Movie Perfect Review and Rating సరైనోడు రివ్యూ సరైనోడు రేటింగ్

అసలే వేసవి సెలవులు…. పిచ్చి పిచ్చిగా చదువుల్లో పడిపోయిన పిల్లలంతా సినిమాల కోసం ఎగబడె టైం..పిల్లల చదువులతో విసిగిపోయిన తల్లి తండ్రులకు కూడా కాస్త రిలీఫ్ కోసం చూసే ఈ సీజన్ లో మంచి కలెక్షన్స్ సాధించడానికి మంచి అవకాశం అయితే ఈ సీజన్ లో సినిమాలు వచ్చాయా లేదా అని కాదు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలు ఆడాయా లేదా అన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. సినిమా సినిమాకి వైవిధ్యంగా కనిపించాలని తాపత్రయపడే యువ కధానాయకుల్లో అల్లు అర్జున్ ముందుంటాడు. ఈ సారి పూర్తిస్థాయి ‘మాస్’ క్యారెక్టర్లో ‘ సరైనోడు ‘గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘లెజెండ్’లాంటి హిట్ సినిమా తర్వాత రెండేళ్లు విరామం తీసుకుని బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా ‘ సరైనోడు ‘ఒకరు స్టైలిష్ స్టార్.. మరొకరు మాస్ మాస్టర్.. వీళ్లిద్దరి టార్గెట్.. బ్లాక్ బస్టర్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ ‘ సరైనోడు ‘అంచనాలను అందుకుందో లేదో చూద్దాం..

కథ:

అయిల్ కంపెనీ కోసం పేద రైతుల దగ్గర భూములను లాక్కుంటుంటాడు వైరం ధనుష్(ఆది పినిశెట్టి). ముఖ్యమంత్రి కొడుకు కావడం, అంగ, ఆర్ధిక బలం ఉండటంతో ఎవరూ ఏమీ అనలేరు. కథ ఇలా సాగుతుండగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఉమాపతి(జయప్రకాష్) తనయుడు గణ(బన్ని) మిలటరీ నుండి పని మానేసి వచ్చేస్తాడు. ఉమాపతి తమ్ముడు శ్రీపతి(శ్రీకాంత్), గణను స్వంత కొడుకులా పెంచుకుంటుంటాడు.గణ కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే రకం కాదు. ఫలితంగా ఊర మాస్గా తయారవుతాడు. దివ్య (కేథరీన్) ఎమ్మెల్యే కూతురు. తండ్రి హత్య అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. ఎమ్మెల్యే దివ్యను ప్రేమిస్తాడు గణ. ఆమె కూడా గణను ఇష్టపడుతుంది. పెళ్లికి ఇరు కుటుంబాల ఆమోదం లభిస్తుంది. అయితే ఈ పెళ్లి జరగాలంటే తనకో ప్రామిస్ చేయాలంటూ షరతు పెడుతుంది దివ్య. ఇక మీదట ఎలాంటి గొడవలకు వెళ్లనని ఒట్టేస్తే తప్ప పెళ్లికి ఒప్పుకునేది లేదంటుంది. ఆమెకు ప్రామిస్ చేస్తున్న సమయంలోనే మహాలక్ష్మి(రకుల్ ప్రీత్ సింగ్)మరో సమస్యతో అక్కడికి వస్తుంది… ధనుష్ అనుచరులు చంపడానికి వస్తారు. వారి నుండి గణ మహాలక్ష్మిని కాపాడతాడు. అసలు మహాలక్ష్మి ఎవరు? ధనుష్, మహాలక్ష్మి మధ్య రిలేషన్ ఏంటి? చివరకు గణ మహాలక్ష్మిని ఎలా కాపాడాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

అలజడి విశ్లేషణ:

అల్లు అర్జున్ కెరీర్ చూస్తే, ప్రతీ సినిమాకు తనను తాను ఎంతో మెరుగు పరుచుకుంటూ అటు నటనలోనూ, కధలు ఎంపికలోనూ జాగ్రత్త పడే హీరో. అటువంటిది సరైనోడు నువ్వే అని బోయపాటి అనగానే ఒప్పుకోవడం సరైన నిర్ణయం ఆ లేదా అనే డౌటు వస్తుంది. ఇక ఆది పినిశెట్టి కి మాత్రం తెలుగులో సరైనది ఐతే ఇది కాదు అని ఒప్పుకు తీరాలి. కాని నటన పరంగా ఇద్దరు సరిగ్గా సరిపోతారు. ఒకరిని తలదన్నేలా మరొకరు ఉన్నారు. ఇక భారీ తారాగణం ఉన్న మిగతా వారు తమ పరిధి మేరకు మెప్పించారు. రాజీవ్ కనకాల, శ్రీకాంత్ చాలా బాగా చేసారు. ఇక బ్రహ్మానందం కామెడి, నీతి వాక్యాలు జనాలను అలరిస్తాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో సినిమాను కాపాడటానికి చాలా ప్రయత్నించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది…. సరైనోడు కొన్ని తప్పటడుగులు వేసేసాడు… హీరోయిన్ కష్టాల్లో ఉంటే హీరో అనుకోకుండా ఆమె ఊరు వెళ్లడం వాళ్లని కాపాడటం, విలన్స్ చేతిలో హీరోయిన్ ఫ్యామిలీని కోల్పోవడం, హీరో దగ్గరికి వస్తే అతనేం చేశాడనే కథలు చాలానే చూశాం. ఫస్టాఫ్ లో ఉన్న కాస్తా ఎంటర్ టైనింగ్ సెకండాఫ్ లో కనపడదు. పేరుకు ఇద్దరు గ్లామరస్ హీరోయిన్స్ కానీ ఇద్దరూ హీరోతో డ్యాన్సులు వేస్తూ, పాటలు పాడటానికి పరిమితమైపోయారు. ఆది పినిశెట్టి మాత్రం విలన్ గా ఆకట్టుకున్నాడు. మొత్తం మీద బలహీనమైన కథకు టెక్నికల్ గా మ్యూజిక్ రూపంలో సపోర్ట్ దొరకలేదు. నిజం చెప్పాలంటే అర్జున్ ఫ్యాన్స్ కి తప్ప మామూలు ప్రేక్షకుడికి పెద్దగా నచ్చే సినిమా కాదు…

నటీనటుల పని తీరు:

ఎప్పటి మాదిరిగానే బన్ని తన ఎనర్జి పరంగా ఎక్కడా డ్రాప్ కాలేదు.తన పెర్ఫార్మెన్స్ లో గానీ, ఫైట్స్ లో గానీ తన మార్క్ ఉండేలా చూసుకున్నాడు. నిజానికి బన్నీ ఒక్కడే ‘ సరైనోడు ‘ సినిమా మొత్తాన్ని తన రెండు భుజాలపై లాగాడు. ఇక హీరోయిన్స్ లో రకుల్ పాత్ర మరీ చెప్పుకోదగ్గదేం కాదు ఫస్టాఫ్ రెండు సీన్స్, సెకండాఫ్ లో మరో నాలుగు సీన్స్, రెండు, మూడు పాటలకు మాత్రమే పరిమితమైంది.హుందా నటనతో క్యాథరిన్ ఎమ్మెల్యే పాత్రలో కనిపించింది. అసలు ఫస్టాఫ్ హీరోయిన్ క్యాథరిన్ అనే చెప్పాలి. కానీ ఏం లాభం పాపం ఇద్దరికీ నటించే చాన్సే రాలేదు ఇద్దరూ హీరోయిన్స్ గ్లామర్ డాల్స్ అయ్యారు. ముఖ్యంగా చెప్పకోవాల్సింది హీరో నుండి విలన్ గా మారిన ఆది పినిశెట్టి విశయం. పాత్ర పరంగా మంచి విలనిజాన్నే కనపరిచాడు. ఈ స్టేజ్ లో ఇలాంటి రోల్ చేసినందుకు ఆది ని అభినందించాల్సిందే.నటనల్ లోనూ మంచి పరిణితి చూపించాడు. బన్నీ కి ఎదురుగా సరైన యంగ్ విలన్ గా ఆది సరైన ప్లస్ పాయింట్ అయ్యాడు. శ్రీకాంత్, జయప్రకాష్, బ్రహ్మానందం, సుమన్, ఆదర్శ్ బాలకృష్ణ సహా ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేర చక్కగా నటించారు.అంటే పెద్దగా చెప్పుకోదగ్గ పాత్ర ఎవరికీ లేదనే చెప్పాలి మరి.

సాంకేతిక వర్గం పని తీరు:

భద్ర సినిమాని కాస్త రీరైట్ చేసి రొటీన్ మాస్ హీరో పాత్రకి అల్లు అర్జున్ అనే గ్లామర్ ఆడ్ చేసిన బోయపాటి ఎందుకని తెలుగు ప్రేక్షకున్ని ఇంతగా లోకువకట్టాడో అర్థం కాదు. సరే పాయింట్ రోటీన్ దే కదా అనుకుందామంటే దానికి ఎంటర్ టైనింగ్ జోడించి చెప్పి ఉన్నా బావుండేది కనీసం అదీ లేదు. ఇక రెండు తప్ప మిగిలిన పాటలు ఎప్పటిలాగే థమన్ బాబు డ్రమ్ము చప్పుళ్ళ తోనే నిండిపోయాయి,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరీ ధారుణం. యాక్షన్ అయినా సెంటిమెంట్ అయినా,కామెడీ అయినా అస్సలు తేడా లేకుండా ఒకే లాగా లాగి చాలా “జాగ్రత్త పడ్డాడు” థమన్. … కనీసం సెకండాఫ్ లో కొంత ఎంటర్టైన్మెంట్ మీద దృష్టి పెట్టటమో చేసినా లేదంటే మొత్తం సినిమా లెంగ్త్ తగ్గించినా కథ కాస్త పరిగెడుతున్నట్టు గా అనిపించేది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బావుంది. ఫస్టాఫ్ పరావాలేదనిపిస్తుంది కానీ సెకండాఫ్ విషయానికి వస్తే ఇంటర్ వెల్ అయిన పదినిమిషాల్లోనే మనం క్లైమాక్స్ తెలిసిపోయేలా ఉంటుంది.కథ ముందే తెలిసిపోతుంది. దాంతో ప్రేక్షుకుడికి ఉత్కంఠత కనపడదు.

ప్లస్ పాయింట్స్:

  • అల్లు అర్జున్ యాక్టింగ్,
  • ఆదిపినిశెట్టి
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • కథ,కథనాలు
  • సంగీతం
  • ఎడిటింగ్
  • కామెడీ గా అనిపించని కామెడీ
  • సినిమా సెకండాఫ్ మరీ సాగ దీసినట్టుగా ఉండటం

అలజడి రేటింగ్: 2.5/5

పంచ్ లైన్: బోయపాటికి బాలయ్యే సరైనోడు.

(Visited 7,246 times, 1 visits today)