Home / Inspiring Stories / అమ్మని వెతకటం కోసం దేశాలు దాటివచ్చారు ..

అమ్మని వెతకటం కోసం దేశాలు దాటివచ్చారు ..

Author:

dubai sisters searching for their mom

ఆ అక్కా చెల్లెల్లిద్దరిదీ ఈ దేశం కాదు. దుబాయ్…కానీ వాళ్ళ తల్లిది భారత దేశమే. చిన్నతనంలోనే తమకు దూరమై, భారత దేశం వచ్చేసిన తమ తల్లిని వెతుక్కుంటూ ఇప్పుడు భారత దేశంలో అడుగు పెట్టారు. ఒక్క సారైనా తమకు జన్మనిచ్చిన తల్లిని చూడాలనేదే వారికి ఇప్పుడున్న ఒకే ఒక కోరిక. సినిమా కథలోలా 29 ఏళ్ళకు గానీ ఇన్నాళ్ళు తమను పెంచింది సవతి తల్లి అనీ జన్మనిచ్చిన అమ్మ దేశాల అవతల ఎక్కడో ఉందనీ తెలిసింది. ఇక ఆ అమ్మ కొసం ఈ బిడ్డల వెతుకులాట మొదలైంది. విఫలమౌతున్నా తమ అన్వేషణ ఆపటం లేదు ఇప్పుడు ఇంకోసారి ప్రయత్నించటానికి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. తమని కన్నఅమ్మని కన్న ఈ హైదరాబాద్ ఒడిలోనే తామ వెతుకులాటని కొనసాగిస్తున్నారు. అసలేమిటీ కథ ఆ ఇద్దరూ అమ్మకి ఎలా దూరమయ్యారూ అంటే……

దాదాపు ముప్పయ్యేళ్ళ క్రితం 1981 డిసెంబర్ 7న హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రజియా బేగం అనే అమ్మాయిని దుబాయ్‌కు చెందిన “రషీద్ ఈద్ ఒబేద్ రిఫక్ మస్మారీ” అనే అరబ్ షేక్ హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. రజియాను తనతో పాటు దుబాయ్ తీసుకెళ్లాడు. అయితే ఇద్దరు పిల్లలు అయేషా రషీద్ ఈద్ ఒబేద్, ఫాతిమా రషీద్ ఈద్ ఒబేద్ పుట్టాక వీరు 7 ఏళ్ల కాపురం తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రజియా హైదరాబాద్ వచ్చేసింది. అప్పటికి పసివాళ్ళిద్దరూ తమ తల్లిని గుర్తు పెట్టుకునే వయసు ఇంకా రాలేదు. ఆ తర్వాత మస్మారీ దుబాయ్ కే చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు సవతి తల్లి దగ్గరే పెరిగారు. ఆమె తమ తల్లి అనుకున్నారు. ఐతే చివరికి వాళ్ళకో నిజం తెలిసింది. తండ్రి చనిపోతూ అసలు విషయం చెప్పాడు. ఈమె మీకు సవతితల్లే కానీ, కన్న తల్లి కాదు అనీ, ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపాడు. దీంతో ఇక ఈ ఇద్దరు యువతులు తమ కన్నతల్లి కోసం వెతుకులాట ప్రారంభించారు. హైదరాబాద్ చేరుకొని తల్లి జాడ చెప్పండని వారు కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారు. నగర పోలీసులను ఆశ్రయించి ముప్పై ఏళ్ల క్రితం తమను వదిలి వెళ్లిన తమ తల్లిని వెతకమని అభ్యర్థించారు. తమ వద్ద నున్న తల్లి ఫోటోను, వివరాలను వారికి అందజేశారు.

ఇపుడు అయేషా రషీద్ ఈద్ ఒబేద్ వయసు 29 సంవత్సరాలు, ఫాతిమా రషీద్ ఈద్ ఒబేద్ వయస్సు 25 ఏళ్ళు వీళ్ళిద్దరూ మీడియాతో మాట్లాడుతూ “మా తండ్రి, మా అమ్మకు 1988లో విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి మా అమ్మను చూసే అవకాశం రాలేదు. నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మ కోసం హైదరాబాద్‌కు వచ్చాం. కానీ ఆమె జాడ కనిపెట్టలేకపోయాం. కొంత మంది మిత్రుల సహాయంతో మళ్లీ అమ్మను వెతకటానికి వచ్చాం. ఈసారి ఆమె మాకు తప్పక దొరుకుతుందని అనిపిస్తూంది ప్లీజ్ మాకు అమ్మని కనుకోవటం లో సహాయం చేయండి” అని చెప్పారు.

(Visited 1,477 times, 1 visits today)