Home / Political / ఫేస్ బుక్ మీద కొరడా ఝళిపించిన ట్రాయ్

ఫేస్ బుక్ మీద కొరడా ఝళిపించిన ట్రాయ్

Author:

Net Nuetrality Free Basics

ఎట్టకేలకు కొన్నాళ్ళుగా ఫేస్ బుక్ కీ భారత్ టెలికాం నియంత్రణా సంస్థ (ట్రాయ్‌) కీ మధ్య జరుగుతున్న వివాదానికి తెర పడింది. ప్రజల భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న ట్రాయ్ నెట్‌ న్యూట్రాలిటీకే మొగ్గు చూపింది. డిజిటల్‌ సమానత్వం పేరుతో ఫేస్‌బుక్‌ అందిస్తున్న ఫ్రీ బేసిక్స్‌, ఎయిర్‌టెల్‌ జీరో ప్లాన్‌ లాంటివి ఇక చెల్లవని పరోక్షంగా స్పష్టం చేసింది. ఇంటర్‌నెట్‌లో సమాచార శోధనకు వినియోగదారుల నుంచి విభిన్న ధరలు వసూలు చేసే విధానం (డిఫరెన్షియల్‌ ప్రైసింగ్‌) ఏ కంపెనీ చేపట్టకూడదని కాస్త గట్టిగానే చెప్పింది.. ఫ్రీ బేసిక్స్‌ పేరుతో ఫేస్‌బుక్‌, జీరో ప్లాన్‌ పేరుతో ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలు ‘ఉచిత’ పథకాలతో వినియోగదారులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను ఆహ్వానిస్తూ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసిన ట్రాయ్‌.. సోమవారం ఒక ప్రకటనలో తన ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ప్రొహిబిషన్‌ ఆఫ్‌ డిస్ర్కిమినేటరీ టారిఫ్స్‌ ఫర్‌ డేటా సర్వీసెస్‌ రెగ్యులేషన్స్‌ 2016 చట్టంలోని ఈ నిబంధనను ఉల్లంఘించేవారికి ట్రాయ్‌ రోజుకు రూ.50 వేల నుంచి గరిష్ఠంగా 50 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. డేటా సేవలకు విభిన్న ధరలు నిర్ణయిస్తూ (కొందరికి ఉచితంగా, మరికొందరికి డబ్బులకు, కొన్ని సైట్లు ఫ్రీగా..) ఏ సర్వీస్‌ ప్రొవైడరూ ఎలాంటి ఒప్పందం చేసుకోకూడదని, కంటెంట్‌ ఆధారంగా విభిన్న టారి్‌ఫలు నిర్ణయించి వసూలు చేయరాదని ట్రాయ్‌ తన ప్రకటనలో తేల్చిచెప్పింది.

Net Nuetrality

ఫ్రీ బేసిక్స్ అంటే ఏమిటో మనలో చాలా మందికి తెలియదు. ఫేస్ బుక్ నీ మరికొన్ని వెబ్ సైట్లనూ ఫ్రీ గా అందిస్తూంటే ట్రాయ్ కి వచ్చే నష్టం ఏమిటీ అనుకుంటున్నారా…? ఫ్రీ బేసిక్స్‌ లాంటి విధానాల వల్ల నిర్ణీత టెలికం ఆపరేటర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల సైట్లన్నీ మనం ఉచితంగా యాక్సెస్‌ చేయొచ్చు. దీనివల్ల మనకు లాభమే కదా అనిపించవచ్చు. కానీ.. ఆ ప్లాన్‌లో లేని సైట్లను చూడాలంటే మనం డేటా ప్యాకేజీ కొనుక్కోవాల్సిందే. అయితే ఈ విధానంలో లోపమేంటంటే.. బాగా ఆదాయం ఉండే గూగుల్‌, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలు భారీగా డబ్బు పోసి టెలికం ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోగలవు. అలా కుదుర్చుకోలేని చిన్నచిన్న సంస్థలు పోటీలో వెనకబడిపోతాయి. ఫ్రీ సర్వీసులతో సరిపెట్టుకునేవారు డేటా ప్యాకేజీ కొనుగోలు చేయకపోవడం వల్ల వాటికి నష్టం వాటిల్లుతుంది. అదే.. ఇప్పుడున్న పద్ధతిలో అయితే రూ.50, రూ.100 పెట్టి డేటా ప్యాక్‌ కొనుగోలు చేస్తే అన్ని వెబ్‌సైట్లనూ చూసే వీలుంది.

ఫ్రీ సర్వీసుల ద్వారా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటివాటికి అలవాటుపడేవారు ఇక అదే మత్తులో ఉండిపోతారు. ఇప్పటికైతే సిటీల్లో ఉన్నంతగా పల్లెల్లో ఇంటర్‌నెట్‌ వాడకం లేదు కానీ, ఉచిత నెట్‌తో పల్లెలకూ ఈ జాడ్యాన్ని విస్తరింపజేస్తే దేశవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని విశ్లేషకుల ఆందోళన. అలాగే, ఫ్రీబేసిక్స్‌లో భాగంగా ఉచితంగా వచ్చేవి కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే. ఎవరైనా చేరవచ్చని ఫేస్‌బుక్‌ చెబుతోంది కానీ.. తనకు పోటీ కాని వెబ్‌సైట్లను మాత్రమే చేర్చుకోవచ్చు. భవిష్యత్తులో అది ఏకఛత్రాధిపత్యానికి దారితీస్తుంది. ఫ్రీ బేసిక్స్‌ వంటి వాటి వల్ల ప్రజలు ఉచిత ఇంటర్‌నెట్‌కు అలవాటు పడితే చిన్నచిన్న స్టార్ట్‌ప్ ల సైట్లు చూడ్డానికి డేటా ప్యాకేజీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఫ్రీ బేసిక్స్‌ వంటివి అమల్లోకి వస్తే.. కొన్ని పెద్దపెద్ద కంపెనీలు టెలికం కంపెనీలకు ప్రీమియం అమౌంట్‌ పే చేసి మనకు ఉచితంగా వెబ్‌సైట్లు అందిస్తాయి. దీని వల్ల ఉచితంగా వచ్చే సైట్లు తప్ప మిగతా వెబ్‌సైట్లు రావు. ఒకవేళ డేటాప్యాక్‌ కొన్నా.. మిగతా సైట్లు నెమ్మదిగా తెరుచుకుంటాయి. ఎందుకంటే పెద్ద కంపెనీలు ముందే డబ్బులు ఇవ్వడం వల్ల టెలికం కంపెనీలు కూడా ఆయా సైట్లకు బ్యాండ్‌విడ్త్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది క్రమంగా.. మనం ఏం చూడాలనే విషయాన్ని టెలికం కంపెనీలే నిర్ణయించే స్థితికి చేరుతుంది. అందుకే టెలికం కంపెనీలన్నీ ట్రాయ్‌తో జరిపిన సంప్రదింపుల్లో ఫ్రీబేసిక్స్‌ని, విభిన్న ధరల విధానాన్ని (డిఫరెన్షియల్‌ ప్రైసింగ్‌) సమర్థిస్తున్నాయి. అలా కాకుండా డేటా ప్యాక్‌ కొనడం ద్వారా అన్ని సైట్లనూ ఎలాంటి తేడాలూ లేకుండా ఒకేలా చూడగలగడమే నెట్‌ న్యూట్రాలిటీ. ఫ్రీ బేసిక్స్ వల్ల నిజానికి సామాన్య వినియోగదారుడికి ఏ ఉపయోగమూ లేక పోగా ధీఘకాలం లో నష్టాలనే తెస్తుంది.

రిలయన్స్‌తో ఫేస్‌బుక్‌ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం, రిలయన్స్‌ వినియోగదారులకు.. ‘ఫ్రీబేసిక్స్‌’లో భాగమైన వెబ్‌సైట్లన్నీ ఉచితంగా లభించేలా. అంటే.. ఎలాంటి డేటా ప్యాక్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే ఫేస్‌బుక్‌, మరికొన్ని వెబ్‌సైట్లను యాక్సెస్‌ చేసే వీలుంటుంది. స్థూలంగా ఫ్రీబేసిక్స్‌ అనే విధానం కాన్సెప్టు ఇది. అయితే దీని ద్వారా తమకు వచ్చే ఆర్థిక ప్రయోజనమేమీ లేదని.. కేవలం భారతీయులందరికీ ఇంటర్‌నెట్‌ను అందుబాటులోకి తేవాలన్నదే తమ ఉదాత్త ఆశయమని ఫేస్‌బుక్‌ చెబుతోంది. ఈ తరహాలో తాము ఇప్పటికే 37 దేశాల్లో సేవలందిస్తున్నామని పేర్కొంటోంది.కానీ దీనివల్ల వచ్చే ఇతర నష్టాలను మత్రం ఇప్పటివరకూ చెప్పలేదు.

నెట్ న్యూట్రాలిటీ కల్పించి కోట్లాది వినియోగదారులకు ఫ్రీ ఇంటర్నెట్ కల్పించాలని భావించిన ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ భారత్ తీసుకున్న నిర్ణయంతో నిరాశ చెందినట్లు తెలిపాడు. అయినప్పటికీ భారత్ సహా ప్రపంచ దేశాలలో నెట్ న్యూట్రాలిటీ అందించేందుకు కృషిచేస్తానని చెప్పాడు.ఇంటర్నెట్.ఆర్గ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని కానీ, భారత్ ఫ్రీ ఇంటర్నెట్ ను కట్టడి చేసిందని అభిప్రాయపడ్డాడు. తమతో పాటు ఇతర సంస్థలు ఇంటర్నెట్.ఆర్గ్ ద్వారా భారత్, ప్రపంచ దేశాలలో ఉచిత ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధపడగా, ట్రాయ్ తమను అడ్డుకున్నదన్నాడు. 38 దేశాల్లోని కోట్లమంది ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఫేస్ బుక్ వాడతారని.. భారత్ లో కూడా 10 కోట్ల మంది ఫ్రీ ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం ఉందని వివరించాడు.

(Visited 531 times, 1 visits today)