Home / Political / పెళ్ళి కాని అమ్మాయిల చేతుల్లో ఇక ఫోన్లు ఉండకూడదు

పెళ్ళి కాని అమ్మాయిల చేతుల్లో ఇక ఫోన్లు ఉండకూడదు

Author:

Gujarati village banned girls from using mobile

రోజులు గడిచే కొద్ది మరింత వెనక్కి జారిపోతున్నామేమో అనిపించే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిల వస్త్ర ధారణ పై, వారి అలవాట్ల పై సాగిన మోరల్ పోలీసింగ్ ఇప్పుడు మరింతగా పెరిగిపోతోంది… ఆడపిల్లలు ఫోన్లవల్ల త్వరగా ప్రేమలో పడి తమ పరువు తీస్తున్నారు అంటూ గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడటం నిషేధించారు. వివాహం కాని బాలికలు ఫోన్లు ఉపయోగించొద్దని ఈ నిబంధనను అతిక్రమిస్తే అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుందని. శిక్షలకు తల ఒగ్గాల్సి వస్తుందనీ హెచ్చరించారు. మన భారత ప్రధాని మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లోని మెహన్సా జిల్లాలో గల సూరజ్ అనే గ్రామంలో చదువుకుంటున్న బాలికలు ఎట్టి పరిస్థితుల్లో, ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్లు ఉపయోగించొద్దని, తల్లి తండ్రులు కూడా వారికి మొబైల్ ఫోన్లు కొనివ్వొద్దనీ, వాటిని ఉపయోగించడం మూలంగా వారి ప్రవర్తన దెబ్బతింటుందని, చదువులపై తీరని ప్రభావం పడుతుందని పేర్కొంటూ ఒక హెచ్చరిక జారీ అయ్యింది. అన్నిటికంటే ఆశ్చర్య కర విషయం ఏమిటంటే ఈ ప్రతిపాదన చేసింది ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కావటం.

దీనికి ఆ గ్రామ పంచాయతీ మూకుమ్మడిగా ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ.2100 ఫైన్ చెల్లించాలంటూ స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లు అమ్మాయిలకు, వారితల్లిదండ్రులకు సమస్యలుగా పరిణమించాయని, వీటి కారణంగా అమ్మాయిలు తేలిగ్గా ప్రేమ అనే మాయలో పడటమే కాకుండా ఇంట్లో నుంచి తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్లిపోతున్నారని ఆ గ్రామస్తులు అంటున్నారు. అందుకే తాము తెచ్చిన ఈప్రతిపాదనకు దళితులు, పటేళ్లు, ఠాకోర్ లు, రాబారిలు అన్ని వర్గాల వారూ ఎటువంటి ఆక్షేపనలూ చూపకుండా దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, ఇక నుంచి 18 ఏళ్లలోపు అమ్మాయిల చేతుల్లో మొబైల్ ఫోన్లు కనిపించబోవని, తాము కనిపించ నివ్వమనీ చెప్పారు. అయితే ఈ ప్రతిపాదన ఇదే ఊరిలో ఉన్న పెళ్ళికాని అబ్బాయిలకు మాత్రం వర్తించదట.. మరి వీరు ప్రేమలో పడే అవకాశం, లేదా సెల్ ఫోన్ వల్ల అబ్బాయిల చదువులు చెడిపోవా అని అడిగినప్పుడు మాత్రం… వింత సమాధానాలే వచ్చాయి… అబ్బాయిలు ప్రేమించినా తప్పులేదు కానీ ఒక అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తే కుటుంబం పరువు పోతుందట. అందులోనూ అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఏం లేదనీ అబ్బాయిలకు అ హక్కు ఉందనీ చెబుతున్నారీ గ్రామస్తులు…

(Visited 454 times, 1 visits today)