Home / Inspiring Stories / ఏడేళ్ళ పసివాడు మరణిస్తూనే మరో నలుగురిని బతికించాడు ఎలా??

ఏడేళ్ళ పసివాడు మరణిస్తూనే మరో నలుగురిని బతికించాడు ఎలా??

Author:

This 7-Year-Old Gifts Life To 4 People Before Leaving This World

పసి గుండె చప్పుళ్ళని ఆగిపోనివ్వకూడదనుకున్నారా తల్లితండ్రులు,ఏడేళ్ళు తమ ఇంట్లో నవ్వులు పూయించిన తమ బిడ్డ ఇక ఉండడనే ధుఖాన్ని దిగమింగుకుంటూనే మరి కొంతమందికి ప్రాణం పోయాలనుకున్నారు. ఒక్కడైన తమ బిడ్డ మరో నలుగురిని బతికిస్తున్నాడన్న సంతృప్తితో అతని అవయవాలని దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు ఇక మరో నలుగురిగా బతుకుతున్న కొడుకుని చూసుకొని తమదేశం వెళ్ళిపోయారు. బ్రెయిన్ డెడ్ అయిన ఒక పిల్లవాడు మరో నలుగురికి తన ఆయుష్షును పోసి తన “మరణంతోనే మృత్యుంజయుడయ్యాడు”. అసలు జీవితమంటే ఏమిటో తెలియకుండానే తాను మరికొందరికి జీవితాన్నిచ్చి వారి పాలిటి దేవుడయ్యాడు….

భారతీయులే అయినా ఆస్ట్రేలియాలో స్థిర పడ్డ ఆ కుటుంబం,సెలవులు గడపటానికని స్వదేశానికి వచ్చారు. ఏడేళ్ళ డియాన్ ఉదాని కి మాతృదేశపు గాలుల్లో తిప్పారు. అయితే వారికేం తెలుసు. ఆ పసివాడికి ఈ దేశం ఎంతో నచ్చిందనీ ఇక ఈ దేశాన్ని వదిలి వెళ్ళడనీ…. సెలవులు పూర్తయ్యాయి. 2016 జనవరి 22న ఇక తాముండే దేశానికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. కుటుంబమంతా ఇక్కడ ఉన్న బందుమిత్రులతో ఎయిర్ పోర్ట్ కు వచ్చింది.సెక్యూరిటీ చెక్ కి వెళ్ళేముందు చిన్నారి ఉదాని విపరీతమైన తలనొప్పితో విలవిలలాడిపోయాడు. కొన్ని సెకెండ్లలోనే స్పృహతప్పాడు. వెంటనే అతన్ని ముంబై నానావతి హాస్పిటల్ కి తరలించారు. మెదడులో రక్తం గడ్డకట్టింది. ఒకటీ రెండు చోట్ల కాదు చాలా చోట్ల. ఇదే విషయాన్ని దృవీకరించిన వైద్యులు అతన్ని ముంబైలోనే మరో హాస్పిటల్ అయిన హిందూజా హాస్పిటల్ కి తరలించమటూ చెప్పారు. అక్కడ అతని తలకి ఆపరేషన్ జరిగింది… ఏడేళ్ళ డియాన్ ఉదాని ఏడు రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు కానీ గెలవలేక పోయాడు అలసిపోయి తన చివరిశ్వాసని వదిలేందుకు సిద్దమయ్యాడు. అతని సమస్యని వీనస్ త్రాంబోసిస్ గా నిర్థారించిన వైద్యులు. అతను బ్రైన్ డేడ్ అయాడని చెప్పేసారు.

అప్పుడే ఆ తల్లితండ్రులకి అవయవదానం గురించి చెప్పారు డాక్టర్లు. పసివాడు మరణించాడన్నది విషాదమే కానీ..! అతడు మరికొందరిలో బతుకుతాడు. ఏ ఒక్క ప్రాణం పోతోందని మనం ధుఖిస్తున్నామో అదే పసివాడు మరికొందరిని మృత్యు ముఖం నుంచి తప్పించగలడు. ఈ మాటలు ఆ తల్లితండ్రులకు నచ్చాయి…. చిన్నితండ్రీ నువ్వు బతుకుతావు..ఇంకొందర్ని బతికిస్తావు..మాలాంటి మరికొందరు తల్లుల కన్నీళ్ళని తుడుస్తావు అనుకున్న ఆ తల్లితండ్రులు అంగీకరించారు. తమ కుమారుడి అవయవాలను ఉచితంగా మరికొందరికి ఇవ్వటానికి ముందుకొచ్చారు. వెంటనే అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. నలుగురు డాక్టర్ల బృందం డియాన్ ఉదాని శరీరం నుంచి గుండె,కాలేయం,కిడ్నీలూ వేరుచేసింది.

అతని గుండెని అదే రోజు ఏడుకిలోమీటర్ల దూరం ట్రాఫిక్ అంతా నిలిపివేసి 30నిమిషాల లోపే ఉదాని వయసే ఉన్న మాధవీ విశ్వకర్మ అనే బాలికకు అమర్చారు. ఆమె హార్ట్ ఎన్లాజ్మెంట్ తో హాస్పిటల్ కివచ్చింది మరణానికి కేవలం కొన్ని గంటల ముందు ఉదాని గుండే ఆమెని బతికించింది.”ఏడేళ్ళ పాపకి గుండె దొరుకుతుందని అనుకోలేదు… ఎందుకంటే పెద్దవారికి దొరికినంత సులువుగా చిన్నపిల్లలకి దొరకటం కస్టం, కానీ అదే ఏడేళ్ళ వయసున్న ఒక బాలుడి గుండె ఆమె కోసం వచ్చింది. మాధవిని కాపాడి ఆ బాలుడు మరోసారి బతికాడు. అతనికీ అతని తల్లితండ్రులకీ నా మనస్పూర్తిగా నమస్కరిస్తున్నా” ఫర్టిస్ హాస్పిటల్ లో మాధవికి హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్ విజయ్ కుమార్ అన్న మాటలివి. “ఇక ఆమె మాకు దక్కదనే అనుకున్నాం కళ్ళముందే బిడ్డ ప్రాణాలు పోతుంటే అదెంతనరకమో మాకు తెలుసు అంతటి బాదలోనూ తమబిడ్డ గుండెని ఇచ్చేసిన ఆ తల్లికి పాదాభివందనం చేయటం తప్ప ఏంచేయగలం” అంటూ కన్నీళ్ళతో చెప్పారు. మాధవి తల్లితండ్రులు.అక్కడితో అయిపోలేదు ఉదానీ కాలేయం జూపిటర్ హాస్పిటల్ లో మరో 31 ఏళ్ళ వయసున్న వ్యక్తికి అమర్చారు. అతని కిడ్నీలను 11,15ఏళ్ళ ఇద్దరు అబ్బాయిలకు అమర్చారు. ఒకేరోజు నలుగురికి ప్రాణాలు పోసి తను దేవుడయ్యాడు. ఒక శరీరంగా మరణించిన ఉదాని మరో నాలుగు ప్రాణాలుగా మళ్ళీ జన్మించాడు. రెండు రోజుల తర్వాత ఆ బాలుడి తల్లి అవయవదానం కోసం తమని ఒప్పించిన డాక్టర్ సుచేతా దేశాయ్ ని కలిసింది.”ఒక సారి నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే టైం లో వాడు నన్నడిగాడు అవయవదానం ఎలా చేస్తారు? అని.(ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు మనం అవయవ దానం చేసినట్టైతే ఆ విషయం ఫారంలో నింపాల్సి ఉంటుంది).మరణం గురించి మాట్లాడటం ఇష్టం లేక నేనప్పుడు ఆ విషయం చెప్పకుండా దాటేసాను, కానీ ఇప్పుడు ఆ ప్రశ్ననకు వాడే నాకు సమాధానం చెప్పాడు.” అంటూ కన్నీళ్ళతో చెప్పింది.

మరణం తర్వాత వేరే లోకాల్లో మనకోసం మరో జీవితం ఉంటుందని నమ్మే మనం. ఈ లోకంలో శరీరాన్ని వృధాగా ఎందుకని వదిలేయటం? ఒక మనిషి కోసం మరో మనిషి మాత్రమే సహాయ పడగలడు. ఒక మనిషిని మరో మనిషి మాత్రమే సహాయం అడగగలడూ. అందుకే దేవుడు మనిషిగా అవతరిస్తూ ఇదే విషయాన్ని చెప్పడు….. తన త్యాగం మరో నలుగురిని బతికించింది… మనం వెళ్లిపోతం మన కీర్తి మిగిలిపోతుంది అంతేకాదు మీ గుండె ఇంకో మనిషిని బతికిస్తూ మిమ్మల్ని కొన్ని కుటుంబాలకు దేవున్ని చేస్తుంది…. ఇదే విషయాన్ని నిరూపించిన డియాన్ ఉదానికి,అతని తల్లితండ్రులకీ అలజడి.కాం తలవంచి నమస్కరిస్తోంది….

(Visited 657 times, 1 visits today)