Home / Inspiring Stories / నటించడం లో జీవించీ, జీవించడం లో ఓడిపోతున్నారా…!

నటించడం లో జీవించీ, జీవించడం లో ఓడిపోతున్నారా…!

Author:

Telugu actors suicided

ఒక్కొక్కరూ రాలిపోతున్నారు అవకాశాల్లేక కొందరు నిరాశతో జీవితం లో ఏర్పడ్డ శూన్యం తో డిప్రెషన్ లో కొందరు ఇలా ఏవేవో కారణాలతో తెలుగు సినీ పరిశ్రమ లోని నటులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోరుకున్నది సాధించలేక పోయామన్న నిరాశతో పాటు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్ట గానే గొప్ప పేరూ డబ్బూ వస్తాయని ఆశపడి అవి సంపాదించలేకా, వేరే మార్గాల్లోకీ వెళ్లలేకా సతమతమౌతూ అర్థాంతరంగానే కన్నుమూస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు రంగనాథ్ ఆత్మ హత్య మరో సారి సినీ నటుల ఆత్మ హత్యల వైపు అందరి చూపూ తిప్పింది. ఐతే రంగనాథ్ గారి విశయంలో ఆయన వ్యక్తి గత జీవితం లోని సమస్యపైకి కనబడుతున్నా. నిజానికి అవకాశాలు రాకపోవటం వల్ల, పనేమీ లేకపోవటం తో ఒంటరితన భావన ఎక్కువ కావటం వల్లనే అన్నది చాలామందికే అర్థమైన విశయం. ఆయన ౩౦౦కి పైగా చిత్రాలు, సీరియల్స్ లలో నటించి మంచి పేరు సంపాదించారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ షాక్ కి గురయింది. ఒక మంచి మనిషి… అజాత శతృవు… అలాంటి మనిషి ఇలా అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అంత పెద్ద నటుడికి సినీ పరిశ్రమ ఇచ్చిన గుర్తింపేమిటి చివరి రోజుల్లో ఆయన ఆ చిన్న ఫ్లాట్లో ఉంటూ ఆర్థికంగా చాలా కుంగిపోయారన్నది సన్నిహితులకు మాత్రమే తెలిసిన విశయం. యువహీరో ఉదయ్ కిరణ్ మరణించినప్పుడు. ఒక్కరోజు ముందైనా నాతో మాట్లాడి ఉంటే ఉదయ్ లో ధైర్యాన్ని పెంచి అతన్ని ఆత్మహత్య చేసుకోకుండా ఆపేవాన్ని అన్న రంగనాథ్ ఈ రోజు ఇలా ఆత్మ హత్యకు పాల్పడటం నిజంగా ధారుణమైన సంఘటనే. దీనికి కారణం ఎవరూ అని ప్రశ్నిస్తే… వేరే భాషల నటులను తెచ్చుకునే సినీ పరిశ్రమ రంగనాథ్ ని ఒక సినిమాలోకి తీసుకొని ఎన్నాళ్ళైందీ అనేది ఆలోచిస్తే చాలు మనకు సమాధానం దొరికి తీరుతుంది.

ఇక ఉదయ్ కిరణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకునే చివరి నిమిషం లో దురదృష్టం కాటేసిన నటుడు. ఆత్మహత్యకు గల కారణాల విషయానికొస్తే… అవకాశాలు లేక పోవడం వల్లనే ఉదయ్ కిరణ్ మానసికంగా కృంగి పోయారని తెలుస్తోంది.అసలు ఉదయ్ కి అవకాశాలు ఎందుకు రాలేదూ అన్న సంగతి ఇండస్ట్రీ మొత్తం తెలుసు. కొంత కాలం చెన్నై వెళ్లి అక్కడ తమిళ సినిమాల్లో అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేసాడని, అయినా ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదని, కొందరైతే నువ్వెవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తించారని, దీంతో ఉదయ్ కిరణ్ తీవ్రంగా బాధపడేవాడని తెలుస్తోంది. అవకాశాలు లేక మానసికంగా కృంగి పోతున్న తనకు అయిన వారి ఓదార్పు లేక పోవడం, స్నేహితులు సన్నిహితులు కూడా ఆయనకు దూరంగా ఉండటం………ఇలాంటి పరిణామాలెన్నో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు దారి తీసాయి. రంగనాథ్ గారి మరణ విషాదం నుంచి పూర్తిగా బయటపడకముందే మరో వర్థమాన కొరియో గ్రాఫర్ భరత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలే కారణం అంటూన్నా ఇండస్ట్రీ కెరీర్ లో వచ్చే ఒత్తిడీ,డిప్రెషన్ ల ప్రభావమూ ఉన్లేకపోలేదు…

ఒకప్పుడు ఇలా ఆత్మహత్యలకు పాల్పడే వారిలో స్త్రీలూ అందులోనూ హీరోయిన్ అవుదామని వచ్చి కాలేకపోయిన వారూ ఉండేవారు. సిల్క్ స్మిత, అంతకు ముందు ఫటాఫట్ జయలక్ష్మీ,మొన్నటికి మొన్న జియాఖాన్ వంటి కొందరు మంచి టాలెంట్ ఉన్నా ఐటం ముద్ర వేసి వారికిచ్చే పారితోషికాలను కూడా భారీగా తగ్గించటంతో తమ సినీ గ్లామర్ కు తగ్గ “మేయింటెనెన్స్” కోసం విపరీతమైన అప్పులు చేసి చివరికి అవకాశాలూ, డబ్బూ రెండూ లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. జియాఖాన్ విశయంలోనూ విపరీతమైన డిప్రెషన్, తన వ్యక్తిగత జీవితం లోని మరికొన్ని సమస్యలే ఆత్మ హత్యకి దారి తీసాయన్నది అందరికీ తెలిసిందే. సమస్యకి పరిష్కారం కోసం సినీ పరిశ్రమా, అత్యదిక మొత్తంలో స్టార్ హీరోలకి రెమ్యునరేషన్లిచ్చి మిగిలిన వారిని “ఖర్చుపరంగా” భరించలేం అంటూ తక్కువ రెమ్యునరేషన్ కోసం పరభాషా నటులను తెచ్చుకొంటూ, అత్యధిక ఖర్చులతో సినీ నటులంటే డబ్బు బాగా ఉండే వారనే అభిప్రాయాన్ని పెంచి సామాన్య నటులకూ విపరీతమైన “మైంటెనెన్స్” పెంచిన సినీ ప్రముఖులూ ఏదైనా ఆలోచిస్తే బాగుండు…

(Visited 9,365 times, 1 visits today)