Home / సాహిత్యం / కోడూరి విజయకుమార్ కవిత

కోడూరి విజయకుమార్ కవిత

Author:

Koduri Vijay Kumar

R E C U S E D

తప్పించుకు తిరుగుతావు లోకం నుండి
లేక, లోకమే నీ నుండి …..
కొన్ని మాటలు లుంగలు చుట్టుకు పోయి
ఎవరితోనూ పంచుకోలేక గొంతు దగ్గరే ఆగిపోతాయి
లేక, గొంతు లోపల చిక్కుకున్న మాటల్ని
వినే తీరిక ఏదీ ఎవరికీ మిగలక …..
ఏదో పంచుకోవాలని ఆశపడి
మిత్రుడొకరికి కాల్ చేసి భంగపడతావు
ఆ తరువాతెపుడో మిత్రుడి కాల్ వొచ్చినా
‘ పంచుకోవడానికి బాధలు లేకుండా
ఈ భూమ్మీద మిగిలినదెవరని’ వొదిలేస్తావు
ముఖ పుస్తకం తెరలు తెరలుగా
కబుర్లు చెబుతుంది ఎప్పటిలాగే
కాసిని కబుర్లని దోసిట్లోకి తీసుకుని
పాలిపోయిన నీ ముఖాన్ని పరిశుభ్రం చేసుకుని
‘స్టేటస్ ‘ పై తగిలించ మనసొప్పదు …..
భోరున వర్షం కురిసిన కాళరాత్రి
నగరపు వరదల్లో ఎక్కడో చిక్కుకుపోయినపుడు
నీ భార్యా పిల్లలే నీకై ఆందోళనగా ఎదురుచూస్తారు
బహుశా, నీవూ, నేనూ, అతడూ, ఆమే …
ఎవరెవరు ఏ వరదల్లో
ఎక్కడెక్కడో చిక్కుబడిపోయినా
మనకోసం ఎదురు చూసేది మన ఇల్లే కదా
మరి, మనదైన ఇల్లు కూడా లేకపోతేనో ?!
   — కోడూరి విజయకుమార్

(Visited 170 times, 1 visits today)