గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జి దోలకియా గుర్తుండే ఉంటుంది. ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన గిఫ్ట్స్ ఇస్తూ వారి ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు.
ఐతే ఈసారి కూడా అంతే కాస్ట్‌లీ గిఫ్ట్‌లను తన ఉద్యోగులకు ఇచ్చాడు ఆ వ్యాపారి.తన సంస్థలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు రూ.3కోట్ల విలువైన అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కార్లను బహుమానంగా ఇచ్చారు.
ఈ ఏడాది తన సంస్థలోని సీనియర్ ఉద్యోగులైన నీలేశ్ జాడా, ముకేశ్ చాంద్పారా, మహేశ్ చాంద్పారాలకు అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 350డీ మోడల్ కార్లను బహూకరించారు.చిన్న వయసులోనే అంటే 13 లేదా 15 ఏళ్లు వయసున్న సమయంలో ఈ వజ్రాల వ్యాపారి కంపెనీలో చేరారు.
సూరత్‌లో ఈ బహుమతుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ చేతుల మీదుగా ఉద్యోగులకు ఈ బహుమతులను బహుకరించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ గవర్నర్ సైతం హాజరయ్యారు. ఈయన సంస్థలో ప్రస్తుతం 5,500మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ టర్నోవర్ రూ.6,000 కోట్లు.