Home / Inspiring Stories / నిజాయితీకి నిలువుటద్దం ఆకురాతి పల్లవి ఐఎఎస్.

నిజాయితీకి నిలువుటద్దం ఆకురాతి పల్లవి ఐఎఎస్.

Author:

ఆకురాతి పల్లవి. కర్ణాటకలో ఈ పేరు ఓ సంచలనం. నిజాయితీగల ఐఎఎస్ ఆఫీసర్. విక్రమార్కుడులో ప్రకాశ్ రాజ్ భాషలో చెప్పాలంటే.. “2009 బ్యాచ్. కర్ణాటక కేడర్. 6 సంవత్సరాల సర్వీస్. 9 ట్రాన్స్ఫర్లు. అంటే కెరీర్లో ఎక్కడా రాజీ పడలేదన్నమాట!”

అవును.. నిజంగానే పల్లవి రాజీపడకుండా బతికింది. అలానే ఉద్యోగం చేసింది. చేస్తోంది. ఈ 33 ఏళ్ల యువతి అంటే కర్ణాటకలోని నాయకులకు మంట. భయం. చిరాకు. ఒకటే కారణం. ఆమె ఎక్కడకు వస్తే అక్కడ అవినీతిపరులు హడలెత్తాల్సిందే. పనిచేయని ఉద్యోగులు విలవిల్లాడాల్సిందే. కొందరు మొండివాళ్లుంటారు. రాజకీయ నాయకులకు లొంగరు. తమ పని తాము చేసుకుపోవడమే కాదు, తమ పరిధిలో పని కూడా తమ కనుసన్నల్లోనే చేయిస్తుంటారు. పల్లవి కూడా ఆ బాపతే. ఆఫీసర్లు బుద్ధిగా పనిచేసుకోకుండా ఇంత కష్టపడిపోతే నాయకులు సహించలేరు కదా. అందుకే ఇష్టం వచ్చినన్ని సార్లు ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఆమెమాత్రం మారలేదు. ఎక్కడా తగ్గలేదు.

పల్లవి పనితీరు గురించి చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. ఆవిడ ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ ఘటన జరిగింది. కర్ణాటకలో ఇంటర్ పరీక్షలంటే పిచ్చ లైట్. ఇంటర్ పేపర్లు లీక్ అవడం అక్కడ మామూలు విషయం. పల్లవి బోర్డు డైరెక్టర్ పదవిలో ఉన్నప్పుడు ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆమె వాట్సప్‌కి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఆరోజు జరగాల్సిన కెమిస్ట్రీ పేపర్ ఉంది. ఇంటర్ ఎగ్జామ్ రాయాల్సిన ఓ కుర్రాడు పంపిన మెసేజ్ అది. వాట్సప్ చూసి లైట్ తీసుకోలేదు. వెంటనే పరీక్ష రద్దు చేశారు. మళ్లీ ఎగ్జామ్ పెట్టారు. కామెడీ ఏంటంటే, రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయింది. అక్కడ ఎగ్జామ్ మాఫియా ఎంత బలంగా ఉందో, ఇంటర్ బోర్డు వాళ్లు ఆ మాఫియాకు ఏ రేంజ్‌లో సహకరిస్తున్నారో అప్పుడు అర్థమైంది పల్లవికి. వాళ్లే మొండి అయితే పల్లవి జగమొండి. మళ్లీ రెండో ఎగ్జామ్ కూడా రద్దు చేసారు. దీంతో మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. అయినా పల్లవి తగ్గలేదు. కేసు నమోదు చేసి, విచారణ సిఐడికి అప్పగించారు. విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ పేపర్ లీకేజ్ ముఠాలు వందల కోట్ల టర్నోవర్ తో వ్యాపారాలు చేస్తున్నాయి. పల్లవి పుణ్యమా అని వాళ్ల గుట్టు రట్టయింది.

ఎండోమెంట్ కమీషనర్‌గా పల్లవి విజయాలు కూడా చాలా ఫేమస్. తన హయాంలో దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన దేవాదాయ ఆస్తులను కాపాడారు. రాజకీయ నాయకులు ఆక్రమించుకున్న కోట్లాది రూపాయల దేవాదాయ భవనాలు విడిపించారు. బెంగళూరు సిటీ మధ్యలో అసలు గవర్నమెంటు భూమి అని ఎవరికీ తెలియనంతగా ఆక్రమణలు జరిగిపోయాయి. వాటినీ కూడా వదల్లేదీమె. చివరకు ఖాళీ స్థలాలు కనిపస్తే ఎక్కడ ఆక్రమిస్తారో అని, ఖాళీ దేవాలయ స్థలాల్లో ఫంక్షన్ హాల్స్ కట్టించేసి, వాటిని అద్దెకు ఇచ్చే ఏర్పాటు చేశారు. దీంతో సర్కారు స్థలానికి రక్షణ-ఆదాయం రెండూ వస్తున్నాయి. పల్లవి పనితీరు గురించి చెప్పడానిక ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.

సకలేశ్ పూర్ లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు ఓ ముస్లిం మహిళ పొలానికి వెళ్లే దారిని ఓ నాయకుడు ఆక్రమించుకుంటే, పల్లవి ఆ భూమి విడిపించారు. ఆ తరువాత పల్లవి గుల్బర్గ ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోతుంటే ఆ మహిళ వచ్చి పల్లవి చేతులు పట్టుకుని ఏడ్చేసిందట. అది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంటారు పల్లవి.

Akuraathi Pallavi IAS

తెలుగమ్మాయి:

తెలుగు మీడియంలో ఐఎఎస్ పాస్ అయిన మొదటి మహిళ ఆకురాతి పల్లవే. గుంటూరు జిల్లాకు చెందిన పల్లవి తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తల్లి గృహిణి. సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించింది పల్లవి. పల్లవి మూడుసార్లు సివిల్స్ పాసయింది. తక్కువ ర్యాంక్ వల్ల వేరే సర్వీసులు వచ్చాయి. కానీ ఈమెకు ఐఎఎస్ అంటే ఇష్టం. ఆఖరికి ఐపిఎస్ వచ్చినా తీసుకోలేదు. కచ్చితంగా ఐఎస్ మాత్రమే కావాలని పట్టుదలతో మూడోసారి ర్యాంక్ కొట్టింది.

ఐఎఎస్ ప్రిపరేషన్‌కి పల్లవికి 8 సంవత్సరాలు పట్టింది. దానికి ప్రత్యేక కారణం ఉంది. చిన్నప్పటి నుంచీ తెలుగు మీడియంలోనే చదివింది. సివిల్స్ కోసం చాలా కష్టపడింది. ఇంగ్లీష్ రాకపోవడంతో ఓ దశలో దెబ్బతిని, మళ్లీ పట్టుదలగా ఇంగ్లీష్ నేర్చుకుంది. తెలుగు మీడియంలో, గవర్నమెంటు స్కూళ్లలో చదివినా ఐఎఎస్ సాధించడానికి ఇబ్బంది కాదని నిరూపించడానికి పల్లవి ఓ ఉదాహరణ. తెలుగులో సివిల్స్ రాసినా, ఇంటర్వ్యూలో ఇబ్బంది అయింది. ఇంటర్య్యూ చేసే వాళ్లకు, అభ్యర్థికీ మధ్య ఉండే తెలుగు అనువాదకులతో సమస్య వచ్చింది. దానికితోడు తెలుగులో సిలబస్ దొరక్క కష్టపడాల్సి వచ్చింది. ఇంగ్లీష్‌లో మెటీరియల్ చదివి, వాటిని ట్రాన్సిలేట్ చేసుకుని.. ఇలా ఎంతో కష్టపడి సివిల్స్ కొట్టింది.

పల్లవికి చాలా కళల్లో ప్రావీణ్యం ఉంది.

మామూలుగా ఐఎఎస్ ఆఫీసర్ల గురించి బయటకు చాలా తక్కువ విషయాలు తెలుస్తాయి. పుస్తకాల పురుగుల్లా ఉంటేనే ఐఎఎస్ అవుతారని చాలా మంది అనుకుంటారు. కానీ పల్లవిలో మాత్రం చాలా కళలు ఉన్నాయి. ఆమె ఒక కూచిపూడి డాన్సర్. తెలుగులో కవితలు రాస్తుంటారు. వాటిని ఇంగ్లీష్ అనువాదాలతో తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తారు. శ్లోకాలు రాగయుక్తంగా పాడతారు. పెయింటింగ్ పల్లవి హాబీ. ఇంటి ముందు ముగ్గులు పెట్టడం, అరచేతిలో గోరింటాకు (మైదాకు/మెహందీ) పెట్టడం, బట్టలపై డిజైన్లు దిద్దడం (ఎంబ్రాయిడరీ)లో పల్లవి దిట్ట. ఐఎఎస్‌ స్థాయికి వెళ్లిన అమ్మాయిలు ఇన్ని విషయాల్లో బెస్ట్‌గా ఉండడం, వాటిని ప్రాక్టీస్ చేయడం అరుదైన విషయమే.

పల్లెటూళ్లలో పర్యటనలకు వెళ్ళినప్పుడు ఐఎఎస్ అంటే ఏంటో తెలియని ముసలమ్మలు కూడా పల్లవిని బాగా అభిమానిస్తారట. పల్లవి పరిపాలన గురించి వాళ్లకేమీ తెలియదు. కానీ ఆమెను అభిమానించడానిని ఇంకో కారణం ఉంది. అది పల్లవి డ్రెస్సింగ్. అవును.. ఆమె చీర కట్టుకునే తీరు. జడలో పువ్వులు, బొట్టు. కర్ణాటకలోని ఓ పెద్దావిడ పల్లవికి ఓ ముద్దు పేరు పెట్టింది. కణమ్మ అని ముద్దుగా పిలుస్తుంది. కణమ్మ అంటే బంగారు బొమ్మ అనే అర్థం చెప్పుకోవచ్చు.

సేవ

ఉద్యోగం పెర్ఫెక్ట్ గా చేస్తోంది. అదే పదివేలు అనుకుంటే.. అంతకుమించిన సేవ కూడా చేస్తోంది. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా శిక్షణ ఇస్తుంది. పేద అమ్మాయిలకు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి కోచింగ్ ఇస్తోంది. పల్లవి పెళ్లి చాలా సింపిల్‌గా ఓ గుడిలో సంప్రదాయం ప్రకారం జరిగింది. గుడిలో పెళ్లి చేసుకోవడం ద్వారా మిగిలిన డబ్బుతో ఇద్దరు పేద పిల్లలను చదివిస్తున్నారు.

పల్లవి ఇంటిపేరు ఆకురాతి. తన హృదయం చిగురుటాకు లాంటిదనీ.. కానీ తన ఆలోచన, బుద్ధి మాత్రం వజ్రం అంత కఠినమనీ తన గురించి చెబుతారు పల్లవి.

Must Read: ఏటీఎం నుండి నకిలీ నోట్లు వస్తే ఏం చెయ్యాలో తెలుసుకోండి…!

Source: Facebook

(Visited 2,312 times, 1 visits today)