Home / Inspiring Stories / హీరో ఆఫ్ ఇండియా-ఆరుబుల్లెట్లు దిగినా ఆగని పోరాటం

హీరో ఆఫ్ ఇండియా-ఆరుబుల్లెట్లు దిగినా ఆగని పోరాటం

Author:

sailesh guar took six bullets to stop terrorists

ఒకటీ రెండూ కాదు వరుసగా ఆరు బుల్లెట్లు కడుపులో దిగబడ్డాయి… కొద్దిక్షణాల ముందు అతని కళ్ళముందే ఒక వీరుడి మరణం అతని ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేదు. మనసులో మెదిలేది ఒకే ఒక విశయం “ఉగ్రవాదులు ఒక్క అడుగు కూడా ముందుకు రాకూడదు” ఆరుకాదు మరో పది బుల్లెట్లు తన దేహాన్ని చిద్రం చేసినా తను మాత్రం పోరాడటం ఆపకూడదు.

జనవరి 2వ తేదీ, తెల్లవారుజాము 3 గంటల సమయంలో పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోకి చేరిన ఉగ్రవాదులు మెకానికల్‌ ట్రాన్స్ పోర్ట్ బేస్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాయుస్థావరంలో యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉన్న ప్రాంతం లోకి వెళ్ళి అక్కడ విద్వంసం సృష్టించాలి. అయితే వారు మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ బేస్ దగ్గర ఉన్నప్పుడే. వారిని మట్టుబెట్టేందుకు 12 మంది గరుడ కమెండోలు రంగంలోకి దిగారు. ముందుగా ఇద్దరిద్దరు మూడు బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులను కదలకుండా నిలువరించారు. మరో 3 బృందాలు వెనక నుంచి కాల్పులు ప్రారంభించాయి. ముందు వరుసలో ఉన్న కమెండో గురుసేవక్‌ సింగ్‌, ఓ వింగ్‌ కమాండర్ ముందుగా దాడి ప్రారంభించారు. వారి వెనుక నుంచి కమెండోలు శైలేష్ గౌర్, కేతల్‌లు కాల్పులు ప్రారంభించారు. గురుసేవక్ దేహంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. అయినా కాల్పులు ఆపలేదు. చివరికి ఆయన నేలకొరగడంతో శైలేష్, కేతల్‌లు తమ దాడికొనసాగిస్తూ ముందుకు వెళ్ళారు. అదేక్రమం లో శైలేష్ పొత్తికడుపు ప్రాంతం లో ఆరు బుల్లెట్లు దిగబడ్డాయి. అంత బాధలోను తీవ్ర రక్తస్రావం అవుతున్నపటికీ శైలేష్ గౌర్ ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ వారిని అక్కడే నిలువరించగలిగాడు. ఈలోగా అక్కడికి అదనపు భద్రతాదళాలు వీరికి సహాయంగా చేరుకున్నాయి. దీంతో బిత్తరపోయిన ఉగ్రవాదులు మెకానికల్ ట్రాన్సుపోర్ట్ ఏరియా నుంచి వెనక్కి పారిపోయారు. ఈ వీరోచిత ఎదురుదాడి కారణంగానే ఉగ్రవాదులు వాయుస్థావరంలో యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉన్న కీలక ప్రాంతంలో అడుగు పెట్టలేకపోయారు. వాళ్లు అక్కడికి వెళ్లి ఉంటే భారీ విధ్వంసం జరిగి ఉండేది…

శైలేష్ ని మిలటరీ హాస్పిటల్ కి తరలించి ఆపరెషన్ లో అతని శరీరం లో దిగబడిన ఆరు తూటాలనూ బయటికి తీసిన వైధ్యులు అతని ప్రాణాలపై అప్పుడే ఏమీ చెప్పలేం అన్నారు. అయితే శైలేష్ నెమ్మదిగా కోలుకుంటున్నాడని సమాచారం. ఒక్కొక్క వీరుడూ ఒక హిమాలయ శిఖరమై నిలుచున్నంత కాలమూ భారతదేశం గర్వంగా తలెగరేసి నిలబడుతూనే ఉంటుంది…

Must Read:అతని తల్లి మరణం అతన్ని మార్చేసింది.

(Visited 656 times, 1 visits today)