Home / Inspiring Stories / మానవత్వానికి బిల్ వేసే యంత్రాలు అక్కడ లేవు.

మానవత్వానికి బిల్ వేసే యంత్రాలు అక్కడ లేవు.

Author:

A Guy Fed Two Hungry Street Kids In A Restaurant, The Restaurant Too Showed What Humanity Is

ఇప్పుడు మీరు చదవబోయేది ఒక పేరు తెలియని మనిషి గురించి మీలో మీకే తెలియకుండా ఉన్న,ఉండబోయే ఒక మనిషి గురించి మనలో మనమే మరచిపోతున్న మానవత్వం గురించి. కేరళలోని ఒక సాయంత్రం జరిగిన ఈ సంఘటన మీ పెదవులమీద చిరునవ్వునీ,కళ్ళలో నీటిపొరనీ ఒకేసారి తెప్పిస్తుంది….

ఒక యువకుడు ప్రతీ సంవత్సరం జరిగే కంపెనీ మీటింగ్ అటెండ్ అవటానికి మలప్పురం చేరుకున్నాడు. పగలంతా మీటింగ్ కాంఫరెన్స్,ఐడియా షేరింగ్ లతో బిజీగా గడిపి హొటల్ రూంకి వచ్చేసరికి అలసిపోయాడు అలసట,ఆకలీ రెండిటినీ తీర్చుకోవటానికి రెడీ అయి ఒక రెస్టారెంట్ లోకి అడుగుపెట్టాడు.ఆకలీని పెంచే అద్బుతమైన వంటకాల వాసనలు,చక్కగా శుబ్రంగా ఉన్న రెస్టారెంట్ వాతావరణం ఇంకేం కావాలి. హుషారుగా పరోటా చికెన్ కర్రీ ఆర్డర్ చేసి తినటానికి రెడీ అయిపోయాడు. పరోటా నోట్లో పెట్టుకోబోతూండగా ఎందుకో బయటికి చూసిన అతనికి…. ఆకలిగా లోపలికే చూస్తున్న రెండు కళ్ళు…పదేళ్ళైనా నిండని కళ్ళలో ఆకలి కనిపించాయ్. ఆకలితో ఆశగా హొటల్ అద్దాలలోంచి టేబుళ్ళ మీద పథార్థాలని చూస్తున్నాయాకళ్ళు. ఇతని మనసు ద్రవించిపోయింది. ఇప్పుడు ఎవరికళ్ళలో ఉన్నది నిజమైన భాద? ఎవరిది నిజమైన ఆకలి.?

తినలేక పోయాడు..పరోటా ప్లేట్లోకి చేరిపోయింది ఇప్పుడతనికి చికెన్ కూర రుచిగా అనిపించటం లేదు.. ఇప్పుడు అతని ఆకలి కడుపుది కాదు మనసుది. ప్లేట్ అక్కడేఅ వదిలేసి బయటకి వచ్చాడు.ఆపసివాని దగ్గరకు పిలిచాడు. ఆపిల్ల వాడితో ఉన్న మరో పసి పాప అతని చెల్లెలు.. ఇద్దరినీ తనతో పాటు లోపలికి పిలిచాడు. మొదట భయపడ్డా ఆకలి ఇచ్చిన తెగింపో అతని కళ్ళలో ఉన్న ఆప్యాయతో తెలియదు గానీ ఇద్దరూ లోపలికి వచ్చారు.మురికి బట్టలు,చెప్పులు లేని కాళ్ళూ,బెరుకు చూపులు. తన టేబుల్ దగ్గరే వారినీ కూర్చో బెట్టి అడిగాడు “ఏం తింటారు?” ఇద్దరి వేళ్ళూ అతని ప్లేట్ వైపే చూపించారు. నవ్వుతూ ఆ ఇద్దరికి కూడా తనతో పాటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు.

పరోటా ముట్టుకోబోతూ ఆగిపోయిన పిల్లవాడు తన చెల్లెలిని తీసుకొని వాష్బేసిన్ దగ్గరికి వెళ్ళి తన చేతులూ ఆ చిన్న దాని చేతులూ కడుక్కుని వచ్చి తినటం మొదలు పెట్టారు.ఎంతో ఆశగా,ఆకలిగా,అన్నం మీద నిజమైన ఆకలికి ఉండే భక్తితో ఆ పరోటాలనే చూస్తూ తిన్నారు ఇద్దరి పసివాళ్ళ పొట్టలూ.. వాళ్ళకి అన్నం పెట్టించిన మనసూ నిండిపోయాయ్. ఆ ఇద్దరినే చూస్తూ బిల్ల్ తెమ్మని చెప్పిన అతను చేతులు కడుక్కొని వచ్చేసరికి టేబుల్ మీద బిల్ స్లిప్… చేతిలోకి తీసుకుని అలా చూస్తూనే ఉండిపోయాడు..అతని కంట్లోంచి జారిన కన్నీటి చుక్క స్లిప్ మీద పడేసరికి తేరుకొని… కౌంటర్ దగ్గర కూచున్న మనిషి వైపు చూసాడు… అక్కడ కూచున్న వ్యక్తి చిరునవ్వుతో ఇతన్నే చూస్తున్నాడు.మనుషుల్లో నీలాంటి వాళ్ళు మరికొందరం ఉన్నాం అని చెప్పినట్టుగా ఉందా నవ్వు.మళ్ళీ ఒక సారి బిల్ వైపు చూసాడతను అక్కడ ఏం రాసి ఉందో తెలుసా..!?
“మానవత్వానికి బిల్ వేసే యంత్రాలు ఇక్కడలేవు”

ఈ సంఘటనలో ఆ పిల్లల ఆకలి తీర్చిన మనిషి ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు అతనూ చెప్పుకోలేదు.. ఆ రెస్టారెంట్ యజమానీ ఎక్కడా చెప్పలేదు. ఆ ఇద్దరు పసివాళ్ళు కూడా ఎక్కడా ఇది చెప్పారో లేదో తెలియదు గానీ ఈ సంఘటననీ,ఆ బిల్ మీద వాక్యాలనీ చూసిన మరో కస్టమర్ దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు… మీలో కూడా ఆ మిస్టర్ ఎక్స్ ఎక్కడో ఉండే ఉంటాడు కానీ ఈ బిజీ జీవితాల్లో బయటకు రాలేక పోతున్నాడంతే… రోడ్డు మీద ఎండకు కమిలిపోతున్న పసిపాదాలను పట్టించుకోకుండా అంతకంటే పెద్ద ,మంటని కడుపులో మోస్తూ తిరిగే మరికొన్ని కళ్ళు మీలో ఉన్న మనిషి కోసం వెతుకుతూనే ఉండుంటాయ్… గుడి మెట్ల దగ్గరో, బస్టాప్ లోనో,ఏ రెస్టారెంట్ ముందో… ఒక సారి చూడండటు…

Must Read:  వైఫై స్లోగా ఉంటే బీరు తాగేయండి.

(Visited 3,455 times, 1 visits today)