Home / సాహిత్యం / తెలుగు తోటలో పూసిన గజల్ సుమాలు

తెలుగు తోటలో పూసిన గజల్ సుమాలు

Author:

GajalSumalu

పుస్తకం: గజల్ సుమాలు
ప్రచురణ: జ్యోతిర్మయీ తెలుగు గజల్ అకాడెమీ బుక్స్
ప్రతులకు: జ్యోతిర్మయీ తెలుగు గజల్ అకాడెమీ, విశాఖ పట్నం
సెల్: 9959912541

గజల్..! గాలికి ఊగే గులాబీ బుగ్గ మీద వాలిన సీతాకోక చిలుక చేసే తియ్యని గాయమే కాదు పదునైన కత్తి మీదుగా జారిన తేనే చుక్క పెదవులపై జారి నట్టుండే విషాదానుభవాన్నీ అంతే భావతీవ్రతతో చెప్పగలిగిన ప్రక్రియ.మెత్తగా మనసుని జోకొట్టే సంగీతం లోంచి మరింత మెత్తగా మనసుని హత్తుకునే భావంతో గుండె చప్పుడు కదా గజల్.భాషతెలీదు భావమూ తెలీదు అయినా మెహదీ,జగ్జీత్ ల తో అలాకొన్ని అడుగులేసి..ఝుస్తు జూ జిస్ కి థీ అన్న ఆశా తో గొంతుకలిపి.”జిందగీ రోజ్ నయీ రంగ్ బదల్తీ క్యోం హై? అన్న ఉమ్రావ్ జాన్ ప్రశ్నతో పాటే కాస్త ఆహ్లాదవిశాదాన్ని మొహానికి పులుముకొని.. “మై శాయర్ తో నహీ లేకిన్ గజల్ కహెనె కో జీ చాహా… అని మరిన్ని క్షణాల పాటు కలవరించిన మనుషులెందరో…

మరి అదే గజల్ తెలుగులో పలకరిస్తే..!? అంతటి మృదుత్వాన్ని ఏదో ఒక గొంతుక అమ్మ భాషలో స్పర్షిస్తే? అంతకంటే ఆనందమేఉంది. సినారే తో పాటుగా పెన్నాశివరామ కృష్ణుడో,శ్రీరామోజు హరగోపాలుడో.. గజల్ ని తన ఊపిరిగానే శ్వాసించుకున్న పైడి తెరేష్ బాబో అలా కొన్ని విశాదామృత గుళికలనీ,ప్రేమ స్పర్శల రాగాలనీ కాగితం పై ఒలకబోసినప్పుడు.”జ్యోతిర్మయీమళ్ళ గజల్ గానలహరికి ఆహ్వానం” అనే ఒక ఆహ్వాన పత్రిక కనిపించినపుడో ఆనందమేస్తుంది… “ఓయ్ జగ్జీతూ…! ఇలా వచ్చి నాపక్కన కూచో తెలుగు గజలొకటి వినిపిస్తా కాసేపు జీవించి చూడు” అని చెప్పాలనిపించేటంత ఆనందం.”చౌదవీకి చాంద్ హో” అని పాడిన రఫీ కోసమూ “కంటపొంగిన వెతలవేడికి రెప్పకాలెను ఎందుకో” (శ్రీనివాస్) అని తెలుగు లో పాడివినిపించాలనిపిస్తుంది.ఐతే ఇప్పటికీ తెలుగులో వచ్చిన గజళ్ళు తక్కువేం కాదు కానీ అతితక్కువ మాత్రమే ప్రాచుర్యం పొందాయి. దీనికి కారణాలేమిటో తెలియదు.

కానీ..తెలుగు గజల్ దాని దక్కనీ పర్షియన్ ఉర్దూ మూలాలని వదిలి తెలుగుగజల్ గా మారటానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది.ఈ క్రమం లో ఎందరో గజల్ ని తెలుగు అలంకరణలతో మళ్ళీ మళ్ళీ ముస్తాబు చేసి మరింత దగ్గరగా తెచ్చే ప్రయత్నమూ చేసారు. ఇదిగో ఇప్పుడు ఫేస్ బుక్ లోనూ అలాంటి ప్రయత్నమే ఒకటి జరిగింది గజల్ గోడలకెక్కింది,భావబాహువులు చాచి తెలుగుసంగీత,సాహిత్య ప్రియులని మరోసారి హత్తుకునే ప్రయత్నం లో కేవలం గజల్ కోసమే ఒక సమూహం ఏర్పాటు చేయించింది. కొన్నేళ్ళుగా తెలుగు గజల్ రచనా,గానం లో తనకంటూ ఒక స్తానం ఉన్న జ్యోతిర్మయీ మళ్ళ, గజల్స్ మీద విపరీతమైన ప్రేమ(పిచ్చి అనుకున్నా పర్వాలేదేమొ) ఉన్న అబ్దుల్ వాహెద్ లు మొదలు పెట్టిన ఫేస్ బుక్ గ్రూపులోని అందమైన గజళ్ళ లో మనసుకు హత్తుకునే కొన్నిటిని కలిపి “గజల్ సుమాలు” అనే ఒక సంకలనం గా తెచ్చారు. బాలీ వేసిన ముఖ చిత్రం తో అందంగా ముస్తాబైన పుస్తకం ఇట్టే మనలని ఆకట్టుకుంటుంది. పెన్నా శివరామ కృష్ణ,జ్యోతిర్మయీ మళ్ళ,శ్రీనివాస్,పోతగాని కవి(పోతగాని సత్యనారాయణ),హంస గీతి.. ఇలా 25 మంది కవులు గజళ్ళు గా తమని తాము ఆవిష్కరించుకున్న ఈ తెలుగు గజల్ సంకలనం అందంగా అలంకరించబడింది.

గుండేలోనా ప్రతీ మూలా దాగి ఉన్నది తిమిరమే
నురుగుతరగల ముంచుతోంది నీవుజల్లిన వెన్నెల

(ఆర్వీఎసెస్ శ్రీనివాస్) చదవటం లోనే ఒకానొక అనుభూతికి లోను చేసే వాక్యాలు ఇక గజల్ ని పాడుతున్నప్పుడు శ్రోత గా మనం ఎన్ని వెన్నెల్లో మనసుని మంచుబిందువులు తాకిన మల్లె పువ్వులా ఆవిశ్కరించుకోవాలో తెలియని ఒక భావొద్వేగానికి లోనై పోతాం.

“నెమలీకతో మెలమెల్లగ రాసినట్లు ఉన్నదిలే
రెప్పలపై నీ స్వప్నం ఒలికిందని చెప్పనా”

(ఆర్వీఎసెస్ శ్రీనివాస్) ఆనందమూ తీయని భాదని తెస్తుందని ఇప్పుడెలా చెప్పకుండా ఉంటాం ఈ వాక్యాలను వింటున్నప్పుడు తీవ్ర భావప్రకంపన వొకటి గుండె వేగాన్ని పెంచినప్పుడు.

“రేయిపగలు ఒకవింతే నిను తలవని క్షణమొకటి ఉందంటే
కవ్విస్తూనే ఎంతగ కలహిస్తున్నావో తెలియదు నీకు”

(జ్యోతిర్మయీ మళ్ళ) అన్న షేర్ చదివుతున్నపుడు ఎవరో గుర్తొచ్చి పెదవులు వాటంతటవే విచ్చుకోలేదంటే ఇంతవరకూ మీరు కనీసం దేవున్ని కూడా ప్రేమించలేదన్నట్టే..! అందమంటే అమ్మదే ఎవరు లేరు లోకం లో.అమ్మతోటి ఈ మాటను చెబుతూంటే ఎంతహాయి” (జ్యోతిర్మయీ మళ్ళ). మొత్తం ప్రేమ,విరహ గీతాలేనా ఉన్నదీ గజల్ సుమాలు లో..? అనుకున్నప్పుడు అందమంటే గులాబీలదేనా..!? మోదుగు పూలూ ఎంతందంగా ఉంటాయి. గుప్పెడు మంటని అరచేతిలో ఉంచుకొన్నట్టు.

“కాయకష్టం చేసుకుంటూ కలుపుమొక్కలనేరుకుంటూ
చెమట పూలను తన్మయించే రైతుతిరగని చీడలున్నవి”

(పోతగాని కవి) “చెమట పువ్వు”ఔను గజల్ లో ఉన్న మహత్యమే అది అత్యద్బుతమైన సౌందర్యాన్వేష్ణ “కష్టాన్ని కొలుస్తూ రైతుముందు సాగిల పడుతున్నా,ఓ తండ్రీ నీదేహాన్ని నిలువెల్లా హత్తుకుంటున్నా” అన్నట్టు ఒక తీవ్ర మైన భావం లోకి నెట్టెస్తారు గజల్ కవులు.

“చావకుండ బతకాలని శోదించిన ఘనతెంతో/మరణానికి దగ్గరౌతు మిగిలించిన ఘనతెంతో
ఉదయించిన సూర్యునికి అస్తమయం ఉన్నది లే లోకానికి వెలుగునిచ్చి శోబించిన ఘనతెంతో”
(పోతగాని)….

 

“వేళ్ళు చేయు అల్లరులే నాకురులను అల్లుకుంటే
మోహనాల కొలనునే వెతుక్కుంటు ఉన్నాను”

(స్వర్ణలతా నాయుడు) తొమ్మిది ముత్యాలను ఒక సరంగా మార్చి స్వ్రం గా పలికిస్తే ఉండే అనుభూతి కొన్ని ఫీలింగ్స్ అంతే ఏమీ చెప్పలేం.

“నది ఒడిలో ఎండ చూడు నాట్యమాడుతున్నదీ
చెట్ల వీణ మీటి గాలి పాట పాడుతున్నదీ
నాకథలో నాపాత్రే కనబడదే ఎక్కడా నీలాగే అది కూడా ఆటలాడుతున్నదీ”

(అబ్దుల్ వాహెద్)
ఎక్కడో సూఫి తాలూకు తత్వాన్ని ఒంటబట్టించుకొని దాన్ని అలా కవిత్వం లోకి ఒంపి న కవి చెప్పే మాటల్లో తాత్విక సంగీతం సూఫీ తత్వం కనబడటం లో వింతేముందీ..?

“నన్ను నేను కలుసుకునే రోజుందని నాకు తెలుసు
నా లెక్కలు చెప్పుకుందనే బరువుందని నాకు తెలుసు”

(వాహెద్) ఒక్కొక్క మెట్టే ఎక్కించి మనలని ఒకానొక అంథ:శ్శోధన లో పడేసే ఈ వాక్యాలు గజల్ చదువుతున్నంత సేపే కాదు మళ్ళీ మళ్ళీ మనలని వెంటడు తూంటూనే ఉంతాయి.

“చెలిమి బాట సవ్యమైతే అది దివ్యమై తీరుతుంది
చెలమ ఊట సవ్యమైతే అది భవ్యమై పోతుందీ” 

(యెస్సార్.కట్టా)
ఒకరా ఇద్దరా రోహిణీ ఉయ్యాల, శ్రీని వాస్ ఈడూరి, మాలా చిదానంద్, ఇందిరా బైరీ, రామ్మోహన్ రావు తుమ్మూరి, శ్యామలా గడ్డం ఇలా మొత్తం ఇరవై అయిదు మంది కవులు రెండువందలా ఇరవై అయిదు గజళ్ళు ఒక్కొగజల్ ఒక్కో రకమైన భావం అచ్చంగా మనమో రంగుల తోటలో తిరుగుతున్నట్టు ఏపూవు పరిమళం గొప్పదీ అంటే ఏం చెప్పగలం? స్థలాభావం వల్ల కవులనీ ఉద్దేశపూర్వకంగానే గజళ్ళనీ నేను చెప్పటం లేదు (గజల్ ల లోని షేర్ లని చూడటం కంటే మొత్తం గజల్ ని ఆస్వాదించటం అనే అనుభూతికి పాఠకులని దూరం చేయ దలచుకోలేదు).

(Visited 867 times, 1 visits today)