Home / Devotional / మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఖచ్చితంగా ఎందుకు చేయాలో తెలుసా..?

మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఖచ్చితంగా ఎందుకు చేయాలో తెలుసా..?

Author:

ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ… శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధ‌భాగమిచ్చిన అర్ధ‌నారీశ్వరుడు. తనను యముని బారినుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. మహేశ్వరుడిని, పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే, మహా శివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. ‘శివ’ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్ధం. కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్‌ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే… మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం “శివలింగంగా” ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి.

శివరాత్రి యొక్క మహాత్మ్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే సుస్వరుడనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పి పోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకుని దాని మీద ఎక్కి కూర్చొని, ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ…. తన రాక కోసం ఎదురుచూసే భార్యాబిడ్డల్ని తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ రాత్రి ఏం చేయాలో…? ఎటు వెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కిందకి పడేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్లి చెట్టు కింద కొలువైన శివలింగం మీద పడతాయి. తెల్లవారగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివసాయుజ్యం చేరుకున్నాడు. బోయవాడు అడవిలో దారితప్పిన రోజు మహాశివరాత్రి అవటం, ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయడమే కాకుండా, తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో అర్చించడం వల్ల బోయవాడు శివసాయుజ్యం చేరుకున్నాడు. బోయవాడు  శివరాత్రి మహాత్మ్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణానంతరం పొందగలిగాడు.

మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు.. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి శివదర్శనం చేసుకొని, శివనామస్మరణతో ఉపవాసం వుండాలి. రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియక పోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకలసంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది.

sivarathri puja upavasa method

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.

(Visited 4,139 times, 1 visits today)