Home / Entertainment / సినీ పరిశ్రమ లోని యంగ్ జనరేషన్ లో ఉన్న మానవత్వం సినీ పెద్దలకు ఎప్పుడొస్తుందో …

సినీ పరిశ్రమ లోని యంగ్ జనరేషన్ లో ఉన్న మానవత్వం సినీ పెద్దలకు ఎప్పుడొస్తుందో …

Author:

విశ్వనాధ శాస్త్రి గారూ…సారీ…కాస్త ఆలస్యమైంది..ఏమీ అనుకోకండి. మీరు వేసిన రోల్స్ చిన్నవే కానీ..మీ పాత్రల ద్వారా మా మీద వేసిన ముద్ర పెద్దదే. రామానాయుడు గారు బతికున్నంత వరకూ ఆయన మీకు ఎంత అండగా నిలబడ్డారో….అలాంటి సహృదయుల కోసం, వారి చేయూత కోసం ఈ రోజు స్వర్గంలో ఉన్న మీరు, భూమి మీద ఉన్న మీ వారసులు ఎదురు చూస్తున్నారు. రామానాయుడు గారు కూడా ఈ ఏడాది ఫిబ్రవరి లోనే మీరున్న స్వర్గానికే చేరుకున్నారు …ఓ పాలి ఆయన చేత ‘ఇంటర్ కాంటినెంటల్ డయలింగ్’..అదేనండీ….ఐ.సి.డి. కాల్ చేయించండి..ఇక్కడున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యాలయానికి!…..ఒకప్పటి ‘మా’ ప్రెసిడెంట్ , ఇప్పుడు పార్లమెంట్ మెంబర్ మురళీమోహన్ గారికి ఇంకా మీ కుటుంబం పడుతున్న బాధలు తెలిసినట్టు లేవు. మీరు రామానాయుడు గారి చేత ఫోన్ చేయిస్తే, మురళీ మోహన్ గారు కచ్చితంగా సాయం చేస్తారు సార్…..మరో మాట..మురళీ మోహన్ గారిది పెద్ద చెయ్యి కూడానూ…అంచేత….రామానాయుడు గారి రికమండేషన్ తో మురళీమోహన్ గారు, ఇంకా ఇప్పటి ‘మా’ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కలిసి వచ్చి, ఇతరుల చేత చేతనైనంత సాయం చేయిస్తారు…ట్రై చేయండి శాస్త్రి గారు…..అవునన్నట్టు అక్కడ స్వర్గం లో ఏం చేస్తున్నారు? పౌరోహిత్యమేనా? లేక, ఏదైనా వినోద వల్లరి ప్రోగ్రామ్స్ లో యాక్ట్ చేస్తున్నారా.

బాబూ…కాస్త సాంబారు పోయండి అంటూ..పదే పదే బ్రహ్మానందం హోటల్ లో వైటర్ ని ఇరిటేట్ చేస్తున్న ఐరన్ లెగ్ శాస్త్రి ని చూశారుగా….రెండు ఇడ్లీ కి ….రెండు బకెట్ల సాంబారు తాగేసిన శాస్త్రి ని చూసి బ్రహ్మానందం ఎలా వాపోతున్నాడో చూశారుగా…..ఇలా ఐరన్ లెగ్ శాస్త్రి ని చాలా చౌక బారు సీన్స్ లో చూసిన సినీ ప్రేక్షకులకు అసలు విషాదం తెలియదు కదా….ప్రస్తుతం ఆయన కుటుంబం ఆర్ధికంగా ఆడుకునే వారి కోసం చూస్తోంది.

ఘరానా మొగుడు సినిమా చూస్తుంటే రీల్స్ కట్ అయిపోవటం.,..దానికి శాస్త్రి ని టార్గెట్ చేస్తూ స్క్రీన్ ప్లే రాయటం వెనుకటి సినిమాల్లో కాబట్టి నడిచింది. ఆయన పాదం మోపితే అరిష్టమంటూ నవ్వుల పాల్జేసిన సినీ పరిశ్రమ, ఈ రోజున ఆయన మరణించిన తర్వాత, ఆయన కుటుంబానికి ఏమైనా సాయం చేసిందా?

వంట బ్రాహ్మణులను డీ గ్లామరైజ్డ్ రోల్స్ లో చూపించే సంస్కారం ఈ నాటిది కాదు. నట భూషణ శీభన్ బాబు నటించిన ఏమండీ ఆవిడ వచ్చింది….సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి రోల్ ని ఎంతగా మనసు కష్టపెట్టుకునేలా మలిచారో చూడండి. కులవృత్తుల పట్ల ఉండే చిన్నచూపును దాదాపు ప్రతి సినిమాలోనూ అప్పట్లో కనబరుస్తూ వచ్చినా…కుటుంబం గడవటం కోసం శాస్త్రి ఆ రోల్స్ ను ఒప్పుకున్నారు.

అబ్బాయి గారు సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి కాంబినేషన్ గా మరో బొద్దుగా ఉన్న అమ్మాయిని చూపిస్తూ సాంగ్ సీన్ క్రియేట్ చేస్తే, జనం చప్పట్లు కొట్టారు. ఈ రోజు శాస్త్రి కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తోంది. ఆ చప్పట్లు కొట్టిన చేతులతోనే , శాస్త్రి కుటుంబానికి చేతనైనంత సాయం చేస్తే, ఆయన ఆత్మకి శాంతి చేకూరుంది.

అప్పుల అప్పారావు సినిమాలో అయితే ఏకంగా ఐరన్ లెగ్ నే చూపిస్తూ….ఆయన ఎంట్రీ ఇస్తే….దరిద్రమన్నట్టు సన్నివేశాలు రూపొందించారు. సరదాకి ..నవ్వుకోవటానికి ఉపయోగపడిన ఐరన్ లెగ్ శాస్త్రి అనబడే విశ్వనాధ శాస్త్రి క్యారెక్టర్ ఈ లోకం నుంచి సెలవు తీసుకుని, నాలుగేళ్ళు అయింది. ఇప్పుడు ఆయన భార్య, పిల్లలు నిడదవోలు లో ఇబ్బందులు పడుతుంటే..ఇంతవరకూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాటసాయానికైనా ముందుకు రాకపోవటం బాధాకరం. యంగ్ హీరోలు సందీప్ కిషన్, సంపూర్ణేష్ బాబులు అందరికన్నా ముందు వచ్చి విరాళాలిచ్చిన తర్వాత కూడా, ఇంకా సినీ పరిశ్రమ పెద్దలు ముందుకు రాకపోవటం దురదృష్టకరం. వెన్నెల కిశోర్ అయితే, తన ఫేస్ బుక్ పేజ్ లో శాస్త్రి గారి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ ఇచ్చీ, దాతలను  చైతన్య పరిచే కార్యక్రమం చేపట్టాడు. సినీ పరిశ్రమ లోని యంగ్ జనరేషన్ లో ఉన్న మానవత్వం సినీ పెద్దలకు ఎప్పుడొస్తుందో కదా!…?

Also Read: అమితాబ్ బచ్చన్ ను వెంటాడిన పెద్ద పులి.

(Visited 156 times, 1 visits today)