Home / Inspiring Stories / ధనలక్ష్మి యంత్రం అని ఆశపడ్డారో..! మోసపోయినట్లే..!!

ధనలక్ష్మి యంత్రం అని ఆశపడ్డారో..! మోసపోయినట్లే..!!

Author:

‘‘నమస్కారమండీ.. మేము ….కంపెనీ నుంచి ఫోన్‌చేస్తున్నాం. మీ నంబరుకు లక్కీడిప్‌ తగిలింది. రూ.4 వేలు విలువచేసే ధనలక్ష్మి యంత్రం, కుబేర యంత్రం, శ్రీవారి పాదాలు, తాబేలు విగ్రహం, హనుమాన్‌ చాలీసా యంత్రాలను కేవలం.. రూ.1900లకే మీకు అందిస్తున్నాం. వీటిని మీ ఇంట్లో ఉంచుకోవడంతో గంటల్లోనే మీ కష్టాలన్నీ గట్టెకుతాయి. త్వరలోనే మీరు లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారు. వీటిని సొంతం చేసుకోవాలంటే.. వెంటనే మీ అడ్రస్‌ను చెప్పండి’’ అంటూ.. ఫోన్‌కాల్స్‌ రావడం ఇటీవల సాధారణంగా మారింది. వేధిస్తున్న కష్టాలు కావచ్చు.. సహజ సిద్ధంగా మనిషిలో ఉన్న ‘ఆశ’ కావచ్చు కానీ.. కొంతమంది ఇలాంటివి నిజమని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. అయితే.. ఆ వస్తువులను అమ్మినవారు మాత్రం కోటీశ్వరులు అవుతున్నారు. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొన్న మోసగాళ్లు.. సెల్‌ఫోన్‌ నెంబర్లను సేకరించి… మాటకారి టెలీకాలర్స్‌ను రంగంలోకి దించుతున్నారు. ఈ టెలీకాలర్స్‌ తమ ‘వాక్చాతుర్యం’తో ఎదుటివారిని తేలిగ్గా మోసం చేస్తున్నారు. ఇలా ముఠాలుగా ఏర్పడ్డ మోసగాళ్లు.. గుంటూరు కేంద్రంగా తమ దందాను నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు.  ధనలక్ష్మి, కుబేర యంత్రం, హనుమాన్‌ చాలీసా యంత్రం, ఈశ్వర యంత్రం, నరదిష్టి నివారణ యంత్రం, ధనలక్ష్మి అమ్మవారి అభిషేక పాదాలు అంటూ జనం సెంటిమెంటును.. మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.

Dhanalakshmi Yantram

ఆర్దిక ఇబ్బందులతో సతమతమౌతూన్న సామాన్య మధ్య తరగతి ప్రజల నమ్మకాలను ఆసరా చేసుకుని మాయగాళ్లు ఏ విధంగా బాగుపడుతున్నారో తేటతెల్లం చేసే ఘటన ఇది. ఈ ఘరానా మోసంలో కొంతమంది వ్యాపారులతో పాటు వారి ఏజెంట్‌లు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఢిల్లీకి చెందిన రమేష్ అనే వ్యాపారి, హైదరాబాద్‌కు చెందిన జతీన్ ఖన్నా అనే వ్యాపారి కలసి కేవలం వందరూపాయల లోపు విలువగల రాగిరేకుపై పిచ్చిగీతలు గీసి అదే కుబేర యంత్రం గా చెప్పి 3 వేల రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రముఖ టెలిజన్ ఛానల్స్‌లో వరుసగా ప్రత్యేక కార్యక్రమాల పేరుతో ప్రకటనలు జారీ చేస్తున్నారు. నిష్ణాతు లైన వేదపండితులు, తంత్రవేత్తలు అత్యంత నియమనిష్టలతో శనిమహాదేవుడికి పూజలు చేసి తద్వారా సంక్రమించిన శక్తులతో ఈయంత్రాలను రూపొందిస్తున్నారని ఆప్రకటనల్లో ఊదరగొడుతున్నారు. ఆ కార్యక్రమాలను చూస్తున్న అమా యకులు నిజంగానే ఆ యంత్రాలకు చాలా మహత్తు ఉందని నమ్మి కొనుగోలు చేసి దారుణంగా మోసపోతున్నారు. రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం రత్నాపూర్ అనే గ్రామానికి చెందిన రంగు నర్సయ్య కూడా గత కొంత కాలంగా తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులతో సతమతమౌతున్నాడు.

అయితే శ్రీధనలక్ష్మి కుబేర యంత్రం పేరుతో టీవిలలో ఈ ప్రకటనలు చూసి నిజంగానే ఆ యంత్రాన్ని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకుంటే శని దేవుడు కరుణించి తన కష్టాలు తీరుస్తాడని నమ్మాడు. దాంతో అసలే అప్పుల్లో కూరుకుపోయిన నర్సయ్య భవిష్యత్‌పై ఆశతో మరోచోట అప్పుచేసి మూడువేల రెండు వంద ల రూపాయలకు ఈ యంత్రాన్ని ఒక ఏజెంట్ ద్వారా కొనుగోలు చేశాడు. అయితే ఎన్ని రోజులు దానిని పూజగదిలో పెట్టి పూజలు చేసినా తన కష్టాలు ఏమాత్రం తీరక పోగా యంత్రం కొనుగోలు చేసేందుకు చేసిన మూడువేల రూపాయల అప్పుకు మాత్రం వడ్డీ కట్టాల్సి వస్తోంది. దాంతో చివరకు తాను ఘోరంగా మోసపోయానని అర్దమైన నర్సయ్య నేరుగా కమాన్ పూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. జిల్లాలో ఈ తరహా యంత్రాలు, రంగురాళ్లు అమ్ముతూ లక్షలాది రూపాయల వ్యాపారాలు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువై పోవడంతో ఈఫిర్యాదుకు స్పంధించిన ఉన్నతా«ధికారులు దీనిపై సమగ్ర ద ర్యాప్తు జరపాల్సిందిగా కమాన్ పూర్ ఎస్ఐ దాసరి భూమయ్యను ఆదేశించారు. దాంతో రంగంలోకి దిగిన భూమయ్య రంగు నర్సయ్యకు యంత్రం అమ్మిన ఏజెంట్ ద్వారా సమాచారం సేకరించి హైదరాబాద్‌లో టివి 24 పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న జతీన్ ఖన్నా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్మయ పరిచే అనేక ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. జైపూర్‌కు చెందిన జతీన్‌ఖన్నా 12 సంవత్సరాలక్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. కుటంబ పోషణ కోసం ఎన్ని వ్యాపారాలు చేసినా కలసి రాలేదు. దాంతో ప్రముఖ సంస్థలు తయారు చేసే పలు రకాల ఉత్పత్తులకు హోల్‌సేల్ డీలర్‌షిప్ తీసుకుని రాష్ట్రంలో విక్రయించేవాడు. దాంట్లో కూడా అంతగా లాభాలు రాకపోవడంతో అతడి దృష్టి ప్రజల నమ్మకాలపై పడింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఏళ్లనాటి శని అని, నవగ్రహారాధన, నక్షత్రదోషాల పేరుతో ఎక్కడ చూసినా పూజలు, వ్రతాలు, జపాలు ఎక్కువై పోవడంతో ఆ దిశగా ఆలోచించాడు. అంతే ఢిల్లీకి చెందిన రమేష్ అనే వ్యాపారితో చేతులు కలిపాడు. రమేష్ కేవలం వందరూపాయల లోపు పెట్టుబడితో రాగిరేకులు కొనుగోలు చేసి దానిపై యంత్రం తరహాలో గీతలుగీసి ఓం, హ్రీం, శ్రీం, క్లీం, అంటూ రాతలు రాసి దానినే కుబేర యంత్రంగా పేరు పెట్టాడు. దానిని ఆసక్తికరమైన ప్యాకింగ్‌లో పెట్టి మూడు వందల రూపాయలకు జతీన్«ఖన్నాకు విక్రయించే వాడు. ఖన్నా దానికి సంబంధించి ఆసక్తికరమైన రీతిలో స్క్రిప్ట్ రాసుకుని ప్రముఖ తారలతో ఒక వ్యాపార ప్రకటన రూపొందించి ఎబిఎన్, జీటివి, టిన్యూస్, మా మ్యూజిక్, జెమినీ కామెడీ ఛానల్స్‌లో విరివిగా ప్రసారం చేయించాడు. ఆ ప్రకటనలు చూసిన నర్సయ్యలాంటి అమాయకులు అనేకమంది ఆ యంత్రాలు కొనుగోలు చేస్తున్నారు. ఢిల్లీ వ్యాపారి నుంచి కేవలం మూడు వందల రూపాయలు ఆ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్న జతీన్‌ఖన్నా దానిని మూడువేల రూపాయలకు విక్రయిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణా జిల్లాలలో ఈ యంత్రానికి విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్,అదిలాబాద్ జిల్లాలలో కొంతమందిని ఏజెంట్‌లు పెట్టుకున్నాడు. ఆ ఏజెంట్‌లకు ఖన్నా ఒక్కో యంత్రాణ్ణి మూడువేలకు ఇస్తుంటే వారు కస్టమర్‌లకు మూడువేల రెండు వందలకు అంటగడుతున్నారు. అయితే ఈ యంత్రాలకు గిరాకీ విపరీతంగా పెరిగిపోవడంతో హైదరాబాద్‌లోనే ఇద్దరు స్వర్ణకారులను నియమించుకుని తానే స్వయంగా వీటిని తయారు చేయించాలన్న యోచనలో కూడా జతీన్‌ఖన్నా ఉన్నట్లు పోలీసు విచారణలో వెళ్లడైంది. ఈ వ్యాపారం పూర్తిస్థాయి లాభసాటి గా ఉండటంతోపాటు తన దరిద్రం మొత్తం తీరిపోవడంతో ఇదే రీతిలో మరికొన్ని దేవుళ్ల పేరుతో యంత్రాలు, ఉంగరాలు తయారు చేయించే పనిలో ఉన్నాడు. పోలీసులు అతడి ని అదుపులోకి తీసుకుని విచారించితే ఈ యంత్రాల తయారీ కోసం తామెలాంటి పూజలు నిర్వహించడం లేదని ప్రజలను నమ్మించేందుకే అలాంటి ప్రకటనలు షూట్ చేయించి టివిలలో ప్రసారం చేస్తున్నానని చెప్పాడు.

dhanlaxmi_yantra

ఈ విధంగా అతడు కేవలం రెండు నెలల కాలంలో టివిలలో ప్రకటనల కోసం ఎబిఎన్ ఛానల్‌కు 17 లక్షలు, టి న్యూస్ కు మూడున్నర లక్షలు, మా మ్యూజిక్ ఛానల్‌కు నాలుగున్నర లక్షలు, జెమిని కామెడీ ఛానల్‌కు మూడు లక్షల రూపాయలు చెల్లించాడు. దీనిని బట్టి ఈ ధనలక్ష్మీయంత్రం ద్వారా అతడు ఏ స్థాయిలో వ్యాపారం చేస్తున్నాడో అర్దం చేసుకోవచ్చని కేసు దర్యాప్తు జరిపిన పోలీసులంటున్నారు. కాగా విచారణలో జతీన్ ఖన్నా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ ప్రకటనలు జారీ చేసిన టివి ఛానల్స్‌పై కూడా కేసులు నమోదు చేయబోతున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రకటనల్లో నటించిన యాంకర్‌లను కూడా విచారిస్తామని, ఇది ప్రజల నమ్మకాలను అడ్డంపెట్టుకుని, కొంతమంది వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా వ్యూహం ప్రకారం చేసిన మోసం కనుక ఇందులో పాలుపంచుకున్న యాంకర్‌లు కూడా కేసు పరిధిలోకే వస్తారని కమాన్ పూర్ ఎస్ఐ దాసరి భూమయ్య చెప్పారు. బుధవారం నాడు ఆయన సూర్య ప్రతినిధితో టెలిఫోన్‌లో మాట్లాడుతూ ఆ ప్రకటనలు ప్రసారం చేసిన టివి ఛానల్స్ యాజమాన్యాలను కూడా సిఆర్‌పిసి 161 ప్రకారం విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామని, కేసులో వారిని ప్రధాన సాక్షులుగా చేరుస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘరానా మోసంలో పాల్గొంటున్న ఏజెంట్‌లను గుర్తించే పనిలో ఉన్నామని పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.
(Visited 2,584 times, 1 visits today)