Home / Inspiring Stories / పొలం గట్టు మీద పురుగులమందు డబ్బా తో…. అతను మన నాన్నే అయ్యే రోజు వస్తే…!?

పొలం గట్టు మీద పురుగులమందు డబ్బా తో…. అతను మన నాన్నే అయ్యే రోజు వస్తే…!?

Author:

wooden plough

పొలం గట్టుమీద నాగలి భుజాన వేసుకొని నడుస్తూన్న రైతు ఒక్కసారిగా కుప్ప కూలుతున్నాడు. నేలని దున్నాల్సిన రైతు తన దేహాన్ని చీల్చేస్తున్న అప్పులతో కుంగిపోతున్నాడు. ఏ రైతును చూసినా కష్టమే! సాగు నష్టమే! ఎక్కడికక్కడ పచ్చగా కళకళ లాడాల్సిన వ్యవసాయ భూములు శవాలను మొలిపించి రైతు రక్తం తో ఎర్ర బారుతున్నాయి. తప్పెవరిది. పట్టించుకోని ప్రభుత్వానిదా? ఒక కిలో బియ్యం 50 రూపాయలకు కొంటూ క్వింటా ధాన్యం 1000 రూపాయలకు అమ్ముకుని కుమిలి పోతున్న అన్నదాతను కూడా పట్టించుకోని మనదా..? ఇంకా భూమి తల్లి పై నమ్మకం కోల్పోకుండా ఆ భూమినే నమ్ముకొని మనకు అన్నం పెడుతున్న రైతుదా? తప్పు ఎవరి దగ్గరుంది… ఇన్ని వేల బలవన్మరణాలకు కారకులు ఎవరు..? ప్రతీ ప్రశ్నకీ సమాధానం ఉంది కానీ ఆ సమధానం ఇవ్వటానికే ఏ ఒక్క గొంతూ ముందుకు రావటం లేదు… నేల రాలుతున్న ఈ దేశపు వెన్నుముక రైతు… మన అన్నదాత రైతు.. చచ్చిపోతున్నాడు… అందె శ్రీ అన్నట్టు మాయమైపోతునాడు మనిషన్నవాడు…. కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పట్టించుకోవడం లేదు. ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేయడం తప్ప… వాటి నివారణపై చిత్తశుద్ధి కనిపించడమే లేదు.

1995 నుంచి 2010 మధ్య… అంటే 16 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఏకంగా 31,120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జాతీయ నేర సమాచార విభాగం చెప్పిన అధికారిక సమాచారం! దీనికి కారణాలను సుస్థిర వ్యవసాయ కేంద్రం, రైతు సురాజ్య వేదిక, యాక్షన్ ఎయిడ్, జయతీ ఘోష్ కమిటీ తదితర సంస్థలు, సంఘాలు విశ్లేషించాయి. వరి బస్తా పండించడానికి రైతుకు సగటున 1600 రుపాయలు ఖర్చు అయితే, వారికి లభించేది 1200 మాత్రమే.ఎన్నికల్లో భారీ హామీలనిచ్చి అధికారాన్ని కైవసం చేసుకున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటిని తీర్చలేకపోతున్నారు. హామీలను తీర్చే శక్తి రాష్ట్రాల ఆర్ధికవ్యవస్ధకు లేదని, కార్పొరేట్‌ శక్తుల ఆర్ధికమద్దతుతోనే వీటిని నేరవేర్చగలమని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మొదట్లో కేవలం 29 గ్రామాల నుండి 30 వేల ఎకరాల పంట భూముల్ని సేకరిస్తామని సెలవిచ్చిన ముఖ్యమంత్రి, దానికి గుంటూరు జిల్లాలోని మరో 153 గ్రామాలను కలిపాడు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్ధ గణాంకాల ప్రకారమే రాజధాని పరిధి 8,352 చ.కి.మీ. అంటే ప్రభుత్వం రెండు లక్షల ఎకరాలను రాజధాని పేరుతో సేకరించి రియల్‌ఎస్టేట్‌ శక్తులకు అప్పగించడానికి అభివృద్ధి పేరిట సిద్ధమైంది.

farmer-suicide_1

ఇక తెలంగాణా విషయానికి వస్తే రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వింతైన కారణాన్ని చెప్పింది. ఆడంబరంగా పెళ్లిళ్లు, ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించడానికి చేస్తున్న భారీ ఖర్చులు రైతుల ఆత్మహత్యలకు కారణమని వాదించింది. కాగా, రైతు ఆత్మహత్యలపై పిటిషనర్లు వాస్తవాలు వెల్లడించడం లేదని, గత ఏడాది 1347 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నది నిజం కాదని చెప్పింది. నిరుడు జూన్‌-అక్టోబర్‌ మధ్య 782 మంది ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో 342 మంది మాత్రమే రైతులుని, జాతీయ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం నిరుడు 989 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారిలో 295 మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడినవారని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు చెప్పటమే కాదు గతంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించే వారని, దానిని తమ ప్రభుత్వం ఐదు లక్షలకు పెంచిందని చావులకు తాము పెంచిన ఖరీదుని కూడా చెప్పింది ప్రభుత్వం..

లక్షల కోట్ల రూపాయలను భారీ ప్రాజెక్టుల కోసం వెచ్చిస్తున్న పాలకవర్గాలు, అందులో కేవలం 5 శాతంతో 25 వేల చెరువులకు పూడికతీయచ్చని, చెరువులను నిండు నీటి కుండలుగా చేయవచ్చనే ఇంజనీర్ల విజ్ఞప్తిని పెడచెవిన పెడుతున్నారు. గత 5 సంవత్సరాలలో 75 వేల కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి మరీ ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుల తో ఒక్క ఎకరాకు కూడా నీరందించనే లేదు. రైతుల ల్కోసం కడుతున్నం అని చెప్పే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే నాటికి ఇంకా ఎందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారో అన్న ఆలోచనే భయం గొలుపుతోంది. ‘చనిపోయిన తర్వాత పరిహారమిస్తే ఉపయోగమేముంటుంది.? రైతుల ఆత్మహత్యలకు కారణాల్ని వెతకండి..’ అంటూ ఉన్నత న్యాయస్థానం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హుకూం జారీ చేసింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ హైద్రాబాద్‌ హైకోర్ట్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.ఇది జరిగి కొన్ని నెలలౌతోన్నా ఫలితం ఏమీ లేదు.

farmer-suicide_2

అన్నదాతల మరణాలకు ముఖ్య కారణాలు:

  • వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి,
  • బోర్లపై ఆధారపడటం అధికమైంది,
  • తగ్గిపోయిన భూగర్బ జలాలతో బోర్లు విఫలం కావడంతో రైతులపై భారం పెరిగిపోతోంది,
  • కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు,మద్దతుధర చాలా తక్కువ
  • ,రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించటం పై అవగాహన లేకుండా పోయింది.
  • వర్షాధార వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది.
  • చెరువులూ,కుంటల పుణరుద్దరణ,వర్షాలను పెంచటానికి చేయాల్సిన పనులను పక్కకు పెట్టి పారిశ్రామికీకరణ వైపే అన్ని ప్రభుత్వాలూ మొగ్గు చూపుతున్నాయి.
  • ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే,అదీ కొంత వరకే ఉపయోగపడుతున్నాయి.

India Agriculture

25 కిలోల బియ్యం 1200 పెట్టి కొని అబ్బా ధరలు మండిపోతున్నాయి అనే మనం. క్వింటా ధాన్యాన్ని అదే 1200కు తక్కువకు అమ్ముకుంటున్న రైతును గురించి ఆలోచించటం ఎప్పుడో మరచిపోయాం.. నిజానికి మనదేశం ప్రధానంగా వ్యవసాయాధారిత దేశంగా ఉండేది. దీనిని పారీశ్రామీకీకరణ పేరుతో అవసరం కన్నా ఎక్కువగా పరిశ్రమల మీదా,కంపెనీల స్థాపన మీద దృస్టి పెట్టిన ప్రభుత్వాలు పల్లెలని మరచిపోయాయి.ఇప్పుడు సింగపూర్ మనకు ఆదర్శం అని చెబుతున్నారు మన ముఖ్యమంత్రులు. కానీ….! సింగపూర్‌ పైకి రావటానికి విదేశీ పెట్టుబడులు, సేవారంగం, టూరిజం ద్వారా వచ్చిన ఆదాయమే కారణం తప్ప అక్కడ వ్యవసాయం లేదు. కానీ మనవి ప్రధానంగా వ్యవసాయాధార రాష్ట్రాలు సింగపూర్ తరహా వ్యవహారం ఇక్కడపనికి రాదు… ఇన్ని నిర్లక్ష్యాల నేపథ్యం లో చనిపోతోంది ఒక్క రైతే కాదు మన ఊరూ,మన జీవితం,ఒక చేను గట్టూ మన దేశం… మనమూ చచ్చిపోతున్నాం…

(Visited 780 times, 1 visits today)