Home / Entertainment / ర`సాలూరే’ పొదరింటి నుంచి పొంచి చూసిన సంగీత సామ్రాట్!

ర`సాలూరే’ పొదరింటి నుంచి పొంచి చూసిన సంగీత సామ్రాట్!

Author:

తెలుగు సినీ సంగీతాభిమానుల పూజాఫలం ఆయన. తెలుగు సంగీతానికి భీష్మ పితామహుడాయన! స్వరాలతో మాయాబజార్ సృష్టించాడు కాబట్టే ఆయన స్వరాజేశ్వర రావయ్యాడు. అత్యంత నిరాడంబర జీవనం గడిపిన అతి గొప్ప సంగీత దర్శకుడి పుట్టిన రోజు నేడు. సాలూరు రాజేశ్వర రావు విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరామపురం గ్రామంలో 1922 అక్టోబర్ 10 న జన్మించారు. రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది. ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు వద్దే  

సరిగమలుదిద్దాడు. సన్యాసిరాజు ప్రముఖ వాయులీన విద్వాంసులైన ద్వారం వెంకటస్వామి నాయుడుకి కచేరీలలో మృదంగంపై సహకరించిన వ్యక్తి. అలాగే అప్పట్లో మూకీ సినిమాలకు తెరముందు, హార్మోనియం వాద్యకారునిగా, సంగీతాన్ని వినిపించేవాడు. అంతేకాదు రాజేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా! “ఆ తోటలోనొకటి ఆరాధనాలయము”, “తుమ్మెదా! ఒకసారి మోమెత్తి చూడమని”, “పొదరింటిలోనుండి పొంచి చూచెదవేల”, “కలగంటి కలగంటి” లాంటి కొన్ని మంచి మంచి పాటల్ని ఇతని ద్వారానే మనకు లభించాయి.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు, నాలుగేళ్ళ వయసులోనే రాజేశ్వరరావు అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరో మూడేళ్ళు గడిచేసరికి అన్న హనుమంతరావుతో కలిసి పాట కచేరీలు ఇవ్వడం, హరికథలు చెప్పడం మొదలు పెట్టాడు. రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి హచ్చిన్స్‌ గ్రామఫోను కంపెనీ బెంగుళూరుకు ఆహ్వానించింది. 1933-34 మధ్యకాలంలో బాల భాగవతార్‌ మాస్టర్‌ సాలూరి రాజేశ్వరావు ఆఫ్‌ విజయనగరంకంఠం గ్రామఫోను రికార్డుల ద్వారా (భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు, మోతీలాల్‌ నెహ్రూ పై పాటలు మొదలగునవి) మొదటిగా విజయనగరం ఎల్లలు దాటి యావదాంధ్రదేశానికీ పరిచయమయింది.

1937 ప్రాంతాల్లో సినీ దర్శకుడుగా పని ప్రారంభించి 250 చిత్రాలకు స్వర రచన చేసిన రాజేశ్వరరావు ఛైల్డ్‌ ప్రాడిజీగా పేరు పొందారు. శ్రీకృష్ణ లీలలుఅనే సినిమాలో పదమూడేళ్ళ వయస్సులో కృష్ణుడుగా నటించి పాటలు పాడిన రాజేశ్వర రావును ఆనాటి ప్రసిద్ధ గాయకనటుడు జొన్నవిత్తుల శేషగిరి రావు ఎంతో మెచ్చుకోగా విన్నానని ప్రఖ్యాత సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు ఒక వ్యాసంలో రాశారు. చిన్నతనంలోనే రాజేశ్వర రావు ,తన అన్న సాలూరు హనుమంత రావుతో కలిసి రకరకాల వాయిద్యాలను వాయిస్తూ ప్రోగ్రాములు ఇచ్చే వారట. ఒక సంగీత దర్శకుడు చలపతి రావుకు ఆయన గురుతుల్యుడు. మరొక ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు రాజేశ్వరరావును కళారాధకుడు, కళా స్రష్టగా అభివర్ణించారు. ఇలా సమకాలికుల మన్ననలను పొందిన రాజేశ్వరరావు తెలుగువారందరికీ అభిమాన పాత్రుడవటంలో అశ్చర్యం లేదు. తన చిన్నతనంలో విజయనగరంలో రాజేశ్వరరావు, ద్వారం వెంకటస్వామి నాయుడు కి శిష్యుడుగా చేరారనీ, ఆయన అనుమతి పొందకుండా ఏడేళ్ళ వయస్సులో కచేరీ చేసినందువల్ల నాయుడుగారికి కోపంవచ్చి సంగీతం నేర్పడం మానేసారనీ ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అది ఒకవిధంగా తెలుగు ప్రజలకు మేలు చేసిందేమో ! తరవాత రాజేశ్వరరావు కీచక వధ సినిమాకని కలకత్తా వెళ్ళి, కె . ఎల్‌ . సైగల్‌ వద్ద కొన్నాళ్ళు, ఆగ్రా ఘరానా కు చెందిన ఉస్తాద్‌ పంకజ్‌ ఖాన్‌ వద్ద కొన్నాళ్ళూ శిష్యరికం చేసారట. మొదట్లో రామబ్రహ్మం వంటి దర్శకులు తరవాత జెమినీ వంటి సంస్థలూ రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో చిత్రాలు నిర్మించడం, ” మల్లీశ్వరి వంటి సినిమాల పాటలు విశేష ప్రజాదరణ పొందటం అందరికీ తెలిసిందే !

కేవలం సంగీతం కాకుండా, ప్రతి స్వరాన్నీ, స్వరాల సముదాయాన్నీ దృశ్య పరంగా ఊహించగలిగే దృక్పధం ఆయనది. సినీ సంగీత దర్శకులకు ఇటువంటి వైఖరి ఉండటం సహజమేనేమో కానీ, సంగీతంలో ..అదీ ప్రత్యేకించి మెలొడీలో ఆయనలాగా విజయం సాధించిన వారు చాలా తక్కువ. ఆయన 1946లో సంగీతం సమకూర్చిన చంద్రలేఖ సినిమా టీ వీ లో ప్రసారమైంది. ఆ మర్నాడు రిహార్సల్స్‌ కి వచ్చిన శ్రీమతి సుశీల తదితరులూ ఆ రోజుల్లోనే ఆర్‌ . డి . బర్మన్‌ ను తలదన్నేలా రిదిమ్స్‌ ఎలా కంపోజ్‌ చేశా రంటూ మెచ్చుకొన్నారు.అందులో సర్కస్‌ దృశ్యాలకు పాశ్చ్యాత్య సంగీతం వాయించేవారు ఎవరూ లేకపోవడంతో, మద్రాస్‌ గవర్నర్‌ బాండ్‌ ను పిలిపించ వలసివచ్చిందని రాజేశ్వరరావు చెపుతుండేవారు.

తరవాత కాలంలో రకరకాల వాళ్ళు సంగీత దర్శకులైపోవడం, అసిస్టెంట్లు రాకపోతే పాట మధ్యలో ఆర్కెష్ట్రా బిట్స్‌ కంపోజ్‌ చెయ్యలేక వారి కోసం వేచి ఉండడం అనేవి తెలుగు ఇండస్ట్రీ కి తెలియని విషయాలు కావు. “ మాష్టారు మమ్మల్ని ఏదీ ముట్టుకోనివ్వరు. మొత్తం అంతా ఆయన కంపోజ్‌ చెయ్యవలసిందే !అని ఆయన అసిస్టెంట్లు తరచూ అంటుండేవారు . ఈ రోజుల్లో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మ్యూజిక్‌ డైరక్టర్లు కూడ సిడి రామ్‌ ల నుంచి శబ్దాలను డౌన్‌ లోడ్‌ చెయ్యకుండా ట్యూన్‌ కట్టలేరు. రాజేశ్వరరావు వంటి వారి విషయంలో అది ఊహించడం కూడా అసాధ్యం.

హిందీలో ఎస్‌ . డి . బర్మన్‌, తెలుగులో రాజేశ్వరరావు వీరిద్దరి ట్యూన్లు ఎవరు పాడినా శ్రోతలకు ఆ సంగీత దర్శకుడి గొంతు వినిపిస్తుంది. మరొక విషయం రాజేశ్వరరావు స్వర పరిచిన పాటలు ఎవరు పాడినా బాగుంటాయి. ఒక్క ఘంటసాలే కాదు. ఏ . ఎం . రాజా ( మిస్సమ్మ, విప్రనారాయణ), పి . బి. శ్రీనివాస్‌ (భీష్మ), కె . వి . కె. మోహన్‌ రాజు ( పూలరంగడు), ఎస్‌ . పి . బాలసుబ్రహ్మణ్యం వీరిలో ఎవరు పాడినా ఆయన పాటలు అద్భుతంగా ఉంటాయి.

ఆయన ఎటువంటి పాటనైనా రక్తి కట్టించే వారు. భక్తి గీతాలు ఎలా ఉండాలో చెంచులక్ష్మి ( కనలేరా కమలా కాంతుని,పాలకడలిపై), భక్త ప్రహ్లాద ( నారాయణమంత్రం ) వంటి చిత్రాల్లో ఆయన పాటలు వింటే తెలుస్తుంది. జానపద గీతాలు, కామెడీ పాటలు, పాశ్చాత్య ధోరణి ఉన్న పాటలు అన్నీ ప్రజాదరణ పొందినవే ! ఎవరో చెప్పినట్లుగా, ” మనసున మల్లెల …” అనేది పల్లవి లేని పాటయితే, ” బృందావనమది…” చరణంలేని పాట. పిలచిన బిగువటరా, రారా నాసామి రారా, బాలనురా మదనా, మొదలైన జావళీలు ఆయనలా ఇంకెవ్వరూ చెయ్యలేరు. వాటిలో నాట్యానికి అనుగుణంగా వాయించిన మృదంగపు దరువులకు, అద్భుతమైన ఆర్కెష్ట్రేషన్‌ ఉంది. హిందుస్తానీ రాగాలైన జైజవంతి ( మనసున మనసై), పట్‌ దీప్‌ (కన్నుల దాగిన అనురాగం, నీ అడుగులోన అడుగువేసి), పహాడీ ( నీవు లేక వీణా, నిన్నలేని అందమేదో), యమన్‌ కల్యాణ్‌ (చిగురులు వేసిన ) ఆయన చేతిలో అందాలు సంతరించు కొన్నాయి. కల్యాణి ( జగమే మారినది, మనసులోని కోరిక), మోహన (తెలుసు కొనవె యువతి, పాడవేల రాధికా) వంటి రాగాలు ఆయనకు కొట్టిన పిండి. ఇతర రాగాల్లో పాట చేసినా, ఏ రెండో చరణంలోనో కేదార్‌ రాగ చాయ చూపించడం ఆయనకు సరదా ! నీవు రావు నిదుర రాదు ( మోహన), పాడమని నన్నడగ తగునా (ఖమాస్‌ ), మదిలో వీణలు మ్రోగె (మోహన) వంటి పాటల్లో ఇది కనిపిస్తుంది.

సంగీత పరంగా రాజేశ్వరరావు కొన్ని అద్భుత ప్రయోగాలు చేశారు. పగలైతే దొరవేరా రాతిరి నా రాజువిరా …” అనే పాటలో యమన్‌ కల్యాణ్‌ , పీలూ, భీంపలాస్‌ రాగాలు మూడూ ఉన్నాయి. అయినా ఏమాత్రం వింతగా అనిపించదు. మాటల్లోని భావానికి ట్యూన్‌ అంత చక్కగా సరిపోయింది. అలాగే చిలిపి నవ్వుల నిను చూడగానే …” అనేపాటలో హిందోళం, పీలూ,తిలంగ్‌ అనే మూడు రాగాలు ఉన్నాయి. భక్త ప్రహ్లాదలో బాలమురళి మొదటి పాటలోనూ, “భక్త జయదేవలో దశావతారాల ప్రళయ పయోధి జలేఅనే అష్టపది లోనూ అద్భుతమైన రాగమాలికలున్నాయి. వీటన్నిటిలోనూ ఎంతో శక్తివంతమైన ఆర్కెస్ట్రేషన్‌ కూడా వినిపిస్తుంది.ఆయన చేసిన చాలా పాటల బాణీల్లో రాగం ముందుకు దూసుకుపోయే అగ్రెషన్‌ కనిపిస్తుంది.

రాజేశ్వరరావు మాట్లాడే ధోరణి తమాషాగా, అతివినయం అనిపించేటట్టు ఉండేదని ఆయనతో పరిచయం ఉన్నవారందరికీ తెలుసు. అలా మాట్లాడుతూనే ఆయన ఎవర్ని ఎలా తిప్పలు పెట్టేవారో కధలుగా చెప్పుకుంటారు. డబ్బు ఆదా చేద్దామని ఒక నిర్మాత ఆయనను తన ఇంటికి టాక్సీలో కాక, ఆటో రిక్షాలో రమ్మన్నాట్ట. ఆటో దొరకలేదని ఊరంతా టాక్సీలో తిరిగి ఆటో పట్టుకొని ఆయనింటికి వెళ్ళాడట రాజేశ్వరరావు. ఆయనకు కోపం రావడం వల్లనో, ఇతర కారణాల వల్లనో మధ్యలో పని మానుకొన్న సందర్భాలున్నాయి. మాయాబజార్‌ సినిమాలోని డ్యూయెట్లు నాలుగూ ఆయనే చేశారట. తరవాత వాటినీ తక్కిన పాటలనూ ఆర్కెస్ట్రాతో రికార్డ్‌ చేసింది ఘంటసాల. విప్రనారాయణకు పాటలన్నీ చేసాక రీరికార్డింగు పని రాజేశ్వరరావు చెయ్యలేదుట. మంచి సాహిత్యం, మంచి సంగీతం ఈనాటి సినిమాల్లో అరుదైపోయాయి. ఎంటర్‌ టైన్మెంట్‌ కు నిర్వచనాలు మారిపోయాయి. కాని, తన సమకాలికులకు కూడా ఆదర్శంగా నిలిచిన రాజేశ్వరరావు సంగీతం మాత్రం ఎప్పటికీ నిలబడుతుంది.

(Visited 172 times, 1 visits today)