Home / General / మూగవోయిన జ్ఞాన పీఠ౦

మూగవోయిన జ్ఞాన పీఠ౦

Author:

ఎన్నో అద్భుతాలు రాసి మనకు అందించిన ప్రముఖ రచయిత, కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి(85) ఇకలేరు. సినారె గానే ఈయన అందరికీ సుపరిచతులు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినారె సోమ‌వారం ఉదయం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు.

singireddy narayana reddy

సినారె … ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తెలుగు భాష, సాహిత్య ప్రక్రియల్లో అందెవేసిన చేయి సినారె ది. 1977లో పద్మశ్రీ పురస్కారం పొందిన సినారె కి,  1988లో తన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్‌ పురస్కారం అందుకున్నారు. విశ్వనాధ సత్యనారాయణ గారి తరువాత జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు సాహీతీకారుడు ఈయనే. ఎన్నో హృద్యమైన తెలుగు సినిమా పాటలు రాసిన సినారె తొలి రచన 1953లో రాసిన నవ్వని పువ్వు. ఈయన సినీ గేయ రచయితగానే బాగా ఫేమస్ అయినప్పటికీ పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శనా గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి ఎన్నో రాశారు. ఆయన రచనా సాగర పరంపరని ఒక్క ముక్కలో చెప్పడం అసంభవం… అనితర సాధ్యం. దేశ సాహితి సౌరభాల్లో తనకంటూ ప్రత్యేకతను నింపుకున్న అరుదైన సాహితీవేత్త మన సినారె.

1931, జూలై 29న కరీంనగర్ జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు హనుమాజీపేట్ లో జన్మించారు సినారె. వీరిది రైతు కుటుంబం. తండ్రి మల్లారెడ్డి రైతు, తల్లి బుచ్చమ్మ గృహిణి. బాల్యంలోనే కళల పట్ల ఆకర్షితులయ్యారు సినారె. తమ ఊరిలో, చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే హరికథలు, జానపదాలు, జంగం కథలు అన్నింటికీ వెళ్ళేవారు. సాహిత్యం పట్ల అలా చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. సినారె చదువంతా ఉర్దూ మీడియం లోనే జరిగింది. అప్పట్లో తెలుగు ఒక ఆప్షనల్ గానే ఉండేది. సిరిసిల్ల, కరీంనగర్ లలో హై స్కూల్ చదివిన ఈయన  హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కాలేజీ లో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ చేసిన సినారె, సాహిత్యం లోనే పీ హెచ్ డీ చేసి డాక్టరేటు పొందారు.

సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, నిజాం కాలేజీల్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. తర్వాత  ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా నియమించబడ్డారు. ఇక తన రచనా పరంపరను కొనసాగించారు. పద్యం, గద్యం అని తేడా లేకుండా అనేక రచనలు చేసారు. అనువాదాలు కూడా చేసారు. సినారె గ్రంథాలు కూడా ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. 1962 లో గులేబకావళి కథ సినిమాలోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ’ అనే పాటతో సినీ రంగ ప్రవేశ౦ చేసిన సినారె దాదాపు 3500  పాటలు రాశారు. స్వర్గీయ ఎన్టీఆర్ పిలిచి మరీ ఈయనచే పాటలు రాయి౦చుకున్నారట. ఈయన రాసిన అనేక పాటలు ఇప్పటికీ చాలా పాపులర్.

సినారె చేసిన సాహిత్య సేవలకు గానూ 1997లో భారత రాష్ట్రపతి సినారె ని రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేశారు. ఆరేళ్లపాటు పెద్దల సభలో కూడా ఆయన తన పెద్దరికాన్నే ప్రదర్శించారు. ఆయన ప్రసంగాలు, చర్చలు, ప్రశ్నలు అందరి మన్నలనలను అందుకున్నాయి. తెలుగు సాహిత్యానికి, భాషకీ ఎనలేని కృషి చేసిన సాహితీవేత్త  శ్రీ సినారె గారి మృతికి అలజడి శ్రద్దాంజలి ఘటిస్తుంది.

సినారె అవార్డులు.. రివార్డులు

  • జ్ఞానపీఠ్‌ అవార్డు
  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
  • భారతీయ భాషా పరిషత్‌
  • రాజ్యలక్ష్మీ పురస్కారం
  • సోవియట్‌-నెహ్రూ పురస్కారం
  • ఆసాన్‌ పురస్కారం
  • ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం

సినారె వరించి వన్నె తెచ్చిన పదవులు..

  • ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981)
  • ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతి వ్యవహారాల సలహాదారు(1982)
  • అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు(1985)
  • పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు(1989)
  • రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడు
(Visited 252 times, 1 visits today)