Home / Inspiring Stories / కాళ్ళు లేకపోయినా ఆత్మ విశ్వాసంతో నడిచి గూగుల్ లో ఉద్యోగం సంపాదించాడు.

కాళ్ళు లేకపోయినా ఆత్మ విశ్వాసంతో నడిచి గూగుల్ లో ఉద్యోగం సంపాదించాడు.

Author:

Lorry Driver’s Son Who Lost Both His Legs

కొందరంతే కేవలం వారికోసమే కాకుండా మరికొందరినీ ప్రభావితం చేయటానికే భయంకరమైన కష్టాలను మోస్తారేమో… ముళ్ళ మీద నడుస్తూనే వచ్చేవారి కోసం స్పూర్తి గా నిలిచి. కష్టాలను అధిగమించేటందుకు ఒక ధైర్యాన్నిస్తారు… ఇతని లాగా.. తన తల్లి దండ్రులు పెద్దగా డబ్బున్న వాళ్ళు కాదు.తండ్రి ఒక లారీ డ్రైవర్.తల్లి సాధారణ గృహిణి, చిన్నప్పుడే ఒక ప్రమాదం వలన తన రెండు కాళ్ళు పూర్తిగా కోల్పోయాడు అయినా వీల్ చైర్ లోనే IIT వరకూ ప్రయాణించాడు,ఇంజినీరింగ్ పూర్తి చేసి గూగుల్ లో జాబ్ కొట్టాడు… ఇతని పేరు నరేష్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఇన్ని కష్టాలను అనుభవించాక కూడా “దేవుడుకి నేనంటే ఇష్టం అనుకుంటా అందుకే నా మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి మరీ ఎక్కువ పరీక్షిస్తూంటాడు” అని జోక్ వేసి మనలని నవ్వించగలడు ….

జనవరి 11,1993 లో ఒక సంఘటన నరేష్ నే కాదు ఆ కుటుంబాన్నే అతలాకుతలం చేసింది.అతని మాటల్లోనే ” ఒక బందువుల ఇంట్లో ఫంక్షన్ నుంచి వస్తూ అదే రూట్ లో వస్తున్న నాన్న లారీలోనే ఎక్కాం.అక్కలని బోనెట్‌ పై కూర్చో పెట్టి, నన్ను తన సీటు పక్కన ఉన్న డోర్‌ దగ్గర కూర్చోపెట్టుకున్నాడు నాన్న.లారీ కదిలి స్పీడ్‌ అందు కుంది. నిద్ర ముంచుకు వస్తూన్నా కూడా రోడ్లపై తిరుగుతున్న వాహనాలు, ఇళ్లు, షాపులు చూడాలన్న ఉత్సాహం.డోర్ మీద ఒరిగిపోయి కూచున్నా అంతలోనే నా పక్క నున్న డోర్‌ మీద నా చెయ్యి పడింది. అంతే ఒక్క సారిగా అది ఊడి రావటం లారీ నుండి నేను కింద పడటం క్షణాల్లో జరిగి పోయాయి. అదే సమయంలో లారీ వెనక ఉన్న ఇనుప కమ్మెలు నాకాళ్లని చీల్చేసాయి. వెంటనే నాన్న లారీ ఆపాడు. యాక్సిడెంట్‌ అయిన ప్రాంతానికి దగ్గరోనే ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి నన్ను అర చేతుల మీదే పరుగు పరుగున తీసుకెళ్తే పోలీస్‌ కేసు పెట్టాకనే రండి అంటూ నిఖ్ఖఛ్చి గా చెప్పేయటంతో.. చేసేది లేక దిగాలుగా బైటకొచ్చిన నాన్నకి ఎదురుగా రోడ్డు మీద ఓ కానిస్టేబుల్‌ కనిపించాడు. ఆయనకి పరిస్ధితి వివరించడంతో. ఆయనే నన్ను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యులు కాళ్లకి కట్లుకట్టి, పేగులు మెలి తిరిగి ఉన్నాయని ఒక ఆపరెషన్ కూడా చేసారు. ఐతే వారం తర్వాత హాస్పిటల్ కి వెళ్ళేటప్పటికే కాళ్ళలో పూర్థిగా ఇంఫెక్షన్ పాకిపోయింది. దాంతో నా రెండు కాళ్ళను తొలగించారు.”

Lorry Driver’s Son Who Lost Both His Legs

ఏడేళ్ళు వచ్చే వరకూ ఆంద్రప్రదేశ్ లోని తీపర్రు గ్రామంలో, తన తండ్రి ప్రసాద్, తల్లి కుమారి లతో అక్క శిరీష తో ఆనందంగా గడిచిన జీవితం, ఇప్పుడు కనీసం నడవలేని తనను చూస్తూ కుమిలి పోయే తల్లి తండ్రులను చూస్తూ గడపాల్సి రావటం నిజంగా నరకమే. ఐతే ప్రసాద్ సుజాతలు తమ కొడుకు ఆలోచనల్లో కూడా తాను అందరికన్నా తక్కువ అనేలా ఉండకూడదు అనుకున్నారు. నరెష్ కి ధైర్యం చెప్తూనే పెంచారు. తను ఏ మాత్రం కుంగిపోకుండా తన స్కూలింగ్ ని తణుకులో పూర్తి చేసి స్కూల్ లో టాపర్ గా నిలిచాడు. తరవాత గౌతమి జూనియర్ కాలేజి లో ఇంటర్ పూర్తి చేసి ఐఐటిలో సీట్ సంపాదించి తన సత్తా ఏమిటో చూపించాడు.IIT లో తన కోసం లిఫ్ట్ పెట్టించి ఒక ఎలక్ట్రానిక్ వీల్ చైర్ ని బహుమతి గా ఇచ్చి తాను చదివిన నాలుగు సంవత్సరాలు ఎక్కడా లోటు రానివ్వకుండా చూసుకున్నారట కాలేజ్ వాళ్ళు.

ఈ ప్రపంచం లో చెడ్డవాళ్ళూ ఉన్నారు మంచివాళ్ళూ ఉన్నారు అయితే మంచి వాళ్ళే ఎక్కువమంది ఉన్నారు. నన్ను చిన్నప్పుడు స్కూలుదాకా మోసుకు పోయి మోసుకొచ్చే మా అక్కా,మా మ్యాథ్స్ టీచర్ ప్రమోద్ లాల్,ఇంటర్ లో IIT ప్రిపరెషన్ లో నాకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన చౌదరీ,ఒక ప్రయాణంలో నాకు ట్రయిన్ లో కలిసి నా బీ.టెక్ రెండో సంవత్సరం నుంచీ నా హాస్టల్ ఫీజ్ కట్టిన సుందర్, ఐఐటిలో ఇంటర్న్‌ షిప్‌ కోసం నన్ను బోస్టన్‌కి పంపిన ప్రొఫసర్‌ పాండు రంగన్‌ గారు.ఇలా ఎందరో నా విజయాన్ని కొంత కొంతగా నాకు దగ్గర చేసారు వీరంతా లేనప్పుడు. నేను ఎలా బతికే వాడినో అర్థం కాదు అంటాడు నరేష్…..

naga-naresh-karuturi-wings-dr.sijuvijayan-ayushmithra-300x172

నవ్వుతూ మాట్లాడే ఆ మొహాన్ని చూస్తే అనిపిస్తుంది ఔనేమో…ఒకవేళ అతనన్నదీ నిజమే అయ్యుండొచ్చు… ఇతనంటే దేవుడికి చాలా ఇష్టం అన్నది నిజమే అయిఉండొచ్చు అందుకే ఇతన్ని మనందరికీ స్ఫూర్తిగా ఇక్కడ నిలబెట్టాడు. మనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకే ఈ అబ్బాయిని భూమ్మీదకి పంపాడేమో…

(Visited 1,054 times, 1 visits today)