Home / Inspiring Stories / కూరగాయలు అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి పేదవాళ్ళ కోసం ఆసుపత్రి కట్టింది.

కూరగాయలు అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి పేదవాళ్ళ కోసం ఆసుపత్రి కట్టింది.

Author:

మనిషి కోసం ఇంకో మనిషే కదా ఏదైనా చేయగలడు. నిజానికి మనుషులు డబ్బు లేక చనిపోరు… అవసరానికి మించి డబ్బు దాచుకునే వారి వల్ల చనిపోతారు. పేదరికంతో తన భర్తను కోల్పోయిందామె. సరైన సమయానికి చికిత్స అందించలేక 23 ఏళ్ళ వయసుకే తన భర్త శాశ్వతంగా దూరమైపోతూంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది.. అయితే అప్పుడే నిర్ణయించుకుంది ఇలా కేవలం డబ్బులేకపోవటం వల్లనో వైద్యం అందకనో ఎవరూ చనిపోకూడదు కనీసం నాకు చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో కొందరైనా అలా చనిపోకూడడు అనుకుందామె. కూరగాయలమ్ముతూ, కూలి పనిచేస్తూ పైసా పైసా కూడబెట్టింది. తన భర్తలా ఏ వ్యాధితోనూ పేద ప్రజలు చనిపోకూడదని భావించి సొంత ఖర్చులతో ఓ చిన్నపాటి హాస్పిటల్‌ను ఆమె ప్రారంభించింది. ఇంకా…ఇంకా కష్టపడుతూనే అదే చిన్న హాస్పిటల్ ని మరింతగా అభివృద్ది చేసింది. అదే హాస్పిటల్ ను ఈ రోజు కొన్ని వందల మందికి సేవలందించే వైద్యాలయంగా మార్చింది.

Subhashini Mistry_Hospital_Main lead image

ఇదంతా జరిగింది పశ్చిమబెంగాల్ లో జరిగిన సంఘటన. ఆమె పేరు సుహాసిని ఓ పేద కుటుంబంలో జన్మించింది. తనకు 12 సంవత్సరాలు రాగానే పెళ్లి చేశారు.ఇద్దరు బిడ్డలు పుట్టారు. అయితే 23వ ఏటనే ఆమె భర్తను కోల్పోవలసి వచ్చింది. అతనికి సోకిన వ్యాధికి సరైన చికిత్స చేయించే స్థోమత లేకపోవడంతో తన భర్తను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పిల్లల సంరక్షణ భారం ఆమెపై పడింది. అయితే అప్పుడే ఆమె ఓ నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా, ఎప్పటికైనా తన సొంత ఖర్చుతో ఓ హాస్పిటల్‌ను ప్రారంభించి తనలాంటి పేద వారికి ఉచితంగా వైద్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం గత 20 ఏళ్లుగా సుహాసిని కష్ట పడుతూనే ఉంది అక్కడా ఇక్కడా ఇండ్లలో పనిచేసి పైసా పైసా కూడబెట్టింది. తాను సంపాదించిన దాంట్లో రెండు వంతులు సొంత ఖర్చులకు, రెండు వంతులు తిండికి, ఇక మిగిలిన డబ్బుని తను కట్టబోయే ఆసుపత్రి కోసం దాచి ఉంచేది. ఒక వేళ తను ఆసుపత్రి కట్టాక ఏ డాక్టరూ పనిచేయటానికి రాకపోతే అన్న అనుమానంతో.తన చిన్న కుమారుడు అజొయ్‌ను మాత్రం డాక్టర్‌ని చేసింది.

Humanity Hospital 3

1993లో తాను నివసించే ప్రాంతంలోనే ఒక ఎకరం భూమిని తాను పొదుపు చేసిన డబ్బులతో కొనుగోలు చేసింది. అందులో ఒక చిన్న షెడ్డు వేసి ఆసుపత్రి ప్రారంభించారు. దాంట్లో ఆమె కుమారుడు అజొయ్ వైద్య సేవలను అందించేవాడు. హాస్పిటల్‌లో తన షిఫ్ట్ అయిపోగానే ఆ షెడ్డుకు వచ్చి స్థానికంగా నివసించే పేదలకు వైద్యం చేసేవాడు. కాగా ఆ షెడ్డులోనూ మొదటి రోజే 252 మంది పేషెంట్లు వైద్యం కోసం రావడం గమనార్హం. దీంతో సుహాసిని ఆనంద భాష్పాలు రాల్చింది.

vegetable seller Subhasini who established a Hospital at Hashpuker in West Bengal

ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యం నెరవేరినందుకు సంతోషించింది. అయితే అంతటితో ఆమె ఆగలేదు.ఇంకా మంచి సదుపాయాలతో పెద్ద హాస్పిటల్‌ను నిర్మించాలని ఆమె భావించింది. అందుకోసం మళ్లీ డబ్బు సంపాదించే పనిలో పడింది కూరగాయలను అమ్మటం మొదలుపెట్టింది. ఆమెకు పెద్ద కుమారుడు సుజొయ్ కూడా తల్లి కల నెరవేర్చటానికి సహకారం అందించాడు. ఆమెతో కలిసి వ్యాపారం చేస్తూ మరింత డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో అజొయ్ కూడా తన వంతు బాధ్యతగా కార్పొరేట్ సంస్థలను, చారిటీలను, ట్రస్ట్‌లను నిధుల కోసం ఆశ్రయించాడు. అయితే అతని ప్రయత్నమూ వృథా కాలేదు. సరిగ్గా వారి షెడ్డు హాస్పిటల్ ప్రారంభమైన రెండేళ్లకే అనగా ఫిబ్రవరి 5, 1995న అధునాతన హాస్పిటల్ నిర్మాణానానికి పునాది పడింది. అనంతరం ఒక సంవత్సరంలో హాస్పిటల్‌ను పూర్తి చేసి మార్చి 9, 1996న హ్యుమానిటీ హాస్పిటల్‌ను ప్రారంభించారు.

Humanity Hospital 2

ప్రస్తుతం ఈ హాస్పిటల్ నిర్వహణలో సుహాసిని కుటుంబ సభ్యులందరూ భాగస్వాములుగా ఉన్నారు. కాగా సుహాసిని మాత్రం తన కుమారుల పిల్లలైన మనవలతో ఆడుకుంటూ వారి సంరక్షణ చూస్తోంది. ప్రస్తుతం ఈ హాస్పిటల్‌లో తీవ్రమైన శస్త్రచికిత్సలకు కూడా దాదాపు రూ.5వేల లోపే ఖర్చవుతుంది. సాధారణ చికిత్సలకైతే వారు కేవలం రూ.10 మాత్రమే తీసుకుంటారు. తనకు వచ్చిన ధుఖాన్నీ కన్నీళ్ళనీ మరొకరిలో చూడవద్దనుకున్న ఆమె తన జీవితం మొత్తాన్నీ ఆసుపత్రి కోసమే వెచ్చించింది…23 మూడేళ్ళ వయసులో భర్తని కోల్పోయిన ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు…అసలు పిల్లల పెంపకం ఆసుపత్రి నిర్మాణం తప్ప మరే ద్యాసా ఆమెకు లేకుండా పోయింది. ఇతరుల కోసం కట్టే ఆసుపత్రి కోసం ఆమె తన జీవితంలో ఎన్నిటినో కోల్పోయింది…. అయినా ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నాననీ…,తన కల నెరవేరేందుకు సరైన బిడ్డలు తనకు ఉన్నారనీ ఆనందంగా చెబుతుంది సుహాసిని….

(Visited 897 times, 1 visits today)