Home / సాహిత్యం / గోపీ అనబడు ఒక బాలుడూ-అతని కవిత్వమూ

గోపీ అనబడు ఒక బాలుడూ-అతని కవిత్వమూ

Author:

Satya Gopi

ఒక్కొక్క మనిషి మన జీవితం లో లోపించినపుడు కొద్దిగా శూన్యం ఏర్పడుతుంది మరొకరితో ఆశూన్యం నింపభడుతుండా అంటే…! ఎమో మరి చెప్పలేం కొన్ని సమయాలంతే ఎప్పటికీ శూన్యించబడి అలా మిగిలిపోతాయ్… గాలి కూడా నిషేదించ బడ్డ సమయాలవి. సత్యా గోపీ అనే ఈ కవి మామూలు మనిషి కవిగా ఉన్నప్పుడెంత గొప్పగా ఎదిగి ఉంటాడో చెప్పినట్టనిపిస్తుందొక్కోసారి. కవిసంగమం లో తన కవితని ఉంచినపుడలా కొద్దిమందే అతన్ని స్పృషిస్తారు ఆ మహా శూన్యపు దారిలో ఇంకొంత ఖాళీని.., తమ మన్సులో ఎక్కడో ఉన్న ఆ ఖాళీ సందర్బాన్నీ వెతుక్కొని అక్కడ కాసేపు సేదదీరి.. కవీ..! కదిలిపోతిని కరిగిపోతిననుకుంటూటూ ఆ అక్షరాలని మరోసారి హత్తుకుంటారు. కవిత్వం అనేది ఒకభాషా లేదా ఒక లిపికి సంబందించనిభావం అనిచెప్పే ఒకానొక ప్రకటనలా… కనిపిస్తుంది.

ఇద్దరికీ మధ్య రహస్యాలేమీ లేవు కానీ,దూరమైపోతుంటాం కొంతసేపు
ఒకరికొకరం మార్చుకుంటూ
ఆరోజుకి నిద్దురపోతాం కావాల్సినన్నిసార్లు తిరుగుతూ

నిజజీవితం లో ఈ భౌతిక శరీరపు తాత్వికతని చూపి కవిత్వం కేవలం ఊహావాదమెలా ఔతుందీ అనిపించేలా రాసినపుడు.కవి మామూలు మనిషికంటే ఉన్నతుడెందుకౌతాడో తెలుస్తుంది.మామూలుగానే ఉండే మనిషి కవిత్వం రాసేటపుడు మాత్రం తన స్థాయికంటే కొన్ని వందల రెట్లు ఎదిగిపోయుంటాడు.ఎక్కడినుంచొస్తుందింత ఆలోచనా,పరిపక్వతా..!?

సాయంత్రాల మీదనుంచి జారిపడిన
రాత్రుళ్లు నల్లని దుప్పటితో
కప్పేస్తుంటే
వెతుక్కోటానికి స్పర్శలే మిగులుతాయప్పుడు

సత్యా కవిత్వం అద్బుతం అనిపించక పోవచ్చుగానీ…! నల్లగా చీకటితో నిండిపోవాల్సిన ఒక రాత్రి కొద్దిగా వెన్నెలని కుమ్మరిస్తూ మెత్తని చీకటి స్పర్షని అందిస్తుంది కదా…అదే ఆ మార్మికానుభవానుభూతిని మాత్రం పొందుతాం….

మనిషంటే మనిషే
మట్టిలాంటి మనిషే
పొడిపొడిగా రాలిపోయే విడివిడిగా జారిపోయే
వున్నచోటే, ఒక్కచొటే ఉమ్మడిగా కదుల్తుండే
ద్రవ్యరాశిలాంటి మనిషే…

ఒక్కో కవితా ఇతన్ని చదవలేకపోయిన పాఠకుడిని మరోసారి చదివి ఆ లోపాన్ని సరిచేసుకోవాలనిపిస్తుంది… సత్యా గోపీ అనే సాధారణ మైన మనిషిని కలవకపోతే పోయేదేం లేదు కానీ, అతని కవిత్వాన్ని చదవలేక పోతే మాత్రం ఎక్కడో కొద్ది శూన్యం మిగిలినట్టే అనిపించింది నాకు….

ఆమె ఎందుకు వెళ్ళిపోయింది
దృశ్యం మీదనుంచి దృశ్యం మీదకు చూపు వెళ్ళిపోయినంత సునాయాసంగా
నిన్నటిలోంచి ఇవాళ్టిలోకి వచ్చినంత సులభంగా వెళ్ళిపోయింది….

ఒక సారి ఈ కవిత చదివి చూడండి ఇంకాస్త కవిత్వం కావాలనిపిస్తే http://gopisatya.blogspot.in/ ఈ లింక్ ని పలకరించండి. సత్యా గోపీ ఒక నిశ్శబ్దపు నవ్వులా కనిపిస్తాడు.. హత్తుకొండి అతన్ని ఒక సారి స్పర్షించండి.. అలా కొద్దిసేపు కవిత్వం లో ఉండిపోండి…

//ఆమె ఎందుకు వెళ్ళిపోయింది//

ఆమెనొకసారి మళ్ళీ ఒంపుకున్నపుడు
ప్రవహించడం నావంతుగా జరుగుతూంటుందెపుడూ
1
నిర్లిప్తంగా ఒదిగిపోయే జ్ఞాపకం కదామె !
2
వచ్చినా వెళ్ళినా భావోద్వేగాల కెరటమొకటి
మేఘాలదాకా పరుచుకున్నట్టుగానో
ఊపిరాగిన క్షణమొకటి హఠాత్తుగా ఉబుకినట్టుగానో
దేహానికి పచ్చితిత్తొకటి బిగించినట్టుగానో
3
లోపలివైపెక్కడో ఖాళీరహదారిమీద దిగులొకటి కనపడుతూ వుంటుందెందుకో…
4
దుఃఖాల్లోకి నవ్వులు ప్రసరించినంత ధీర్ఘంగా వచ్చినపుడు
మాటల్లోని భావం ప్రయాణించినంత సుధీర్ఘంగా వచ్చినపుడు
కలిసి నడిచిన సమయాన్నంతా సునిశితంగా దాచుకోలేదెందుకనో..
పగలుగానో..రాత్రిగానో..ఋతువులాగానో
నిష్క్రమణ జరిగిపోతుంది
5
ఆమె ఎందుకు వెళ్ళిపోయింది
దృశ్యం మీదనుంచి దృశ్యం మీదకు చూపు వెళ్ళిపోయినంత సునాయాసంగా
నిన్నటిలోంచి ఇవాళ్టిలోకి వచ్చినంత సులభంగా వెళ్ళిపోయింది
ఆమె ఎందుకు వెళ్ళిపోయిందనేదే పరమావధి
6
వెళ్ళిపోవడం ఒక శూన్యం
శూన్యంలోంచి శూన్యంలోకి వెళ్ళిన చప్పుడు ఆమెది…

— సత్యా గోపి.

(Visited 250 times, 1 visits today)