Home / Inspiring Stories / చెత్త ఏరుకునే మహిళ.. కోట్ల టర్నోవర్ సంస్థకు యజమాని!

చెత్త ఏరుకునే మహిళ.. కోట్ల టర్నోవర్ సంస్థకు యజమాని!

Author:

Paper Picker at streets now earning 1cr turnover manjula waghela

కృషి ఉంటే మనుషులు రుషులౌతారన్న మాటలను ఆమె అక్షరాలా నిజం చేసింది. ఆత్మ విశ్వాసంతో సాధించలేనిది లేదన్న సూత్రాన్నీ ఆచరణలో పెట్టింది… ఒకప్పుడు ఐదు రూపాయల సంపాదనకోసం అహ్మదాబాద్ వీధుల్లో చెత్తను ఏరుకుంది. నేడు సంవత్సరానికి కోటి రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీని నిర్వహించే స్థాయికి చేరి… తనవంటి ఎందరికో ఆసరా కల్పిస్తోంది.

అహ్మదాబాద్ కు చెందిన అరవై ఏళ్ళ మంజులా వాఘేలా.. కోటిరూపాయల టర్నోవర్ తో నడుస్తున్న క్లీనర్స్ కో ఆపరేటివ్ సంస్థ  యజమానిగా మారింది.  సౌందర్య సఫాయీ ఉత్కర్ష్ మహిళా సేవా సహకారి మండలి లిమిటెడ్ పేరున ప్రస్తుతం అహ్మదాబాద్ లోని 45 సంస్థలకు ఆమె వర్కర్లను సప్లై చేయడంతోపాటు… క్లీనింగ్, మరియు హౌస్ కీపింగ్ సేవలు అందిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ.. క్లీనర్స్ కో ఆపరేటివ్ సంస్థకు భారత దేశంలో మొట్ట మొదటి అధికారిక ఖాతాదారిగా మారడం ఆమెకు ఎంతగానో కలసి వచ్చింది.  అక్కడి నుంచి మంజులా వెనక్కు తిరిగి చూడలేదు. ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా ఒక్కో మెట్టూ ఎగబాకుతూ నేడు 45 సంస్థలకు నాలుగు వందల మంది సభ్యులతో తమ సేవలు అందిస్తూ.. కోటి రూపాయల టర్నోవర్ కు చేరుకుంది.ఆ తర్వాత ప్రారంభమైన ఫిజికల్ రీసెర్చ్ లేబొరెటరీ ( పీఆర్ ఎల్ సంస్థ) వాఘేలా సంస్థలోని 15 మంది మహిళలను పనికోసం నియమించుకుంది. తమ సంస్థ నలభైమంది మహిళలతో కొనాసాగుతున్నసమయంలో ఒక్క పీఆర్ ఎల్ సంస్థ 15 మందిని నియమించుకుందని… ఇప్పుడు తమ సంస్థలో నాలుగు వందల మంది సభ్యులున్నారని వాఘేలా చెప్తోంది.

ఒకప్పడు చెత్త ఏరుకునే తనవంటి మహిళలను ఇప్పుడు తనద్వారా పలు సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచే వర్కర్లు గా చేర్పించి సేవలు అందిస్తోంది. ఆయా సంస్థల్లో రహదారులు ఊడ్వడం, వాక్యూమ్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, కార్పెట్లను శుభ్రపరిచే మెషీన్లను నడపడం వంటి పనులను వారంతా నిర్వహిస్తున్నట్లు చెప్తున్న వాఘేలా … నిరాశా నిస్పృహలతో కాలం వెళ్ళదీసే పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

Must Read:2015 అసహ్యకరమైన వ్యక్తి అరవింద్ కేజ్రివాల్.

(Visited 2,897 times, 1 visits today)