Home / Inspiring Stories / రోహిత్ ఆత్మహత్య వెనుక కారణాలేమిటి??

రోహిత్ ఆత్మహత్య వెనుక కారణాలేమిటి??

Author:

rohit---facebook-and-storysize_647_011816123527

ఒక విధ్యార్థి ఆత్మహత్య ఒక రాష్ట్రాన్ని కాదు దేశం మొత్తం దుమారం రేపింది. కుల, మత దురహంకారం పేరుకుపోయిన దేశంలో కుల, మతాల ప్రభావం యూనివర్సిటీల మీద కూడా ఎంతగా ఉందో వేముల రోహిత్ ఆత్మహత్య ఉదంతం మనకు చెబుతోంది. సాంఘిక బ‌హిష్క‌ణ‌కు గురైన గుంటూరు ప‌ట్ట‌ణానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ళ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల చక్రవర్తి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హెచ్.సీ.యూలో సైన్స్ అండ్‌ టెక్నాలజీలో పీ.హెచ్.డీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రోహిత్ ఆత్మ హత్యకు గల కారణాల్లోకి వెళితే….

అసలు ఈ వివాదం మొదలైంది కాశ్మీర్ వేర్పాటువాద వీరుడు అఫ్జల్‌ గురు ఉరితీతతో. ఆ ఉరిని ఖండిస్తూ “అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్” (ఏఎస్‌ఏ) నేతలు నిరసన తెలిపారు. భారత ప్రభుత్వ నిర్ణయం మానవ హక్కులను కాలరేసేలా ఉందని విమర్శలు చేశారు. యాకుబ్ యెమన్ ని ఉరి తీసినప్పుడు కూడా నిరసన తెలిపారు,అయితే చట్టాల రీత్యా దేశ ద్రోహానికి పాల్పడిన ఉగ్రవాది కాబట్టి ఆ ఉరిని సమర్థిస్తున్నాననీ,దానిని వ్యతిరేకించే ఏ.ఎస్.ఏ చర్యలను విమర్షిస్తూ పరుష్జ పదజాలంతో వర్సిటీలోని “ఏబీవీపీ” అధ్యక్షుడు సుశీల్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేసాడు. ఈ స్థితిలో 2015 ఆగస్టు 3వ తేదీ రాత్రి అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ సంఘ సభ్యులకూ ఏబీవీపీ కార్యకర్తలకూ మధ్య ఘర్షణ జరిగింది. తనపై దాడి చేశారని, ఫేస్‌బుక్‌ కామెంట్స్‌పై తనతో క్షమాపణ పత్రం కూడా రాయించారని సుశీల్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన రెండురోజులపాటు చికిత్స పొందారు. సుశీల్‌కుమార్‌పై దాడి చేసిన విద్యార్థులను పోలీసులు ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్‌ చేసి వదిలిపెట్టారు.

అయితే.. తమకు న్యాయం చేయాలంటూ బాధితుడు సుశీల్‌కుమార్‌ తరఫున ఏబీవీపీ అప్పట్లో ఆందోళన చేసింది. అయినా ఫలితం లేకపోవటంతో ఏబీవీపీ కి మద్దతుగా బీజేపీ నేత అయిన బండారు దత్తాత్రేయ జోక్యంతో నిజానిజాలు నిర్ధారించేందుకు వర్సిటీ యాజమాన్యం ఎగ్జికూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన సబ్‌ కమిటీ ఐదుగురు విద్యార్థులపై సాంఘిక బహిష్కరణ విధించాల్సిందిగా సూచించింది. వివాదంపై విచారణ జరపడానికి వేసిన కమిటీలో ఒక్కరంటే ఒక్క దళిత అధ్యాపకులు లేరు. అగ్ర కులాలకు, ఒకే మతానికీ అనుకూలంగా ఉన్నవారు విచారణ కమిటీలో ఉండడం వల్లనే విద్యార్థుల సస్పెన్షన్‌కు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలనూ ఏవరూ పట్టించుకోలేదు.

ఆ నివేదిక మేరకు.. నిబంధనల ప్రకారం వర్సిటీ పరిశోధక విద్యార్థులయిన దొంత ప్రశాంత్‌, రోహిత్‌ వేముల, గుంట శేషయ్య, పెద్దపూడి విజయ్‌, సుంకన్నలు ఒక సెమిస్టర్‌ కాలంపాటు వర్సిటీలోని బహిరంగ ప్రదేశాలో గుంపుగా తిరగరాదని, వర్సిటీ వసతిగృహాల్లో నివాసం ఉండరాదని, ఆఖరుకు యూనియన్‌ ఎన్నికల్లో కూడా పాల్గొనరాదని, ఎటువంటి ఆందోళనాచేయరాదని యాజమాన్యం నిషేధం విధించింది. ఈ ప్రకటనకు హతాషులైన విధ్యార్థులు, ఆ విద్యార్థుల‌పై సరైన కారణాలు చూపకుడానే విధించిన సాంఘిక బ‌హిష్క‌ర‌ణ ఎత్తి వేయాలంటూ జ‌న‌వ‌రి 4 నుంచి చేప‌ట్టిన విద్యార్థుల నిర‌స‌న‌లు 14వ రోజుకు చేరాయి. వారికి ఏబీవీపీ తప్ప మిగిలిన 14 విద్యార్థి సంఘాలూ సంఘీభావం ప్రకటించాయి. ఈ 14 విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఒక జేఏసీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో 14 రోజులుగా అక్కడ పలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యం లోనే ఆ అయిదుగురు విధ్యార్థులలో ఒకడయిన వేముల రోహిత్ ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఆత్మ హత్యకు ముందు అతను రాసిన లేఖ లో ఒక రచయత కావాలనుకున్న తనని ఈ దేశ పరిస్థితులు ఎంత కుంగ దీసాయో చెబుతూనే తన చావుకు ఎవరూ కారణం కాదంటూ చెప్పాడు…

శుభోదయం,

మీరీ ఉత్తరం చదివేటప్పటికి నేనిక్కడ ఉండను. మీలో కొందరు నిజంగా (నిండు హృదయంతో) నన్ను పదిలపరుచు కున్నారని, ప్రేమించారని, బాగా చూశారని నాకు తెలుసు. ఎవరిమీదా నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. నాకు సమస్యలు ఉన్నదల్లా ఎప్పుడూ నాతోనే. నా శరీరానికి, ఆత్మకు మధ్య ఎడమ పెరుగుతూ పోతున్నదని నాకు తోస్తున్నది. నేను రాక్షసుడిలా మారాను. రచయిత కావాలని ఎప్పుడూ అనుకునేవాడ్ని; కారల్ సాగన్ లాగా సైన్స్ రచయిత. చివరికి, నేను రచిస్తున్న ఒకే ఒక్క ఉత్తరం ఇదే.

నేను సైన్స్ నీ, నక్షత్రాలను, ప్రకృతినీ ప్రేమిస్తాను. కానీ, జనం ఎప్పటినుండో ప్రకృతి నుండి వేరైపోయారని తెలియక, జనాన్ని కూడా నేను ప్రేమించాను. మన భావాలు వాడిపారేసినవి (సెచొంద్ హందెద్). మన ప్రేమ (ముందే అనుకుని) నిర్మించుకున్నది. మన నమ్మకాలు రంగులు అద్దినవి. మన స్వాభావికత కృత్రిమ కళతో మాత్రమే కొలవగలిగినవి. గాయపడకుండా నిజంగా ప్రేమించడం చాలా కష్టం అయింది.

ఒక మనిషి విలువ అతని తక్షణ ఐడెంటిటీగానూ, సమీప అవకాశం (ఒకరికి అత్యంత దగ్గరగా దేనిని చూస్తే దానితో అతనిని/ఆమెను కొలవడం) గానూ దిగజారిపోయింది. ఒక వోటుగా; ఒక అంకెగా; ఒక వస్తువు (థింగ్) గా. ఒక మనిషి ఎప్పుడూ ఒక (ఆలోచించగల) మెదడుగా చూడబడలేదు; నక్షత్ర ధూళితో నిర్మితమైన ప్రసిద్ధమైనదిగా (ఎప్పుడూ చూడబడలేదు); ప్రతి రంగంలో… చదువులో, వీధుల్లో, రాజకీయాల్లో, చావులో, ఉనికిలోనూ.

నేను ఇలాంటి ఉత్తరం రాయడం ఇదే మొదటిసారి. మొదటిసారి రాస్తున్న అంతిమ ఉత్తరం! అర్ధవంతంగా కనిపించడంలో నేను విఫలం అయితే నన్ను క్షమించండి.

ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడంలో, ఇన్నేళ్లుగానూ, బహుశా నేను తప్పు కావచ్చు. ప్రేమ, బాధ, చావు.. వీటన్నింటిని అర్ధం చేసుకోవడంలో (నేను తప్పు కావచ్చు). తొందరపడవలసిందేమీ లేదు. కానీ నేను ఎప్పుడూ తొందరపడుతూనే ఉన్నా; ఒక జీవితం ప్రారంభించాలని. ఇన్నాళ్లూ కొంతమందికి, వారికి, జీవితమే ఒక శాపం. నా పుట్టుకే ఒక ప్రాణాంతకమైన ప్రమాదం. నా బాల్యపు ఒంటరితనం నుండి నేను ఎన్నడూ బైటికి రాలేకపోయాను. (నేను) నా గతం నుండి (విసిరివేయబడ్డ) ఒక ప్రశంసార్హత లేని (పరిగణించబడడానికి అర్హత లేని) బిడ్డడిని.

ఈ క్షణంలో నేను గాయపడి లేను. నాకు విచారమూ లేదు. నేను ఒట్టి ఖాళీని, అంతే! నాకు నేనే అక్కర లేదు. అటువంటి భావన చాలా హృదయవిదారకం. అందుకే నేను ఈ పని చేస్తున్నాను.

జనం నన్ను పిరికివాడుగా అంచనా వేయవచ్చు. ఒకసారి నేనంటూ ఈ లోకాన్ని వీడాక, నేను స్వార్ధపరుడిననీ, అవివేకిననీ భావించవచ్చు. నన్ను ఏమని పిలుస్తారన్న విషయమై నేను బెంగపడడం లేదు. మరణానంతర కధల పైనా, దయ్యాల పైనా, ఆత్మలపైనా నాకు నమ్మకం లేదు. అలాంటిది ఏదైనా ఉంటే గనక, నా నమ్మకం ఏమిటంటే, నేను చుక్కలవైపుకి ప్రయాణం కడతాను; (ప్రయాణించి) ఇతర ప్రపంచాల గురించి తెలుసుకుంటాను.

ఈ ఉత్తరం చదువుతున్నవారు మీరు ఎవరైనా సరే నా కోసం ఏమన్నా చేయగలిగితే, 7 నెలల ఫెలోషిప్ మొత్తం, ఒక లక్ష డెబ్భై ఐదు వేల రూపాయలు, నాకు రావలసి ఉంది; నా కుటుంబానికి అది చెల్లించబడేలా చూడగలరు. రాం జీ కి నేను 40 వేల రూపాయలు ఇవ్వాలి. ఆయన ఎప్పుడూ దానిని తిరిగి ఇవ్వమని అడగలేదు. అయినప్పటికీ (నాకు రావలసిన) ఆ మొత్తం నుండి ఆయనకు చెల్లించాలని కోరుతున్నాను.

నా అంతిమ క్రియలు నిశ్శబ్దంగా, గడబిడ లేకుండా జరగనివ్వండి. నేను అలా ప్రత్యక్షమై ఇలా వెళ్ళిపోయినట్లే ప్రవర్తించండి. నా కోసం కన్నీళ్లు పెట్టుకోవద్దు. నేను బతికి ఉండడం కంటే చనిపోవడంలోనే సంతోషంగా ఉంటానని తెలిసి మెలగండి.

“నీడల నుండి చుక్కల చెంతకు.” సెలవు.

ఉమా అన్నా, దీని కోసం నీ గదిని ఉపయోగించినందుకు క్షమించాలి.

ఏ‌ఎస్‌ఏ కుటుంబానికి, మీ అందరినీ నిరాశపరిచినందుకు క్షమాపణలు. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు. మీ భవిష్యత్తు లో అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాను.

చివరిగా ఒక్కసారి,

జై భీమ్

మర్యాదలు రాయడం మర్చిపోయాను. నన్ను నేను చంపుకోవడానికి ఎవరూ బాధ్యులు కారు. తమ చర్యలతో గాని, తమ మాటలతో గానీ నన్నీ చర్యకు ఎవరూ పురిగొల్పలేదు. ఇది నా నిర్ణయం, దీనికి నేను మాత్రమే భాద్యున్ని. నేను వెళ్లిపోయాక ఇలా చేసినందుకు నా మిత్రులను గానీ శత్రువులను గానీ ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు.

రోహిత్ వేముల (సంతకం)

17/01/2016

(Visited 947 times, 1 visits today)