Home / సాహిత్యం / ఒక ప్రయాణానంతర పలవరింత – రేపటి జ్ఞాపకం

ఒక ప్రయాణానంతర పలవరింత – రేపటి జ్ఞాపకం

Author:

Srinivas vasudev poetry

కొన్ని సమయాలంతే.., కొన్ని ప్రదేశాలంతే.. ఒక డెజావూ లా మనల్ని కదిలిస్తాయి. ఇప్పుడు చూసిన చిరునవ్వు కొత్తది కాదు, ఈ ప్రదేశమూ కొత్తది కాది, ఇదంతా నాకోసమే మళ్ళీ మళ్ళీ జరుగుతోంది అనిపించేలా… మనలని ఆయా సందర్భానికీ, ఆ ప్రదేశానికీ ఒక అతిథిలా కాక పురాతన ఙ్ఞాప కాన్ని తడుముకున్నట్టు ఒక పరిచిత స్పర్శతో హత్తుకుంటాయి…

ఒంగోలు తో తన అనుభవాన్ని… కవి “ఆకు పాట” శ్రీనివాస్ వాసుదేవ్ గారు ఇలా పంచుకున్నారు. మనకు మనమే అజనబీ లమై ఒక్కో క్షణం వెనకా అతికించిన మొఖాల్లో మనమెక్కడున్నామో వెతుక్కునే ఒకానొక అయోమయావస్థా కాలం లో ఇప్పుడొక.. మనసు పాట ఎప్పుడో వినే ఉంటాం, కానీ ఎప్పుడు..!? మనకోసమే మరో మనిషొకడుంటాడనీ నీకోసం ఒక చిరునవ్వునీ, ఒక ఆప్యాయతాలింగణాన్నీ దాచి ఉంచి ఆప్యాంగా నీదగ్గరికి వస్తున్నాడనీ మనకు తెలిసో తెలియదో తెలీదు.. మరి..

నిన్నా నేడూ రేపూ కాలం మారిపోదు కాలం గుండా ప్రయాణిస్తాం అంతే మళ్ళీ మళ్ళీ మళ్ళీ కనిపించే మనుషులున్నప్పుడు రోజుకంటూ ఒక ప్రత్యేక గుర్తింపేముంది???? ఒక కవిత మిమ్మల్నీ ఒక సారి ఒంగోలు పట్టణ వీథులల్లో అడుగులేయిస్తుంది. ఈ కవితో కలిసి మనలనీ ఒక్క సారి తన ఒడిలోకి తీసుకొని ఒక ఆనందానుభూతినీ ఇస్తుంది……

//రేపటి జ్ఞాపకం//

ఒళ్ళంతా ఇంకా ఒంగోలు వాసనలే
శాలువల గరగరలూ, కాగితాల రెపరెపలూ
డాలియా నుంచి డయాస్పోరా వరకూ
ఛాసర్ నుంచి ఛాసో వరకూ మాట్లాడుకున్నాక..

కరతాళ, గంగాళాల ధ్వనిముద్రలో
ఒకింతలా మునిగాక వీనులనుంతా వాసనలే
అక్షరయోధుని ఆప్యాయకౌగిలింతా, ‘మహాస్వప్న’ తో చాలినంత కరచాలనం
కొన్ని కొత్త నవ్వులూ, కొన్ని ఆదుర్దా పలకరింపులూ
కొన్ని అయోమయ మందస్మితాలు
ఆ కొన్ని ఆందోళనమొహాలు మనకు తెలిసో తెలియదో తెలీదు
చూసినట్టే ఉందికానీ చూళ్లెదుగా, మరెలా?
అజ్నభీల చిరునామా లెక్కడి ఈ ఆల్జీబ్రాలో
పెళ్ళి సందడీ, పండగ హడావుడీ వెరసి
ఎవరికి ఎవరూ ఏమీ కాలేని కొంగ్రొత్త విహ్వలం
ఎక్కడికక్కడ మనసున్న సాలభంజికలతో స్వాగతం
వెచ్చని ఆదరింపుతో ఆనందక్షణాలని పున:నిర్వచించటం
ఏం జరిగిందక్కడ మరి?

పాతకొత్త వాక్యాల పరిష్వంగపరిణామంలో
వెన్నెలనింపుకున్న చరిత్రపుటల్ని ప్రేమగా రాసేయటమేనా
లేక ప్రతీకలయికనీ ముద్రీకరించి అవ్యానుజ శబ్దమంజరిని పంచటమా
అవన్నీ ఉన్నాయక్కడ
గడ్డపెరుగు పరుగుల్లోనూ, గరిటెడు నెయ్యి ఉరకల్లోనూ
ఒళ్ళంతా ఒంగోలు వాసనలే.
—- శ్రీనివాస్ వాసుదేవ్ —-

(Visited 464 times, 1 visits today)