Home / Inspiring Stories / ఈ గ్రామంలో మాంసం తినరు. మద్యం ముట్టరు…!

ఈ గ్రామంలో మాంసం తినరు. మద్యం ముట్టరు…!

Author:

మనలో దాదాపు అందరూ పండగొచ్చినా.. పబ్బం వచ్చినా… ఈ రోజుల్లో ఎక్కడైనా మాంసం, మందుకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. మాములు రోజుల్లోనే ప్రతి ఇంట్లో కనీసం గుడ్డు రూపంలో అయిన మాసం ఆరగిస్తుంటాం. ఇంటికి అతిధులు వచ్చినా మాంసానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇక పండగ అన్నాక చాలా చోట్ల ఒక వర్గం ఇంకో వర్గం వారితో గొడవలు పెట్టుకొని, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం మనం సాధారణంగా చూస్తుంటాం.

కాని మనం ఇప్పుడు తెలుసుకోబోయే గ్రామంలో ఊరు ఊరంతా మాంసం కాదు కదా…! కనీసం గుడ్డు కూడా తినరు. ఊరి అల్లుడైనా, కోడలైనా ఒక్కటే కట్టుబాటు. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డూ ఉండదు, హత్యలు, అత్యాచారాల చరిత్రే లేదు. ‘ఉపాధి’ కోసం వలస వెళ్ళాల్సిన ఊసే తెలియదు.

ఊరిలో జాతర అయినా, వివాహ కార్యక్రమాలైనా అంతా అంగరంగవైభవం! ఊరంతా ఒక్కటై… అద్భుతంగా వేడుకలు నిర్వహిస్తారు. కానీ, మాంసం తినరు. మద్యం ముట్టరు! వందల ఏళ్ల నుంచి వారసత్వంగా వస్తున్న ఈ క్రమ శిక్షణను, కట్టుబాటును కాపాడుకుంటూ వస్తున్నారు. నేరాలు, మోసాలు మరియు దారుణాలకు ఆమడ దూరం, సమైక్య జీవనం వారి నైజం. ఆ రాజులదేవుడి ఆశీస్సులే తమను నడిపిస్తున్నాయన్నది ఊరి వారి విశ్వాసం. నేటి యువత కూడా ఇదే సంప్రదాయాన్ని గౌరవిస్తోంది. గాంధీజీ కలల స్వప్నంగా ఊరు విరాజిల్లుతోంది. ఇంతకీ ఎక్కడా…? ఏంటా చరిత్ర..? అనే కదా… మీ ప్రశ్న?.

This village bans alcohol and meat

అది… అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని అడిగుప్ప గ్రామం. దాదాపు 500 ఏళ్ల క్రితం అచ్చువళ్లి కాటనాయక్‌ అనే పాలేగార్‌ రాజు అడిగుప్ప గ్రామాన్ని పాలించేవారు. చిత్రదుర్గాన్ని పాలించే బుడిగే చిన్నయ్య అనే రాజు… అడిగుప్ప మీద అర్ధరాత్రి దండయాత్ర చేసేందుకు కుట్ర పన్నుతాడు. గ్రామంలోని సొమ్ము, బంగారం  దోచుకోవాలని చూస్తాడు. దీనికోసం గ్రామంలో ఉన్న వారందరికీ మద్యాన్ని ఎరగా వేసి… కోడి మాంసాన్ని తినిపించి… మత్తులో మునిగేలా చేస్తాడు. రాజు అచ్చువళ్లి కాటనాయక్‌ రాజ్యంలో లేనప్పుడు బుడిగే చిన్నయ్య ఈ ప్రయత్నం చేస్తాడు. కానీ, గ్రామ ప్రజల ఆరాధ్యదైవమైన రాజులదేవుడు… అచ్చువళ్లి కాటనాయక్‌కు కలలో వచ్చి రాజ్యంలో పరిస్థితి తెలియజేస్తారు.

అప్రమత్తమైన రాజు వెంటనే రాజ్యంలోకి చేరుకుని బుడిగే చిన్నయ్యను, అతడి సైన్యాన్ని హతమార్చుతాడు. అలాంటి సంఘటన పునరావృతం కాకూడదని… గ్రామంలో ఉన్నవారందరినీ రాజులదేవుడి వద్దకు పిలిపిస్తాడు. జీవితంలో కోడి మాంసం, మద్యం ముట్టకూడదని దేవుడి వద్ద ప్రమాణం చేయిస్తాడు. అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలంతా గ్రామ కట్టుబాటు ప్రకారం కోడిమాంసం తినరు, మద్యం ముట్టరు. అంతేకాదూ, రాజులదేవుడి జ్ఞాపకార్థం ఆ గ్రామంలో రాజప్ప, రాజమ్మ, రాజయ్య, రాజు అనే పేర్లను ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు.

గ్రామ పెద్దల సమక్షంలోనే పరిష్కారం:

అడిగుప్ప గ్రామంలో ఇప్పటివరకూ ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాలేదు. అత్యాచారాలు, హత్యా ఉదంతాలకు తావే లేదక్కడ. గ్రామ కట్టుబాటును అందరూ గౌరవించాల్సిందే. చిన్నపాటి గొడవలు తలెత్తినా పోలీస్‌ స్టేషన్‌ దాకా విషయాన్ని తీసుకెళ్లకుండా పెద్దలే రాజీ కుదుర్చుతారు. ఎవరైనా గ్రామ కట్టుబాటును ధిక్కరించే ప్రయత్నం చేస్తే గ్రామ ప్రజలంతా కలిసి గ్రామ బహిష్కరణ చేస్తారు. ఐదో తరగతి వరకూ ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో… గ్రామ ఆచారం ప్రకారం కోడిగుడ్డును పెట్టనివ్వరు. దాని స్థానంలో వారంలో రెండుసార్లు అరటిపళ్లు సరఫరా చేస్తున్నారు. గ్రామ ఆచారానికి వ్యతిరేకంగా కోడిగుడ్డు సరఫరా చేయడం కుదరదని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు.

కష్టనష్టాల్లోనూ… కలిసికట్టుగా:

కర్ణాటక సరిహద్దులో ఉన్న అడిగుప్ప గ్రామంలో ఇప్పటివరకూ పొట్టకూటి కోసం ఒక్కరు కూడా దూర ప్రాంతాలకు వలస వెళ్లిన సందర్భం లేదు. గుమ్మఘట్ట మండలంలో అత్యధిక వలసలు ఉంటాయని ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నా… గుమ్మఘట్ట మండలానికే చెందిన అడిగుప్ప గ్రామం మాత్రం ఇందుకు మినహాయింపు. ఊర్లో ఉపాధి లేకపోతే, చుట్టుపక్కల గ్రామాల్లో వెతుక్కుని రోజువారీ పనులకు వెళ్లే అలవాటున్న ఆ గ్రామం… కష్ట-నష్టం ఏదైనా గ్రామమంతా ఒక కుటుంబంలాగ ఒకేచోట కలిసికట్టుగా అనుభవిస్తుంది.

Must Read: ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి.

Must Read: శివపార్వతుల వివాహం జరిగింది ఇక్కడే !, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలే ఉండవు.

(Visited 8,723 times, 1 visits today)