Home / Political / 53,625 ఓట్లతో “ఖేడ్” కారు కైవసం.

53,625 ఓట్లతో “ఖేడ్” కారు కైవసం.

Author:

TRS-Car-GHMC-elections

గ్రేటర్ ఎన్నికల విజయం తర్వాత టీఆరెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నారాయణ ఖేడ్ లో కూడా ఘన విజయం సాధించారు తెరాస ఆభ్యర్థి భూపాల్ రెడ్డి. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పటోళ్ల కిష్టారెడ్డి ఘన విజయం సాధించారు. కాగా ఆయన గతేడాది ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పటోళ్ల కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని నిలబెట్టింది. కాగా టీఆర్ఎస్ అభ్యర్థిగా మహారెడ్డి భూపాల్ రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపింది. పోటాపోటీగా ఈ ఎన్నికల ప్రచారం సాగింది. అయితే విజయం టీఆర్ఎస్ ఖాతాలో పడింది. అన్ని రౌండ్ లలోనూ ఆధిక్యత కనబరుస్తూ వచ్చీన తెరాస 21 రౌండ్ లో 53,625 ఓట్ల ఆధిక్యం తో తన గెలుపుని ఖరారు చేసుకుంది. టీఆర్‌ఎస్‌కు అఖండ విజయాన్ని కట్టబెట్టిన నారాయణఖేడ్ ప్రజలకు మంత్రి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు, అనుకున్నట్టుగానే విజయం సాధించి సీఎం కేసీఆర్‌కు జన్మదిన కానుకగా ఈ విజయాన్ని అందించామని చెప్పారు. ప్రభుత్వ పనితీరుకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. సానుభూతి పవనాలను పక్కన పెట్టి ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు అని తెలిపారు.

ఈ ఎన్నిక విజయంతో హరీష్‌రావు వ్యూహం ఫలించింది. ఉప ఎన్నిక నేపథ్యంలో హరీష్‌రావు చేసిన ప్రచారానికి తగిన ఫలితం లభించింది. రాత్రినక, పగలనక ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన హరీష్‌రావు కృషికి ఖేడ్ ప్రజలు నీరాజనం పలికారు. హరీష్‌రావు వ్యూహం, రికార్డ్ స్థాయి పోలింగ్‌తో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ఎప్పటి నుండో అందరూ భావిస్తూనే ఉన్నారు. అయితే ఈ విజయం వారి నమ్మకాన్ని మరోసారి ఋజువు చేసింది.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తూన్న టీడీపీ కి ఘోర అవమానం జరిగింది. డిపాజిట్లను కూడా దక్కించుకోలేక చేతులెత్తేసింది. ఏ అభ్యర్థి అయినా డిపాజిట్ దక్కించుకోవాలంటే పోలైన చెల్లుబాటు ఓట్లలో ఆరవ వంతు ఓట్లు సాధించాల్సి ఉంటుంది. నారాయణఖేడ్‌ బైపోల్‌లో మొత్తం లక్షా 54,866 ఓట్లు పోలయ్యాయి. డిపాజిట్ రావాలంటే 25 వేలకు పైగా ఓట్లు రావాల్సి ఉంది. కానీ టీడీపీ ఆ టార్గెట్‌ను రీచ్ కాలేకపోయింది. టీడీపీ కేవలం 14 వేల 787 ఓట్లు మాత్రమే సాధించింది. దీంతో డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రెస్ 39 వేల 451 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. టీఆర్‌ఎస్‌ 53వేల 625 ఓట్ల మేజారిటీతో విజయం సాధించింది. ఆ పార్టీకి మొత్తం 93 వేల 76 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబరిచింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చాలా రౌండ్లలో వెయ్యి ఓట్లను కూడా సాధించలేకపోయింది. కేవలం నాలుగు రౌండ్లలో మాత్రమే వెయ్యికి మించి ఓట్లను సాధించగలిగింది. ఈ దెబ్బతో తెలంగాణాలో టీడీపీ తుడిచి పెట్టుకు పోయినట్టే అంటున్నారు రాజకీయ నిపుణులు.

(Visited 63 times, 1 visits today)